. నిర్దేశిత గడువు కంటే 6 నెలలు ముందే పూర్తి కావాలి
. ఇప్పటివరకు రూ.50వేల కోట్లతో 74 ప్రాజెక్టుల పనులు
. ప్లాట్ల బదిలీలపై రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
. అమరావతి పురోగతిపై సమీక్షలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అతి తక్కువ సమయంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిర్దేశిత గడువు కంటే ఆరు నెలల ముందే పనులు పూర్తవ్వాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాజధాని నిర్మాణ పనుల పురోగతి సహా వివిధ సంస్థలకు భూ కేటాయింపులు తదితర అంశాలపై సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి పి.నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో పాటు రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచంలో అత్యుత్తమ నివాస నగరంగా అమరావతి ఉండాలని సీఎం స్పష్టంచేశారు. రాజధానిలో ఎల్పీఎస్ లే అవుట్లలో అభివృద్ధి పనుల పురోగతి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, రహదారులు, డక్ట్‌లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా, వరద నియంత్రణ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. రాజధానిలో ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని 74 పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. కాంట్రాక్టు సంస్థలు ఆయా పనుల్ని పరుగులు పెట్టించాలని సీఎం ఆదేశించారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని తేల్చి చెప్పారు. రాజధానిలో నిర్మాణ పనుల ప్రగతి ప్రజలకు కనిపించాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా అమరావతి పనుల పురోగతిపై సమీక్ష చేస్తానని, సమయం ప్రకారం పనులు పూర్తి కాకపోతే సదరు కాంట్రాక్టు సంస్థతో పాటు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. రియల్ టైమ్‌లో పనుల పురోగతిని పర్యవేక్షిస్తామని సీఎం తెలిపారు. ఆటో పైలట్ మోడ్‌లో పనులు జరగాలని సూచించారు.
రైతులకు ఇబ్బంది లేని రీతిలో ప్లాట్ల బదిలీ
రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రాజధాని రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో రైతుల విజ్ఞప్తులను పరిశీలించి కార్యాచరణ ప్రణాళిక ప్రభావితం కాకుండా ఆయా సమస్యల్ని పరిష్కరించాలని స్పష్టం చేశారు. దీనిపై మంత్రి నారాయణ స్పందిస్తూ వారం రోజుల్లోగా ఈ అంశాన్ని కొలిక్కి తెస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణానికి తెచ్చిన ఇనుము, సామగ్రి తుప్పు పట్టినట్లు కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇసుక నిల్వల్ని గత పాలకులు ఎత్తుకెళ్లారన్నారు. ఆ ఇసుకను భర్తీ చేయాల్సిందిగా మైనింగ్ శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
భూములిచ్చిన సంస్థలకు వేగంగా అనుమతులు
రాజధాని అమరావతిలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు. బిట్స్ పిలానీ, ఎక్స్ ఎల్‌ఆర్‌ఐ తదితర సంస్థలకు త్వరితగతిన భూమిని కేటాయించాలని సూచించారు. ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన 72 సంస్థలు ఏ మేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ సంస్థలకు స్థలం ఇచ్చేస్తే పని పూర్తి కాదని, వీటికి అనుసంధానంగా పెట్టుబడులు, వెంచర్లు కూడా రావాలన్నారు. ఒక్కో ఇటుకా పేరిస్తేనే రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని సీఎం అన్నారు. రాజధాని నగరంలో పెట్టుబడులతో పాటు నగరాభివృద్ధి జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
పెద్ద ప్రాజెక్టులను సీబీఎన్ మాత్రమే సమర్ధంగా చేయగలుగుతారని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారని, ఈ క్రెడిబిలిటికి నష్టం కలగకుండా చూడాలన్నారు. అమరావతిలో స్పోర్ట్ సిటీ, పర్యాటక ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్, బయోటెక్నాలజీ, విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. నాలెడ్జి ఎకానమీ, స్టార్టప్స్ లాంటి ఎకో సిస్టం కూడా రాజధాని నగరంలో కల్పించాలని సూచించారు. దేశంలోని అత్యుత్తమ పది రియల్ ఎస్టేట్ కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం కల్పించాలని సీఎం పేర్కొన్నారు. రాజధాని నగరాన్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా మార్చేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. సీడ్ కేపిటల్, కేపిటల్ సిటీ, కేపిటల్ ఏరియా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో కూడా నమోదు చేసి వివరాలు ప్రదర్శించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.


