. సీపీఐ శ్రేణులకు డి.రాజా పిలుపు
. మోదీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో ముప్పు
. ముగిసిన సీపీఐ 25వ జాతీయ మహాసభలు
చండీగఢ్‌ః భారతదేశం సంక్లిష్టదశలో ఉందని, మతోన్మాద, ఫాసిస్టు, కార్పొరేట్ శక్తులు దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారాయని, ఈ పరిస్థితుల నేపథ్యంలో నిరంతర పోరాటాలతో ఆ శక్తులను ప్రతిఘటించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్నది ఉద్యమశకమని అభివర్ణించారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో మోదీ సర్కారు ప్రజలకు పూర్తి అన్యాయం చేస్తోందన్నారు. మనకు ఇతర అవకాశాలేమీ లేవని, ప్రజాసమస్యలపై ఉద్యమాలే శరణ్యమని, అవసరమైతే, భావసారూప్య పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుపోవాల్సిన తరుణం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. సీపీఐ 25వ జాతీయ మహాసభలు చండీగఢ్‌లోని సురవరం సుధాకరరెడ్డి నగర్‌లో ఐదు రోజల పాటు ఘనంగా జరిగాయి. మూడు రోజుల క్రితం రాజా ప్రవేశపెట్టిన ముసాయిదా రాజకీయ తీర్మానంపై ప్రతినిధులు సుదీర్ఘచర్చలు జరిపారు. తీర్మానంలోని అంతర్జాతీయ, జాతీయ పరిణామాలతోపాటు కర్తవ్యాలకు సంబంధించి వివిధ అంశాలకు సవరణలు చేసిన అనంతరం చివరి రోజు గురువారం ఈ చర్చకు రాజా సమాధానమిచ్చారు. మితవాద, మతోన్మాద శక్తులు ఎన్నికల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కుట్రలు పన్నుతున్నాయని, ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత బీజేపీ ఇప్పటికే మూడోసారి హస్తినలో అధికారంలోకి వచ్చిందని, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత రాజ్యాంగం కనీవినీ ఎరుగని రీతిలో ప్రమాదంలో పడిరదని, పార్టీ కార్యకర్తలు అప్రమత్తం కావాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే సమస్యలన్నింటికీ పరిష్కారమని తెలిపారు. ఎర్రజెండా నీడలోనే జనం సేదతీరుతారని అన్నారు. సమస్యలను తెలుసుకోవడానికి కార్యకర్తలు జనంలోకి వెళ్లేలా మహాసభ ప్రతినిధులు దిశానిర్దేశం చేయాలని కోరారు. జర్మనీ, ఇటలీ దేశాల్లో అలనాటి నియం తల ఫాసిజం వేరు, భారత్‌లో ఫాసిజం రూపురేఖలు వేరని వివరించారు. కులం, మతం ప్రాతిపదికగా విభజన చేసి… జనాన్ని ఏమార్చి విభజన రాజకీయాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే ఇక్కడి ఫాసిజం ప్రధాన లక్ష్యమని, దాన్ని సంఫ్‌ు పరివార్ శక్తులు పథకం ప్రకారం అమలు చేసే పనిలో ఉన్నాయని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగా న్ని అనుసరించడం ఒక్కటే మార్గమని, అంబేద్కర్ చేసిన సూచనలే నేటికీ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. కాగా, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ నిర్మాణ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు.


