Homeఆంధ్రప్రదేశ్మోదీ పాలనకు అంతిమ ఘడియలు

మోదీ పాలనకు అంతిమ ఘడియలు

- Advertisement -

. డిసెంబరులో దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’
. ట్రంప్ ఆంక్షలతో కష్టాల్లో క్యూబా
. జగన్కు మించి చంద్రబాబు అప్పులు
. ‘మీట్ ది ప్రెస్’లో రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరోవిజయవాడ: మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఎన్‌డీఏ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయని సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించేందుకు డిసెంబరు 1,2,3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో జాతీయఅంతర్జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై రామకృష్ణ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దురహంకార చర్యలు, తీవ్ర ఆంక్షలతో క్యూబాలో విద్యుత్, నీరు, రవాణా, మందులు వంటి కనీస సౌకర్యాలకు తీవ్ర కొరత ఏర్పడిందని, కేన్సర్ మందులు అందక రోగులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. క్యూబాకు ఇతర దేశాల నుంచి సహాయ సహకారాలు అందకుండా అమెరికా అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. సీపీఐ, సీపీఎం అధ్వర్యంలో సేకరించిన మందులను క్యూబాకు అందించినట్లు రామకృష్ణ తెలిపారు. 66 ఏళ్లుగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా పోరాడుతోందని, ఇది అభినందనీయమన్నారు. రష్యా నుంచి చమురు తరలించే చర్యలు శుభపరిణామంగా తెలిపారు. భారతదేశం పరిణామాలను ప్రస్తావిస్తూ… సమస్యలు పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని రామకృష్ణ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు తారస్థాయికి చేరడంతో ప్రజలపై భారం పెరిగిందని, నిరుద్యోగం కారణంగా యువతలో అసంతృప్తి ఉందన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ న్యూయార్క్లో మత సామరస్యంపై మాట్లాడారు కానీ దేశంలో మైనార్టీలపై దాడుల విషయంలో ఎందుకు మాట్లాడలేదని రామకృష్ణ ప్రశ్నించారు. ముస్లింలు, ఇతర మైనారిటీలు అభద్రతా భావంతో జీవించే దుస్థితి ఉన్నదన్నారు. చట్టసభల్లో ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం లేదని విమర్శించారు. ఎస్‌ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్లు తొలగించిందని, దీనిపై పోరాటం చేస్తామని రామకృష్ణ తెలిపారు. ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డిసెంబరులో దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’ నిర్వహించనున్నట్లు తెలిపారు. పజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ బలోపేతమే లక్ష్యంగా వామపక్షాలు, లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఉమ్మడిగా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేలా పోరాటాన్ని కొనసాగిస్తాయని రామకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు కంటే ఎక్కువగా చంద్రబాబు ప్రభుత్వం గత రెండేళ్లలో చేసిందని విమర్శించారు. అప్పులు తప్ప రాష్ట్రానికి అదనంగా చేసిన అభివృద్ధి ఏమిటో చంద్రబాబు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కరవు మండలాలు తక్షణమే ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతాయని, గ్రామాభివృద్ధిని కోరుకునే అభ్యర్థులకు సీపీఐ మద్దతు ఇస్తుందని రామకృష్ణ తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, ఐజేయమూ సభ్యుడు షేక్ బాబు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు