Homeపత్తి రైతు కుదేలు

పత్తి రైతు కుదేలు

- Advertisement -

ఇటు తుపానులు… అటు ధరల పతనం
తగ్గిన దిగుబడి… కొనుగోలుకు ముందుకు రాని సర్కారు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో పత్తిరైతు కష్టాలు వర్ణనాతీతం. అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఓ పక్క…పండిన పంటకు గిట్టుబాటు ధర లేక మరోపక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, తుపానుల ప్రభావం, మార్కెట్‌లో ధరల పతనం వంటి కారణాల వల్ల తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నారు. పంట చేతికందే సమయంలో తుపాను రావడంతో తీవ్రంగా నష్టపోయారు. రెండేళ్ల క్రితం తీవ్ర కరువుతో అల్లాడిన రైతులు… ఈ ఏడాది అతివృష్టి కారణంగా కుదేలయ్యారు. అధిక వర్షంతో పొలంలో నీరు చేరడంతో పత్తి పంటంతా ఎర్రగా మారింది. గులాబీ రంగు పురుగుసోకి పత్తి మొగ్గ, పూత, పిందె, కాయ రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్ని మందులు వాడినా అదుపు కాని పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా పత్తి కాయలు దెబ్బతిన్నాయి. తేమ శాతం 12 నుంచి 18 వరకూ ఉండడంతో నాణ్యత తగ్గి… వ్యాపారులు తక్కువ ధరలు మాత్రమే ఆఫర్‌ చేస్తున్నారు. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా… సుమారు ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం యాప్‌, ఆధార్‌ ఆధారిత ఈ-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు పూర్తిగా డిజిటలైజ్‌ చేయబడిన విధానంలో నిర్వహిస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపాస్‌ కిసాన్‌ యాప్‌ను రాష్ట్ర సీఎం యాప్‌తో అనుసంధానం చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం సకాలంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం రైతులకు మరింత ఇబ్బంది కలిగించింది. ఈ కారణంగా చాలామంది రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారు. ప్రభుత్వ నిర్ణీత ధర కంటే రూ.500-రూ.1000 తక్కువ ధరకు పత్తి అమ్ముకుంటున్నారు. పత్తి సాగు ఖర్చులు కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు భారీగా పెరగడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. పైగా చీడపీడల ప్రభావం, ఆకస్మిక వాతావరణ మార్పులు పంట దిగుబడిని తగ్గించాయి. రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో చాలామంది పంటను కోసి అమ్మే పరిస్థితి లేక పొలంలో వదిలేయాల్సి వస్తోంది. దాదాపు లక్షలు ఖర్చుపెట్టి పత్తి సాగుచేస్తే పెట్టుబడి సైతం రాలేదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్న పత్తిని పశువులకు మేతగా వదిలేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతులు పంటలను దున్నేశారు. పత్తికి అధిక ధరలు ఉన్నాయన్న ఆశతో సాగుచేస్తే చివరికి అప్పులే మూటగట్టుకో వాల్సిన దుస్థితి ఏర్పడిరదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటను తొలగించి మిరప, మొక్కజొన్న, వేరుశనగ, కంది, జొన్న వంటి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టానికి పరిహారం ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పత్తి సాగు చేసే రైతులు ఆర్థికంగా తిరిగి కోలుకోవాలంటే మార్కెట్‌ ధరలపై కఠిన నియంత్రణ, మధ్యవర్తుల దోపిడీని అరికట్టే చర్యలు అత్యవసరమని అభిప్రాయపడు తున్నారు. మరోవైపు రాష్ట్రంలో దెబ్బతిన్న పత్తి రైతులను ఆదుకునేందుకు సాయం కోరుతూ కేంద్ర మంత్రికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు