నాలుగున్నర దశాబ్దాలు. శంకర వరప్రసాద్‌తో నా స్నేహం. తెర మీదే కాదు… థియేటర్ బయట కూడా. ఆ ఖైదీ చేతిలో నేను బందీ అయ్యాను. ఆ తర్వాత రెండక్షరాల టైటిల్‌తో వరుసగా వచ్చిన నాలుగైదు సిన్మాలు కళ్ల ముందే తుస్సు మంటే వెండితెర చింపేయాలనిపించింది ఆ పసి వయసులో. మనోడు కదా… కొడతాడులే హిట్టు అని నా భుజం మీద నా చెయ్యే వేసుకుని ధైర్యం చెప్పుకున్నాను. టెరమ్ ఫీజు కట్టేందుకు ఇంకా సమయం ఉన్నా… విజేత సినిమా కటౌట్‌కి దండలు ఎవడు వేస్తాడని టెరమ్ ఫీజుని ఆ శంకర వరప్రసాద్‌కి దండగా మార్చేశా. అప్పటికింకా నా వయసు నిండా పదహారే. విజేత హిట్ కొట్టాలని కోరుకోవడం ఏ అభిమాని అయినా చేస్తాడు. కానీ, అంతకుముందు మొదటి రోజు తొలి ఆట చూసిన సినిమాలు ఫట్ అయ్యాయనే సెంటిమెంట్ తెలియని నాకు నేనే లోలోపల ఓ స్టేట్మెంట్ ఇచ్చేసి మా అమలాపురం వెంకటేశ్వర స్వామి గుళ్లో విజేత కోసం గంటన్నర కళ్లు ముసుకున్నాను. ఒక్క దేవుడ్ని నమ్ముకుంటే కష్టమని తెలియదు కానీ, కార్తీకమాసంలో సోమవారం నాడు చేసిన ఉపవాస ఫలితం ఇప్పుడు వస్తుందేమోనని భ్రమించి చంద్రమౌళేశ్వర స్వామి వారికి కర్పూరం, అరటిపళ్లు నివేదించాను. ఊరి చివర పొలాల మధ్యలో ఉన్న శ్రీనివాస థియేటర్‌కి వెళ్లి విజేత మొదటాట చూసి బయటకు వస్తున్న వారిని “ఎలా ఉంది బొమ్మ” అని అడిగా. ఇప్పుడు మైకులు పట్టుకుని థియేటర్ నుంచి వస్తున్న వారిని అడుగుతున్నారు చూడండి అలా అన్నమాట. “ఆయ్…పాటలు, టెప్పులు బాగున్నాయ్ కానీ ఒక్క ఫైటింగూ లేదూ” అని నలుగురైదుగురు అంటే శరీరంలో సిరలు, దమనులు పని చేయడం మానేశాయ్. “శంకరవరప్రసాదు మాస్ కదా…ఈ కుటుంబ యవ్వారాలు నచ్చలేదీళ్లకి… దేవుడు మన యందు లేడు” అనుకుని వెంకటేశ్వరస్వామికి తలనీలాలు సమర్పించే పనిని వాయిదా వేసేద్దాం అనుకున్నా. అక్కడి నుంచి రెండు జేబుల్లోనూ చేతులెట్టుకుని శ్రీనివాస థియేటర్ పక్కనే పారుతున్న కౌశిక కాలువ దగ్గరకి వెళ్లిపోయా. మా శంకర వరప్రసాద్ అభిమాన సంఘం వాళ్లు కనపడతారేమోనని చూస్తే వాళ్లంతా శ్రీనివాస థియేటర్ వెనుక నుంచి వెళ్లిపోయారని ఆ తర్వాత తెలిసింది. అలా కౌశిక కాలువ దగ్గరకు వెళ్లే దానికి ఆనుకుని ఉన్న శ్మశానవాటికలో శవాలు కాలుతున్నాయి. ఆటిని చూసి చచ్చిపోవాలనుకోలేదు కానీ… ఈ విజేత కూడా చీదేసిందని తెలిస్తే మిగిలిన హీరోల అభిమానులు మనల్ని బతకనిస్తారా అని బెంబేలెత్తిపోయా. ఇక జన్మలో శంకర వరప్రసాదు వద్దు, అభిమానాలు వద్దు. టెరమ్ ఫీజులు కట్టేసి బుద్ధిగా చదువుకుందాం అని నిర్ణయించుకుని ఆటేపే చూడలేదు. ప్రేమ, అభిమానం, పిచ్చి ఊరుకోదు కదా… అంచేత ఏం జరిగింది అంటే…ఓ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి శ్రీనివాసాకి వెళ్లాను. జనం ఉన్నారు. థియేటర్లోంచి ఏడుస్తూ వస్తున్న మహిళా ప్రేక్షకులు కనిపించారు. “ఇదేటి బొమ్మ ఇంతలా ఏడిపించేసిందా” అని భయపడిపోయాను. ఇదే విషయాన్నే ఎడం చేత్తో కొంగుతో ముఖం తుడుచుకుంటున్న ఓ మహిళని అడిగితే… “సెల్లి పెళ్లి కోసం కిడ్ని కోసేసుకున్నాడు ఆ కుర్రాడు. ఇలాంటోడు ఇంటికొకడుండాలి” అంటూ ముక్కు చీదేసిందావిడ. “మన శంకర వరప్రసాద్ మాస్ అనుకున్నాం కానీ క్లాస్‌గా మహిళల దగ్గరకి వెళ్లిపోయాడు. శభాసో శంకర వరప్రసాద” అనుకుని తర్వాత ఆటకి బాల్కనీ టికెట్ కొనేసి నేల టిక్కట్లో కూర్చున్నాను. శంకర వర ప్రసాద్‌ని దూరం నుంచి కాదు… దగ్గర నుంచి చూసేయాలని. నేల టిక్కట్టే కొనుకోవచ్చు కదా అని లాజిక్కులు వద్దు. సినిమా కలెక్షన్లు పెరగాలంటే ఇలాగే చేయాలనే పిచ్చి… ప్రేమ… రెండు కలిసి పిచ్చి ప్రేమ. ఆ తర్వాత శంకర వరప్రసాద్ నటించిన సినిమాలు అటు మాస్‌ని, ఇటు క్లాస్‌ని తెగ మెప్పించేశాయ్. ఇది కధ కాదు, 47 రోజులు, న్యాయం కావాలి సినిమాల్లో విలన్‌గా కనిపించినా ఎందుకో శంకర వరప్రసాద్ మా తరానికి మాత్రం ఎప్పుడూ హీరోనే. శంకర వర ప్రసాద్ అలా ఎదిగి ఎదిగి మెగాస్టార్ అయ్యారు. నేను కూడా మరోవైపు ఒదిగి ఎదిగి సీనియర్ జర్నలిస్టు అయ్యాను. శంకర వర ప్రసాద్‌ని కొందరు ఏమార్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని ఆనాటి ఆయన స్నేహితులమైన మాకు ఓ నమ్మకం. మా నమ్మకం నిజమైందనుకోండి. స్నేహితులం కదా… అంచేత అలా జరిగిందన్నమాట. ఇలా మా స్నేహం దశాబ్దాల పాటు ఎదిగింది. ఇదిగో ఇప్పుడు మళ్లీ సంక్రాంతికి మా శంకర వర ప్రసాద్ “మన శంకర వర ప్రసాద్ గారు” అంటూ వచ్చేశారు. పెద్ద వాళ్లం అయ్యాం కదా… కూతంత ఆలస్యంగా శంకర వరప్రసాద్‌ని కలిసాను. అందరూ బాగున్నారు మన శంకర వర ప్రసాద్ గారూ అంటే వెళ్లాను. బాగున్నారు… కానీ… ఏ వయసులో ఆ ముచ్చట అన్నారు కదా…అదే లోపించింది శంకర వర ప్రసాద్‌గారిలో. కాస్త పెద్దరికంగా ఉంటే బాగుండును కదా అనిపించింది. మీసాల పిల్ల మనకెందుకు శంకర వర ప్రసాద్ గారు అని చెప్పాలనిపించింది. విన్నా వినకపోయినా.. పాత స్నేహితుడ్ని కదా…చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా…అందుకన్న మాట ఇలా చెబుతున్నాను.
సీనియర్ జర్నలిస్టు, 99120 19929
నేను… శంకర వరప్రసాద్…
- Advertisement -


