Homeపరాయి దేశాలకు‘రేషన్‌’ పరుగు!

పరాయి దేశాలకు‘రేషన్‌’ పరుగు!

- Advertisement -

. కాకినాడ, చెన్నై పోర్టులకు రాచమార్గంలోనే రవాణా
. మాఫియాతో చేతులు కలిపిన అధికారులు, పాలకులు
. మామూళ్ల మత్తులో విజిలెన్స్‌… ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు

వైసీపీ ప్రభుత్వం ‘ఆర్గనైజ్డ్‌’ మాఫియాను పెంచి పోషిస్తుందంటూ గతంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పించినా… కూటమి పాలనలోనూ మాఫియాకు ఎదురే లేకుండా పోతోంది. ప్రభుత్వం కళ్లుగప్పి టన్నుల కొద్దీ పీడీఎస్‌ బియ్యం సముద్ర మార్గం ద్వారా విదేశాలకు తరలిపోతోంది. ప్రభుత్వాలు ఏవైనా తమను అడ్డుకునే పాలకులే లేరంటూ అక్రమార్కులు సవాల్‌ విసురుతున్నారు. పౌరసరఫరాల శాఖలోని కొందరు అవినీతి తిమింగలాలకు తోడు అధికార పార్టీ నేతలు వెన్నుదన్నుగా నిలుస్తుండడంతో మూడు బస్తాలు… ఆరు లారీలు అన్న చందంగా యథేచ్ఛగా తరలిపోతోంది. అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాల్సి ‘విజిలెన్స్‌’ కూడా మామూళ్ల మత్తులో జోగుతోందన్న ఆరోపణలు హల్‌చల్‌ చేస్తున్నాయి. కొందరు అధికారులే … అక్రమ సంపాదనకు ఆలవాటు పడిన పాలకులతో మధ్యవర్తిత్వం నెరిపి సంధి చేకూరుస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసు అధికారులు సైతం నెలవారీ మామూళ్లు వసూలు చేస్తు అక్రమ వ్యాపారంలో భాగస్వాములు కావడంతో పేదల కడుపునింపాల్సిన బియ్యం పరాయిదేశాలకు పరుగుపెడుతోంది.

విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ కళ్లుగప్పి టన్నుల కొద్దీ బియ్యం సముద్రమార్గం ద్వారా విదేశాలకు తరలిస్తోంది. పౌరసరఫరాలశాఖకు చెందిన కొందరు అవినీతిపరులు … అక్రమార్కులతో కుమ్మక్కై ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌ బియ్యం అక్రమ రవాణాదారులనైనా… సహకరించే అధికారులనైనా వదలబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించినా రాచమార్గంలోనే తరలిపోతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌…పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి స్వయంగా కాకినాడ పోర్టును సందర్శించి రవాణాకు సిద్ధంగా ఉన్న రేషన్‌ బియ్యం… షిప్‌లను సీజ్‌ చేయాలంటూ అప్పట్లో ఆయన ఇచ్చిన ఆదేశాలు సంచలనం రేకెత్తించినా… కట్టడికి ప్రత్యేకంగా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చేసినా అక్రమ రావాణా అడ్డుకునే పాలకులే కరువయ్యారు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటేనని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి చెన్నె పోర్టు, ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు కాకినాడ పోర్టు ద్వారా యథేచ్ఛగా రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ జరుగుతోంది. ఇదేమీ అధికారులకు తెలియకుండా జరుగుతున్న తంతు కాదు అని స్వయంగా చికటి వ్యాపారులే వ్యాఖ్యానిస్తున్నారంటే రేషన్‌ మాఫియా ఏ స్థాయిలో వేళ్లూనుకుందో ఇట్టే అర్థమౌతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కోటి 17 లక్షల మంది లబ్దిదారులకు ప్రతి సభ్యుడికి ఐదు కేజీలు వంతున ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. నిరు పేదలందరికీ మూడు పూటలా నాణ్యమైన బియ్యంతో పట్టెడు మెతుకులు పెట్టాలన్న సదుద్దేశ్యంతో ప్రభుత్వం కేజీ బియ్యాన్ని రూ.46.10 పైసలకు కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తోంది. కొంతమంది డీలర్‌లు… లబ్దిదారులు బియ్యం తీసుకుంటున్నట్టుగా బయోమెట్రిక్‌ తీసుకుంటూ నగదు చెల్లిస్తున్నారు. రేషన్‌ బియ్యంలో దాదాపు 50 శాతం మాఫియాకు విక్రయిస్తున్నారు. వ్యాపారం మూడు బస్తాలు… ఆరు లారీలు అన్నచందంగా సాగుతోంది. 2019-2024 మధ్యలో 76,854 మెట్రిక్‌ టన్నుల పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తూ 9,664 మంది అరెస్టయ్యారు. గతంలో ప్రతిపక్షాలు… ఆర్గనైజ్డ్‌ మాఫియాను ప్రభుత్వం తయారుచేసిందని విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలో 60 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేసి, అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులతో పాటు పీడీ యాక్ట్‌ ఉపయోగించారు. 512 వాహనాలను అదుపులోకి తీసుకుంది. కాకినాడలో 50 వేల మెట్రిక్‌ టన్నులు స్వాధీనం చేసుకుంది. ఇందులో 25,86 మెట్రిక్‌ టన్నులు పీడీఎస్‌ బియ్యంగా గుర్తించి 13 సంస్థలపై కేసు నమోదు చేశారు. అయితే… ఓ వైపు పౌరసరఫరాల శాఖ తనిఖీలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నా… మరోవైపు యథేచ్ఛగా పేదల బియ్యం పొరుగు దేశాలకు పరుగుపెడుతున్నాయి. గతంలో మాఫియా గుట్టుచప్పుడు కాకుండా రేషన్‌ బియ్యాన్ని ఇతర దేశాలకు నౌకల ద్వారా ఎగుమతి చేసేవారు. అయితే ప్రస్తుతం కొందరు అధికార పార్టీ నేతలు రేషన్‌ మాఫియాకు అభయహస్తం ఇస్తున్నారన్న ఆరోపణలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో వారి అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోతుంది. కొన్ని జిల్లాల్లోని నేతలు… బియ్యాన్ని దారి మళ్లించే ప్రక్రియకు పచ్చజెండా ఊపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గత రెండు నెలలుగా ఈ తరహా దోపిడీ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అక్రమార్జనకు అలవాటు పడ్డ అధికార పార్టీ నేతలు పనిగట్టుకుని రేషన్‌ బియ్యం వ్యవహారంపై దృష్టి పెట్టడంతో పాటు అందుకు సంబంధించిన మాఫియాను పిలిపించుకుని రహస్యంగా భేటీ అయి వారితో మామూళ్ల వ్యవహారాన్ని చక్క బెట్టుకుంటున్నారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా సజావుగా సాగేందుకు ప్రాంతాల వారీగా మాఫియా పంచుకుంది. ఇందుకు పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులే మధ్యవర్తిత్వం నెరిపి సంధి చేకూరుస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. డీలర్లు కిలో బియ్యం రూ.10 కి కొనుగోలు చేస్తే, వారి నుంచి మాఫియా రూ.12కి కొనుగోలు చేస్తుంది. వీరు విదేశాలకు ఎగుమతి చేసే వారికి రూ.18కి సరఫరా చేస్తారు. ప్రతి నెలా 15వ తేదీ రేషన్‌ బియ్యం పంపిణీ ముగిసిన తర్వాత లారీల్లో వీటిని ఒప్పందం చేసుకున్న వ్యాపారుల సూచనలకు అనుగుణంగా తరలిస్తున్నారు. ఇదంతా అమ్యామ్యాలకు అలవాటుపడిన కొందరు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఇందుకోసం రూ. లక్షల్లో నెలవారీ మామూళ్లు వీరికి అందుతున్నాయని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాల్సి విజిలెన్స్‌ అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వీరే స్వయంగా అక్రమ రవాణాకు రూట్లు చూపుతున్నారు. ఇటీవల పోలీసు అధికారులు కొందరు సైతం అక్రమ వ్యాపారంలో భాగస్వాములైనట్లు సమాచారం. తమవరిధిలో గోడౌ న్‌ లు నిర్వహించడంతో పాటు అక్కడి నుంచి రవాణా చేస్తున్నందుకు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నట్లు చెపుతున్నారు. దీంతో రేషన్‌ బియ్యమం రాచమార్గంలోనే ఓడరేవుకు తరలించి జేబులు నింపుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు