నల్లి ధర్మారావు
చీశీఅవ ఎut శీతీtష్ట్రశీdax ష్ట్రiఅdus aతీవ aశ్రీశ్రీశీwవd…పూరి జగన్నాథ ఆలయ ప్రవేశ ద్వారానికి (సింహద్వారం) ఇరువైపులా, రాతి పలకల మీద ఈ ప్రకటన కనిపిస్తుంది. హిందువులు కాని వారికి ప్రవేశం లేదన్నది దీని అర్థం. ఇది, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఒరియా భాషల్లో రాసి ఉంటుంది. సర్వం జగన్నాథం అనే భావనకే ఇది విరుద్ధం. జగన్నాథం అంటే యావత్ జగత్తుకు నాథుడు (విశ్వనాధుడు). కళింగను పాలించిన గంగ వంశ చక్రవర్తి అనంతవర్మ చోడ గంగ దేవ్ కాలంలో (క్రీ.శ.1078-1148 ) ఆలయ నిర్మాణం జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఆనాటికి ఆయన శైవుడు. రాజ్యంలో ఎన్నో శివాలయాలు నిర్మించాడు. 1174 లో పునర్నిర్మాణం ప్రారంభమై, 1230లో అనంగా భీమదేవ్ కాలంలో పూర్తయింది. అనంత వర్మ కాలంలోనే గంగ వంశ రాజధాని, ప్రస్తుత శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖ లింగం నుంచి కటక్‌కు మారింది. క్రీ.శ.8-9 శతాబ్దాల మధ్య శంకరాచార్యులు స్థాపించిన నాలుగు జగద్గురు పీఠాల్లో పూరి ఒకటి. ఆయన ప్రారంభించిన చార్‌థామ్ యాత్రలో కూడా దీన్ని చేర్చారు. 12వ శతాబ్దంలో శ్రీ వైష్ణవ మత ప్రవక్త రామానుజాచార్యులు ఎన్నో శైవ క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చారు. పూరి, శ్రీకూర్మం, సింహాచలం ఆయన మార్చిన జాబితాలో ఉన్నాయి.
గంగ వంశంలోని కడపటి రాజులు వైష్ణవాన్ని స్వీకరించారు. ఆనాటికి శైవ, వైష్ణవాలు ఒకటిగా లేవు. హిందూ మతం అనే పేరు లేదు. రామానుజులు చాలా వరకు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. విద్య, ధన, అగ్రవర్ణాల వారికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. మానవులందరూ వైష్ణవులే కానీ, వైష్ణవు లందరిలోనూ రామానుజ అంశ లేదు. ప్రతి మానవుడిలోనూ మాధవుడు ఉన్నాడని, మానవ సేవయే మాధవ సేవ అన్నారు రామానుజులు. శంకరాచార్యుడు సోహం (అది నేనే) అంటే, రామానుజులు దాసోహం అన్నారు. వైష్ణవులు సాటి మనిషికి దాసులన్నారు. ఒరిస్సా, బెంగాల్లో వైష్ణవ ప్రభావం ఉన్న వారికి పేరు చివర ‘దాసు’ అని ఉంటుంది. కానీ, పూరి జగన్నాథ్‌లో పూజారి వర్గం ఆధిపత్యం ఎక్కువ (పండాలు). కుల వివక్షను సంప్రదాయంగా మార్చింది వీళ్లే! క్రీ.శ. 16 శతాబ్దం నాటికే పూరి జగన్నాథంలో కుల వివక్ష ఉంది. బెంగాల్ నుంచి చైతన్య మహాప్రభువు (భక్త చైతన్య దేవుడు) 1509లో పురి జగన్నాథ్ వచ్చారు. ఇక్కడ సంప్రదాయాల పేరుతో అమలు జరుగుతున్న ఎన్నో అమానవీయ పద్ధతులను చైతన్యుడు సంస్కరించాడు. ఆనాటికే, ఆలయంలోకి శూద్రులకు, అస్పృశ్యులకు ప్రవేశ అర్హత లేదు. చైతన్యుని సమకాలికుల్లో శూద్ర మహాకవులు ఎందరో ఉండేవారు. వారిలో ‘ జగ మోహన రామాయణం’ రచించిన బలరామదాసు ఒకరు. అతని తండ్రి సోమనాథ మహాపాత్ర పూరి గజపతుల దివాణంలో మంత్రి. ఆ రోజుల్లో, శూద్రులను రథం కూడా ఎక్కనిచ్చేవారు కాదు. మంత్రి కుమారుడిన్న ధైర్యంతో, బలరాందాస్ రథం ఎక్కితే, అది చూసి, రాజుకు చెప్పి, పండాలు అతన్ని కట్టించి, కొట్టించారు. ఆ అవమానం భరించలేక, ఉక్రోషంతో సముద్ర తీరానికి వెళ్లి బలరాందాసు, జగన్నాథుడిని పరుష పదజాలంతో దూషిస్తూ 750 పద్యాలు రచించాడు. ఆ కావ్యం పేరు ‘భావ సముద్ర’. ఈ పద్యాలు చదివితే సనాతన శ్రీ వైష్ణవులకు కూడా ఒళ్లు జలదరిస్తుంది. గర్భగుడిలోకి ప్రవేశ అర్హత లేని శూద్రులు, అస్పృశ్యులు దర్శించడానికి వీలుగా, ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ‘పతిత పావన’ అనే విగ్రహం పెట్టారు. దీని ప్రకారం, శూద్రులు, అస్పృశ్యులు పతితులని అర్థం. పతితులంటే, శీలం కోల్పోయిన వారు. అధర్మ కార్యాలు చేసేవారు. అపవిత్రులు.
ఈ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ కవిత ఎవరికైనా గుర్తుకు వస్తుంది. “ పతితులారా! భ్రష్టులారా! బాధాసర్ప ధ్రష్టులారా! ఏడవకండేవకండి.. వస్తున్నాయ్… జగన్నాధ రధ చక్రాల్ వస్తున్నాయ్! “- శ్రీశ్రీ భావన వేరు.
కానీ, నిజంగానే, గర్భగుడిలోకి ప్రవేశ అర్హత లేని వారి దర్శనం కోసమే, విగ్రహాలను రథంపై ఉంచి, ఊరేగించే సంప్రదాయం (రధయాత్ర). చైతన్య ప్రభువు సంస్కరణలతో పూజారి వర్గం రాజీపడటం ప్రారంభించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జీవిత కాలం వరకు, కుల వివక్ష కొనసాగిందనడానికి నిదర్శనం ఆయనకు కూడా ప్రవేశానికి అర్హత లేదనడం. అతడు, పిరళీ బ్రాహ్మణుడు కావడం వల్ల అర్హత లేదన్నారు. విశ్వకవికి ఇచ్చిన గౌరవం ఇదీ! 1936లో మహాత్మాగాంధీ, వినోబాభావే అస్పృశ్యలను, ముస్లింలను వెంటబెట్టుకుని వచ్చి, దర్శనానికి వెళ్తామంటే, పూజారి వర్గం అడ్డుకుంది. 1945లో భక్త చైతన్యుడి భక్తి వైష్ణవ త్తవాన్ని, హరే కృష్ణ-హరే రామ ఉద్యమం ద్వారా ప్రపంచవ్యాప్తం చేసిన, ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తి వేదాంత స్వామిని కూడా అనుమతించలేదు. ఆయన వెంట విదేశీ భక్తులు ఉన్నారని సాకు చూపించారు. వారిని విడిచి, అతనికి మాత్రం అనుమతి ఇస్తామన్నారు. ఆయన అంగీకరించక, వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. క్రమంగా కుల వివక్ష అంతరించి, మత వివక్ష కొనసాగింది.
దాడులు, దోపిడీల వల్ల ముస్లింలపై ఆగ్రహం : మొఘల్ పాలనలో ఆలయం పై చాలా దాడులు జరిగాయి. సంపదను దోచుకున్నారు. సాక్షాత్తు, ఔరంగ జేబుతోనే, 17వ శతాబ్దంలో దాడులు ప్రారంభమయ్యాయి. ‘మదల పంజి’ అనే గ్రంథం ప్రకారం, 18 సార్లు దోపిడీలకు ,దాడులకు గురైంది. 1506లో కాలం పహాడ్ అనే ఆఫ్ఘన్ సేనాధిపతి దాడి చేసి, సంపద దోచుకోవడమే కాకుండా, విగ్రహాలను తగలబెట్టాడు. నిజానికి, ఇతడు హిందువు. ఇతని పేరు రాజీవ్ లోచన్ రాయ్. ముస్లిం పాలకుల కుటుంబానికి చెందిన యువతిని వివాహమాడి, సులేమాన్ కర్రాని సైన్యంలో సేనాధిపతిగా పనిచేసి చాలా హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఆలయ విధ్వంసకులు కాబట్టే, ముస్లింలకు ఆలయ ప్రవేశం నిషిద్ధం అన్నారు. ఈ సంప్రదాయాన్ని దేశీయ ముస్లింలకు కూడా వర్తింపజేస్తున్నారు.
బ్రిటీష్ పరిపాలనలో అపవిత్రం కాని గర్భగుడి : మన దేశానికి చివరి విదేశీ పాలకులు బ్రిటీష్ వారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం పూరీ జగన్నాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. యాత్రికుల పై పన్నులు వసూలు చేశారు. ఆలయ సంప్రదాయాలకు భిన్నంగా వారు ప్రవర్తించలేదు. మరోవైపు మత సంస్థల నిర్వహణలో తలదూర్చి, విగ్రహారాధనను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని బ్రిటీష్ పార్లమెంట్ అభిసంశించింది. దాంతో, ఖుర్దా రాజుకు, ఆయన వారసులకు వంశపారంపర్య పర్యవేక్షణ హక్కును ఇచ్చి, బ్రిటీష్ పాలకులు చేతులు దులుపుకున్నారు. కానీ, క్రైస్తవులకు కూడా ఆలయ ప్రవేశాన్ని నిషేధించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బౌద్ధమతం తీసుకున్నా , ఆనాటికి బౌద్ధులకు ప్రవేశ అనుమతి ఇవ్వలేదు. అంబేద్కర్‌ను అసృÎశ్యుడుగానే చూశారు.1980లో భారత ప్రధాని ఇందిరాగాంధీనే అడ్డుకోవడం మత వివక్షకు పరాకాష్ట. ఆమె భర్త పార్శీ మతస్థుడు కావడం వల్ల అనుమతించడం లేదన్నారు. ఉక్కు మహిళగా ముద్రపడిన ఇందిర, ఆలయ సంప్రదాయాన్ని గౌరవించి, భేషజాలకు పోకుండా, దూరంగా ఉన్న రఘునాథ లైబ్రరీ నుంచి దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. ఒక దేశ ప్రధానికి, తన దేశంలోని ఆలయంలో ప్రవేశించే అర్హత లేదనడం, సర్వం జగన్నాధమనే ప్రచారానికి తలవంపులు. హిందువుల తర్వాత ప్రవేశ అర్హతను, 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు కల్పించారు. అంతకుముందు వీరు చేసిన అపవిత్రత ఏమిటో, పూజారి వర్గమే చెప్పలేకపోయింది. 2025 లో థాయిలాండ్ రాణి మహాచక్రి శ్రీనిధోర్న వస్తే అనుమతించలేదు. థాయిలాండ్ పూర్తిగా బౌద్ధ దేశం. ఆమెను అనుమతించకపోవడం, విదేశీ దౌత్య నీతిని, విలువలను కేంద్ర ప్రభుత్వం కూడా పాటించకపోవడం చాలా మందిని ఆశ్చర్యం కలిగించింది. కుల, మతాల దగ్గర ఉన్న పట్టింపులు, వాటికి చెందిన వారు ఇచ్చిన విరాళాలు, కానుకుల దగ్గర విడిచి పెట్టేశారు. 2006లో స్విట్జర్లాండ్ నుంచి ఎలిజ్ఙిత్ జిగ్గర్ అనే మహిళ వస్తే అనుమతించలేదు. కానీ, ఆమె ఇచ్చిన రూ.1.78 కోట్లను పవిత్రంగా అందుకున్నారు.
సజీవంగా సనాతనం…పరివార్ ప్రయత్నం!? : కుల వివక్ష ప్రస్తుతం పూరిలో లేదు. మత వివక్ష ఉంది. సనాతనం పేరుతో, హిందూ మతం, సంప్రదాయాల పేరుతో పరమత అసహనాన్ని ప్రదర్శిస్తున్న సంఘ్ పరివార్ ప్రయత్నాలను గమనించాలి. బీజేపీ కూటమి ప్రభుత్వ కదలికలను, పరివార్ భావజాలమే నిర్దేశిస్తుందని అర్థమైపోతుంది. 2015లో అన్యమత వ్యవస్థను ఒక సంప్రదాయంగా సోమనాథ్ దేవాలయంలోనూ అమలు చేయడం ప్రారంభించారు. 2025 జనవరిలో బద్రీనాథ్, కేదారినాథ్, గంగోత్రిలో ఈ సంప్రదాయాన్ని పాటించాలని ఆలయం ట్రస్ట్ (బికెటి) నిర్ణయించింది. ఈ సంప్రదాయం సనాతనం కాదు. ఇదే సమయంలో భారతదేశం పౌరసత్వ అర్హతలను ,బీజేపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించడాన్ని గమనించాలి. విదేశాలకు చెందిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవులకు భారతదేశం పౌరసత్వం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. భారతదేశం పౌరసత్వం ఉన్న అందరికీ, హిందూ ఆలయాల్లో ప్రవేశించే అర్హత లేకపోవడం విడ్డూరం!.
కవి, రచయిత, జర్నలిస్టు, సెల్ : 76609 67313


