సంగిరెడ్డి హనుమంత రెడ్డి
నేటి “మన” పాలకుల దృష్టిలో మనుషుల ప్రాణాలకు, దేశ సంపదకు విలువ లేదు. ఎన్ని ప్రాణాలు పోయినా, ఎన్ని కోట్ల జన సంపద కూలిపోయినా ఖాతరు చేయరు. ప్రమాదాలు, విపత్తుల సందర్భాలలో మానవత్వం లేని పక్షపాత రాజకీయ ప్రకటనలు చేస్తారు. ఈ ప్రకటనలలో ఓటు బ్యాంకుల నిలువరింపు, కొత్త ఓట్లను పొందే ప్రయత్నం తప్ప మనిషితత్వం ఉండదు. నిజాయితీతో, నిబద్దతతో, పేదల కోసం, శ్రామికుల కోసం జీవితాలను అర్పించిన వామ పక్ష్మీయులను అర్థం చేసుకోలేని, ఓడరేవులు సముద్ర తీరాన ఉంటాయని తెలియని, వారసత్వ వీర యువ “నాయకులు” నేటి ప్రజా సంక్షేమ పరికల్పకులు. అధికారం కోసం రాజకీయ రంగులు మార్చిన ఆధునిక మతతాత్విక మాటల వీరులకు సొంత గుత్తేదారులు ఉంటారు. వారితో వారం లోపే చీలి గుంటలు పడని రోడ్లను వేయించుకోలేరు. కడుతుండగానే కూలిన వంతెనలను నిర్మించుకోలేరు. రోడ్లలో నడుములు విరిగి, బండ్లు వాటుపడి కాళ్లు చేతులు విరగ్గొట్టుకునే, ప్రాణాలు పోగొట్టుకునే కడగొట్టు మనుషులు వీళ్ల సంపన్నులు కాదు కదా ? ఆ సంపద నష్టంలోనే వీళ్ల ప్రయోజనాలు ఉన్నాయి. వీళ్లు తిరగటానికి హెలికాప్టర్లు ఉన్నాయి. ఎన్నికల రోడ్ షోలలో నేలపై తిరగవలసి వస్తే స్పీడ్ బ్రేకర్లను కూడా తీయించుకుంటారు. వాళ్లు పోగానే ఈ స్పీడ్ బ్రేకర్లను మళ్లీ అశాస్త్రీయంగానే అడ్డుకడతారు. స్పీడ్ బ్రేకర్ల నిర్మాణంలో సాంకేతిక మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, స్పీడ్ బ్రేకర్లు వాహనాలకు నష్టాన్ని, మనుషులకు భౌతిక లేదా మూగశరీర గాయాలను చేయకూడదని కోర్టులు చాలాసార్లు ్ల ఆదేశించాయి. స్పీడ్ బ్రేకర్లను అధికారులే కాదు, అపార్టుమెంట్ల ముందర ఎవరు పడితే వారు వేసుకుంటారు. వీరికి స్పీడ్ బ్రేకర్ల నిర్మాణ నియమాలు తెలియవు. అధికారులు పట్టించుకోరు. పట్టించుకుంటే మామూళ్లు తగ్గుతాయి. అతి వేగంగా దూసుకుపోయే వాసి తక్కువ ప్రైవేటు వాహనాలు, మోటరు సైకిళ్లు, తామే అమ్మిస్తున్న తమ గుత్తేదారుల (తమ పార్టీ వాళ్ల) సారా తాగి నడిపి బస్సులను కూల్చి వందల ప్రాణాలు తీసే డ్రైవర్ల తప్పులు తమ వాళ్లయిన బస్సుల యజమానుల పాపాలే. రోడ్లను ఆక్రమించిన, వాటిపై అడ్డంకులు కల్పించిన మామూళ్ల వాళ్లూ సర్కారు “సేవకులే”. ప్రైవేటు పరిశ్రమలలో యంత్రాలు పాతవి. చెడిపోయిన వాటిని బాగు చేయించ కుండా నడుపుతుంటారు. ప్రమాద నిరోధక పద్దతులు, శ్రామిక భద్రత ఏర్పాట్లు ఉండవు. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో పాలక జోస్యం, స్వీయ సౌజన్య పక్షపాత (పాలకులు చెప్పినట్లు చేసే) అధికారుల నియామకాలు నిత్యసత్యాలు. వీళ్లు పాలకుల, తమ సొంత ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఆ ప్రభుత్వ రంగ సంస్థ మునిగినా వీరికి లెక్కలేదు. కార్మికుల జీతభత్యాలు, సౌకర్యాలు, పని పరిస్థితులు, బాగోగుల గురించి పట్టించుకోరు. ఈ పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మి సొమ్ము చేసుకునే ప్రభుత్వ జాతీయ సంపద ద్రవ్యీకరణ విధానంలో అమ్మడానికి అనుకూలించే సంపద వృద్ధి మౌలిక సౌకర్యాలను కల్పిస్తారు. ప్రమాద నిరోధక చర్యలను, సిబ్బంది భద్రతను పట్టించుకోరు. ఫలితంగా ప్రైవేటు పరిశ్రమలలో శ్రామికుల చావులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ఆస్తి ప్రాణ నష్టాలు రెండూ తప్పవు. స్వయంభువు శంకరుడు నేటి “మన” ప్రభుత్వ నేత. ఈయనకు కొందరు హతులే కనబడతారు. తన పాత్ర గల మనుష్య హననాలలో సహజంగానే హతులు మనుషులుగా కనిపించరు. అందుకే 2002 గుజరాత్, 2013 ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్, బిహార్‌లోని ముజ ఫర్పుర్, దిల్లీలోని ద్వారకానగర్‌లలో “ఇతరుల (ముస్లింల)”పై జరిగిన వందల సామూహిక మానభంగాలు, దారుణ మారణకాండలలో వేల మరణాలు ఆయనకు కారు కింద పడే కుక్కల చావులు. ఈయన సర్కార్ అశ్రద్ధ వల్ల 2015 మణిపుర్ ఆకస్మిక దాడిలో 18 మంది, తానే కావాలని కల్పించిన జమ్ముకశ్మీర్‌లోని 2016 ఉరి దాడిలో 19 మంది, 2016 పఠాన్ కోట దాడిలో 7 మంది 2019 ఫిబ్రవరి 14 పుల్వామ ఉగ్రదాడిలో 40మంది భారత సైనికులు మరణించారు. పుల్వామ ఘోరకలి ఆ యేటి ఎన్నికల్లో ఆయన్ను గెలిపించింది. 2018 సుంజు వాన్ దాడిలో చనిపోయిన సైనికుల సంఖ్యను బయటపెట్టలేదు. 22.04.2025 న పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోయారు. అందులో ఒక క్రైస్తవ పర్యాటకుడు, అనేక మందిని కాపాడిన ఒక స్థానిక ముస్లిం ఉన్నారు. ఎక్కడా గుర్తుకురాని సింధూర్ ఇక్కడే గుర్తుకు వచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తోందని ప్రధాని, రక్షణ మంత్రితో పాటు సైనిక ప్రధాన అధికారి కూడా అంటున్నారు. పాకిస్తాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటున్నారు. ఒక దేశం ఎంత యుద్ధ వినాశనానికి గురయినా శిధిల దేశంగా మారవచ్చు. భౌగోళికంగా మాయమవదు. ఇలాంటి అర్థరహిత అవాక్కులను రాజకీయ లబ్ధి కోసం పాలకులు అంటే వారికి సైన్యాధికారులు వంతపాడి పాకిస్తాన్ పాలకుల, సైనిక ముఖ్యుల కోప స్పందనలను కొనితెచ్చుకోవాలా? మన దేశ సరిహద్దుల్లో చిరిగిన సైనిక గుడారాలు, నాసిరకం హెల్మెట్లు, బూట్లు, సైనిక, వాహనాల భద్రతా రాహిత్యం వల్ల వందల సంఖ్యలో సైనికులు చనిపోయారు. తాత్కాలిక సైనికులు అగ్నివీర్లు అసమగ్ర శిక్షణతో ఎక్కువగా అమరవీరులవుతున్నారు. వీరి మరణానంతర సౌకర్యాలలోనూ తేడాలున్నాయి. కూలుతున్న సైనిక విమానాలలో రాలుతున్న వైమానిక వీరులెందరో? ప్రభుత్వ హత్యలను అరికట్టడానికి ఘనత వహించిన మన విశ్వగురువులు ఆలోచించరు. హతుల పట్ల “మన” ప్రభుత్వనేతల వివక్షను వివరించడానికే ఈ ప్రస్తావ నలు. మన సైనికుల పట్ల, ప్రజల పట్ల ప్రేమ, గౌరవం లేక కాదు. వారి ప్రాణాల విలువ తెలియక కాదు. దేవుళ్ల సన్నిధిలో స్వర్గానికి వెళుతున్నవారు, వ్యయమయిన వ్యవసాయంతో బతకలేక బతుకులు చాలిస్తున్న రైతులు, వీధుల్లోనే కాక నక్షత్రాల హోటళ్లలోనూ వడ్డిస్తున్న కేన్సర్ ఉత్పాదక ఆహారాలతో అకాలంలో అంతమవుతున్నవారు లెక్కలేనంత మంది. దేశమంతా వ్యాపించిన నారాయణ, ఇతర ప్రైవేటు సంస్థలలో విద్యార్థుల యాజమాన్య చావులు ఎక్కువ. ఇళ్లలో ఎవరి దృష్టికీరాని నమోదుకాని చావులెన్నో? మంత్రులు, పార్లమెంటు సభ్యులు అయిన ఈ విద్యాసంస్థల అధిపతులు చేయించే చట్టాలు, చదువుల విధానాలు హంతకులకే అనుకూలం. ఇన్ని జరిగినా, ప్రమాదరహిత మౌలికసదుపాయాల వ్యవస్థల నిర్మాణం వైపు పాలకుల అడుగు పడదు. నష్టనివారణ కింద అరకొరగా పరిహారాలు ప్రకటిస్తారు. పరిహారాల ఖర్చును నిర్లక్ష±యూల కారకులయిన ప్రైవేటు యజమానులు, పాలకులు, వారి రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు, గుత్తేదారులు భరించాలి. కాని ప్రభుత్వం భరిస్తుంది. అంటే ప్రజల మీదకు ఈ ఖర్చును తోస్తుంది. ఔదార్య పాలకులమన్న పేరుపొంది ప్రజాభిమానాన్ని చూరగొనే ప్రవచన ప్రచారాలు చేసుకుంటారు. ప్రభుత్వ అధినేత నుండి అయోధ్య పుణ్యనగరిలో అడుక్కుని బతికేవాని వరకు అందరూ భారతీయులే, సమాన ప్రజలే. వారందరి ప్రాణాలు సమానమే. అయినా ఎందుకు ఈ వివక్ష? అయోధ్యలో పోలీసులు భిక్షకులను నియంత్రిస్తారు. కేంద్రం అయోధ్య భిక్షకులను విచిత్ర క్లుప్తపద పథకం స్మైల్ (సపోర్ట్ ఫార్ మార్జినలైజ్¦ ఇండివిజువల్స్ ఫార్ లైవ్లిహుడ్ అండ్ ఎంటర్రైÎజెస్)లో చేర్చింది. అయినా మోదీ ప్రతిష్టించిన బాలరాముడు వారిని ఆకర్షిస్తూనే ఉన్నాడు. ఉద్ధరించడం లేదు. అందుకే ప్రభుత్వాలు హత్యలను ఆపడం లేదు. ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి
సెల్ : 9490204545


