Homeజాతీయంవాణిజ్య గ్యాస్ ధర భారీగా పెంపు

వాణిజ్య గ్యాస్ ధర భారీగా పెంపు

- Advertisement -

న్యూదిల్లీ : ట్రంప్ తెచ్చిన యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక, ప్రజా వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇక భారతదేశంలోనూ పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంతో ప్రపంచమంతటా చమురు, గ్యాస్ సంక్షోభానికి దారితీసింది. భారత్‌లో మోదీ సర్కార్ పరిస్థితి అదుపులోనే ఉందని చెప్ప్పుకొస్తున్నప్పటికీ పెట్రో, గ్యాస్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.195 పెరగడంతో అది రూ.2,078.50 కు చేరింది. అదే సమయంలో 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ ధర ఇప్ప్పుడు ఒక్కో రీఫిల్‌కు రూ.549 గా ఉంది. ఇది రూ.51 పెరుగుదలను ప్రతిబింబిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. కోల్‌కతాలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.218 పెరిగింది. మరోవైపు, గృహావసరాల వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా మార్చి 7 న 14.2 కిలోల సిలిండర్‌పై రూ.60 పెంచిన తర్వాత ప్రస్తుతం ఆ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. దిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.913 గా ఉంది. 19 కేజీల సిలిండర్‌పై చివరిసారిగా మార్చి 1 న రూ.114.5 మేర పెరిగింది. అయితే పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్‌పీజీ ధరలలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77, డీజిల్ ధర లీటరుకు రూ.87.67 గానే ఉంది. గత నెలలో ప్రపంచ పెట్రోలియం ధరలు 100 శాతం వరకు పెరిగినప్పటికీ, ఏప్రిల్ 1, 2026 నాటికి ఉన్న ఆరఎస్‌పీ స్థాయి ప్రకారం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ.24.40, డీజిల్‌పై లీటరుకు రూ.104.99 నష్టాన్ని చవిచూస్తున్నాయి. కేవలం ప్రీమియం పెట్రోల్ ధర మాత్రమే మునుపటి కంటే పెరిగింది. గత వారం ప్రీమియం పెట్రోల్ శ్రేణులయిన ఎక్స్‌పీ 95, పవర్ 95, స్పీడ్ అధిక ఆక్టేన్ కలిగిన ఉత్పత్తులపై లీటరుకు రూ.2 చొప్ప్పున ధరలను పెంచారు. దిల్లీలో ఎక్స్‌పీ 100 పెట్రోల్ ధర ఇప్ప్పుడు లీటరుకు రూ.160 కి చేరింది. ఇంతకుముందు దీని ధర రూ.149 ఉండేది. ఎక్స్ గ్రీన్ ప్రీమియం డీజిల్ ధర ఇప్ప్పుడు లీటరుకు రూ.92.99గా ఉంది. ఇంతకుముందు దీని ధర రూ.91.49 ఉండేది. అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరలు కూడా భారీగా పెరిగాయి. దిల్లీలో ఏటీఎఫ్ ధరలను మొదటగా కిలో లీటరుకు రూ.96,638.14 నుంచి రూ.2,07,341.22కు పెంచారు. ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే మొదటిసారి. కోల్‌కతాలో ఇది కిలో లీటరుకు రూ.2,05,953.33 గా నమోదయింది. ముంబైలో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ.1,94,968.67 గా, చెన్నైలో కిలో లీటరుకు రూ.2,14,597.66 గా ఉంది. ఈ ధరల పెరుగుదల విమానయాన సంస్థల కార్యకలాపాలపై, మొత్తం విమాన ప్రయాణ ఖర్చులపై ప్రభావం చూపుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు