హైదరాబాద్: ఎప్ప్పుడెప్ప్పుడా అని సల్మాన్ ఖాన్ అభిమానులు ఎదురు చూస్తోన్న ‘మాతభూమి’ సినిమా కోసం మరికొన్నాళ్లు ఎదురు చూడాల్సివస్తోంది. సెన్సార్ కారణంగా కొన్నాళ్లు చిత్రం విడుదలకు కొంత జాప్యం ఏర్పడింది. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘మాతృభూమి’ సినిమా ప్రకటించిన నాటి నుంచే వార్తల్లో నిలిచిన ఈ సినిమా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే చిత్ర యూనిట్ దీన్ని ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు పంపలేదని సమాచారం. దీనివల్ల మే నెలలో కూడా ఈ సినిమా థియేటర్లలోకి రావడం కష్టమేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినామాలో జరిగిన భారీ మార్పులే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారత రక్షణ మంత్రిత్వశాఖ సూచనల మేరకు దర్శకుడు అపూర్వ లఖియా ఈ ప్రాజెక్టులో భారీస్థాయిలో మార్పులు చేసినట్లు తెలిసింది. అందులోభాగంగానే దాదాపు 40శాతం సినిమాను రీషూట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా కథలో కొన్ని కల్పిత అంశాలను, రొమాంటిక్ సీన్లను, బ్యాక్‌స్టోరీని అదనంగా జోడించి కొత్త వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రక్షణ శాఖ అభ్యర్థన మేరకు సినిమాలో ఎక్కడా చైనా పేరును నేరుగా ప్రస్తావించ కుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతానికి రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్మీ, సెన్సార్ బోర్డ్ గానీ ఈ కొత్త వెర్షన్‌ను ఇంకా చూడలేదు. అన్ని అనుమతులు లభించిన తర్వాతే చిత్ర బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.


