Homeమిత్తల్‌కు ఊడిగం

మిత్తల్‌కు ఊడిగం

- Advertisement -

ప్రజాసంపద కార్పొరేట్లకు ధారాదత్తం

. ప్రభుత్వరంగ పరిశ్రమలను దెబ్బతీస్తున్న ప్రభుత్వ చర్యలు
. 33 ఎంజీడీల నీటి కేటాయింపు ఒప్పందం రద్దు చేయాలి
. ‘కూటమి’ నిర్ణయాలపై వామపక్ష, ప్రజాసంఘాల మండిపాటు

విశాలాంధ్ర బ్యూరో- విశాఖపట్నం : కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, ప్రజల అవసరాలను దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వంపై స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి, వామపక్షాలు, కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. కారు చౌకగా కార్పొరేట్‌లకు భూములిస్తూ, ప్రభుత్వ రంగ పరిశ్రమలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సెలార్‌ మిత్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం 25 లక్షల మంది విశాఖ ప్రజానీకానికి… స్టీల్‌ ప్లాంట్‌కు ద్రోహం చేస్తూ ఏలేరు కాలువ నుంచి 33 ఎంజీడీల నీటిని మిత్తల్‌కు కేటాయించడంతో తీవ్రమైన నీటి సమస్య ఏర్పడుతుందని, ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గోదావరి, ఏలేశ్వరం రిజర్వాయర్‌ నుంచి ఏలేరు కాలువ ద్వారా విశాఖ నగరానికి 80 ఎంజీడీలు నీరు సరఫరా అవుతోంది. దీనిలో జీవీఎంసీకి 36 ఎంజీడీ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు 32, ఎన్టీపీసీకి 7.14, ఎస్‌ఐబీసీికి 4.19, అదానీ గంగవరం పోర్టుకు 0.22, ఆర్‌డబ్ల్యుఎన్‌కు 1.04 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 80 ఎంజీడీల నీటిలో 33 ఎంజీడీల నీటిని మిత్తల్‌ స్టీల్‌ ప్లాంటుకు ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన తాగునీటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారు. మిత్తల్‌కు నీటిని కేటాయిస్తే విశాఖ ప్రజలకు తాగునీటి సమస్య మరింత అధికమవుతుంది. ఇప్పటికే విశాఖ స్టీల్‌ను కేంద్రం అష్టదిగ్బంధం చేస్తోంది. వీటికి తోడు నీటి సమస్య సృష్టించి విశాఖ స్టీల్‌ ప్లాంటును దెబ్బతీయాలని చూడటం దుర్మార్గం అని చెప్పవచ్చు. గోదావరి నుంచి విశాఖకు ఏలేరు కాలువ నిర్మాణం స్టీల్‌ ప్లాంట్‌ నిధులతో జరిగింది. పైపులైన్‌ నిర్మాణం కోసం స్టీల్‌ ప్లాంట్‌ రూ.240 కోట్లు, జీవీఎంసీ రూ. 60 కోట్లు, ఎన్టీపీసీ రూ.50 కోట్లు మొత్తం రూ.360 కోట్లు ఖర్చుచేశాయి. ఇది ప్రజల సంపద. ఈ సంపదపై ఆర్సెలార్‌ మిత్తల్‌కు ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం కల్పిస్తుందని విశాఖ వాసులు ప్రశ్నిస్తున్నారు. దీనితోపాటు మిత్తల్‌ ప్లాంట్‌కు నీటి సరఫరా కోసం శరభన్నపాలెం నుంచి ఎత్తిపోతల ద్వారా దాదాపు 46.6 కిమీ పైపులైన్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోంది. దీనికి రూ .660కోట్లు ఖర్చు అవుతోంది. దీనిని జీవీఎంసీ ద్వారా ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ నుంచి అప్పుతీసుకొని ఈ పైపులైన్‌ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ సంపన్నుల్లో ప్రధానమైన వ్యక్తిగా … దాదాపు రూ.మూడు లక్షల కోట్లు ఆస్తి కలిగి ఉన్న మిత్తల్‌… నీటి కోసం రూ .660 కోట్లు ఖర్చు పెట్టుకోలేరా అని నిలదీస్తున్నారు. సొంత సొమ్ముతో ప్రత్యేకమైన వైపులైన్‌ ఏర్పాటు చేసుకోమని చెబితే ఎవరికీ అభ్యంతరం ఉండదని, ప్రజల నీటి అవసరాలను పెంచకుండా ప్రైవేటు పరిశ్రమలకు నీటి అవసరాలు పెంచేందుకు ప్రభుత్వ ధనాన్ని అప్పుల రూపంలో తీసుకురావడంపై వామపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల సొమ్మును మిత్తల్‌కు దోచిపెట్టడమే అవుతుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థ విశాఖపట్నం పోర్టుకు జీవీఎంసీ ద్వారా కిలో లీటర్‌కు రూ.90 చొప్పున నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం… ఒక కిలో లీటరుకు రూ.50లకే పదేళ్ల వరకు నీటిని సరఫరా చేస్తామని మిత్తల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థకేమో అధిక రేటుకు సరఫరా చేసి, ప్రైవేటు సంస్థకు తక్కువ రేటుకు ఎలా సరఫరా చేస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. మిత్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ వస్తే వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని పెద్దలు ప్రచారం చేస్తున్నారు గాని, నిజానికి ఉపాధి కల్పించాలని కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో 5,500మంది కాంట్రాక్టు కార్మికులను, 2,500మంది శాశ్వత కార్మికులను విధుల నుంచి ఎందుకు తొలగించారు… మరో 2000 మందిని తొలగించేందుకు ఎందుకు సిద్ధపడుతున్నారు ప్రశ్నిస్తున్నారు. రక్షణ రంగం, పోర్టు, హెచ్‌పీసీఎల్‌, బీహెచ్‌ఐఎల్‌, షిప్‌యార్డు తదితర ప్రభుత్వరంగ సంస్థలు, కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడంలేదని స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ప్రశ్నించారు. ఈ పరిణామాలు చూస్తే అభివృద్ధి పేరుతో ప్రజల సంపదను, ఆస్తిని మిత్తల్‌… ఇతర కార్పొరేట్లకు కట్టబెట్టడమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. దీనిలో భాగమే ఈ అక్రమ నీటి కేటాయింపులంటున్నారు. మిత్తల్‌ ప్లాంట్‌కు నీటి కేటాయింపు రద్దు చేయాలనీ, జీవీఎంసీ నిధులతో కాకుండా మిత్తల్‌ సొంత నిధులతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా పరిశీలించాలనీ, లేనిపక్షంలో కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని వామపక్షాలు, కార్మిక సంఘాలు, విశాఖ ప్రజలు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు