Homeనిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై 9న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై 9న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

- Advertisement -

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ప్రజలపై ధరల భారాలు మోపుతున్న కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన సీపీఐ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 2014 నుంచి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని, ప్రజల ఆదాయాలకు మించి నిత్యావసరాల ధరలు పెరుగుతూ… పేద, కార్మిక, రైతు, చిరు వ్యాపారి, మధ్యతరగతి కుటుంబాలపై మోయలేని భారం మోపుతున్నాయని, బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు వంటి పప్పుధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. వంట నూనె, పాలు, చక్కెర, ఉప్పు ధరలు సైతం మండిపోతున్నాయని, కూరగాయల ధరలు చూస్తే… సామాన్యుడికి ప్రతిరోజూ కొత్త షాక్ ఎదురవుతోందని వివరించారు. ఉల్లి, టమోటా, బంగాళా దుంప, వంకాయ తదితర కూరగాయల ధరలు సామాన్యులను అతలాకుతలం చేస్తున్నాయని పేర్కొన్నారు. అవి ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో సామాన్యుడికే కాదు… రైతుకూ అర్థంకాని పరిస్థితి నెలకొందని, ఇది సాధారణ ధరల పెరుగుదల కాదని, ప్రజల జీవనంపై జరుగుతున్న ఆర్థిక దాడి అని తెలిపారు. పాలకుల ప్రజావ్యతిరేక విధానాల ఫలితంగా నిత్యావసరాల ధరలకు హద్దూ, అదుపూ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఒకవైపు వంటింట్లో మంటలు మండుతుంటే, మరోవైపు సామాన్యుడి జేబులో చిల్లిగవ్వ లేకుండా పోతోందని, కార్మికుడి కూలి పెరగడం లేదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని, చిరువ్యాపారుల వ్యాపారం తల్లకిందులైందన్నారు. మధ్యతరగతి కుటుంబానికి వచ్చే నెల జీతం నెలాఖరుకు చేరకముందే ఖర్చయిపోతున్న పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ప్రజల ఆదాయాలు పెరగకపోయినా, మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెరుగుతున్నాయని, ధరల పెరుగుదల భారాన్ని ప్రజలపై మోపుతూ జీవించే హక్కునే ప్రశ్నార్థకం చేస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదని, ధరల పెరుగుదల నుంచి వినియోగదారుడికి ఉపశమనం లేదన్నారు. బియ్యం కిలో ధర రూ.75కు ఎగబాకడంతో సామాన్యుడి కుటుంబ బడ్జెట్ మరింత భారంగా మారిందన్నారు. ధరల భారంతో పేదవాడి పళ్లెంలో ఆహారం తగ్గుతోందని, పోషకాహారం దూరమవుతోందని పేర్కొన్నారు. రైతు పొలంలో పంటకు తక్కువ ధర, మార్కెట్‌లో వినియోగదారుడికి ఎక్కువ ధర, ఈ రెండు ధరల మధ్యలో దళారులు, నిల్వదారులు, కార్పొరేట్ వ్యాపార వర్గాలు మాత్రం లాభాలు దండుకుంటున్నాయని, రైతు నష్టపోతుండగా, వినియోగదారుడు భారం మోస్తున్నాడని తెలిపారు. 2014 ఏప్రిల్‌లో దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.72.26, డీజిల్ ధర రూ.55.49 ఉండగా… 2026 సెప్టెంబర్‌లో పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.20కు చేరాయన్నారు. ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారులకే పరిమితం కావడం లేదని, రవాణా ఖర్చులు, వ్యవసాయ పెట్టుబడులు, సరకు రవాణా వ్యయాలు పెరిగి… చివరకు నిత్యావసర వస్తువుల ధరపై దాని ప్రభావం పడుతోందని, ఇంధనం ఖరీదైతే అన్నింటా భారం పడుతుందని పేర్కొన్నారు. వంటగ్యాస్ ధర పెరుగుదల పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు. గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించి… పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ ధరల దోపిడీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, నల్లబజారు, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, దళారీ వ్యవస్థను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. మార్కెట్‌పై ప్రభుత్వ నియంత్రణను బలహీనపరచడంతో ధరలను వ్యాపార దళారులు, నిల్వదారులు ఇష్టానుసారం నిర్ణయించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థ, నిల్వదారుల దోపిడీని అరికట్టాలని, ప్రజల కొనుగోలు శక్తి పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల నుంచి నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల వరకు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో ప్రజానీకం పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు