. ప్రతిపక్షం నుంచి తప్పించుకోలేరు
. న్యాయం, ప్రజాస్వామ్యం కోసం పోరాడతాం
. బెంగళూరు సభలో ఈసీకి రాహుల్ హెచ్చరిక
. ఐక్యంగానే మోదీ మోసాలు ఆపగలం: ఖడ్గే
బెంగళూరు: ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధ బాధ్యతను మరిచిందని, సీట్లు, గెలుపును బీజేపీకి దోచిపెట్టిందని, ఓట్లు చోరీ కాదు… దోపిడీ చేసిందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల సంఘం మోసాలను బయట పెట్టేందుకు సాక్ష్యాధారాలతో ప్రజల ముందుకు వచ్చామని శుక్రవారం కర్నాటక రాజధాని బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ‘మన ఓటు, మన హక్కు, మన పోరు’ నినాదంతో కాంగ్రెస్ అధ్వర్యంలో ‘ఓట్ అధికార్ ర్యాలీ, ఆపై బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ‘వాస్తవాలను కప్పిపుచ్చలేరు… ముఖం చాటేయలేరు… ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సిందే’ అంటూ ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు. ‘పార్లమెంటులో రాజ్యాంగం పట్టుకొని ప్రతిజ్ఞ చేశాను. ఓట్ల చోరీ జరిగిందని మళ్లీ చెబుతున్నాను. నా ఆరోపణలపై ఎన్నికల సంఘం అఫిడవిట్ కోరుతోంది. నేను చూపిన డేటా ఆధారంగా ప్రజలు నిలదీస్తుండటంతో ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌ను ఆపేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్‌లో ఈసీ వెబ్సైట్ పనిచేయడం లేదు’ అని రాహుల్ వివరించారు. తమ డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నించడం మొదలుపెడితే ఈ వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. ఎన్నికల మోసాలపై దర్యాప్తు జరిపించాలని కర్నాటక ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ప్రతిపక్షానికి డిజిటల్ ఓటర్ జాబితాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఏం దాస్తున్నారు? సీసీటీవీ, వీడియో సాక్ష్యాధారాలను నాశనం చేస్తున్నారు ఎందుకు? ఎవరు చెబితే చేస్తున్నారు? ఫేక్ ఓటింగ్, ఓటర్ జాబితాల్లో లోపాలు ఎందుకున్నాయి? ప్రతిపక్ష నాయకులను హెచ్చరించడం, బెదిరించడం ఎందుకు? కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) బీజేపీకి ఏజెంటుగా మారిందా? స్పష్టం చేయండి అంటూ రాహుల్ నిలదీశారు. దేశ ప్రజాస్వామ్యం విలువ కట్టలేనిదిగా వర్ణించారు. దానిని దోచుకోవాలనుకోవడం దారుణమన్నారు. న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడతామని రాహుల్ స్పష్టంచేశారు. గత లోక్‌సభ ఎన్నికలప్పుడు కర్నాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల చోరీపై విచారణ జరిపించాలని, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిద్దరామయ్య ప్రభుత్వానికి సూచించారు.
2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు బీజేపీ గెలుపుకు కారణమైన 1,00,250 నకిలీ ఓట్లు మహదేవపురలో బయట పడ్డాయని తెలిపారు. గత పదేళ్ల ఎలక్ట్రానిక్ ఓటర్ డేటా, పోలింగ్ కేంద్రాల వీడియోలు ఇవ్వాలని ఈసీని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఓట్లు దోచుకున్న నేరంలో ఆధారాలు దాస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐదు రకాలుగా ఓట్లను ఈసీ దోచుకున్నట్లు ఆరోపించారు. నకిలీ ఓటర్లను సృష్టించడం ద్వారా బీజేపీ కోసం ఓటర్లను పెంచేలా ఈసీ పనిచేసిందని గత ఆరు నెలలలో కనిపెట్టామన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ప్రజలు చైతన్యవంతం కావాలని, ఎన్నికల్లో న్యాయం ఉండాలంటే ప్రభుత్వ కక్షసాధింపు ఆగాలని రాహుల్ చెప్పారు. ‘ఎన్నికలుఓట్ల దొంగలను వదిలిపెట్టేది లేదు. ఎంత తెలివిగా దాక్కున్నా వెతికి పట్టుకుంటాం. అయితే కొంత సమయం పట్టవచ్చు’ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓట్లను దోచుకోవడం అంటే ప్రజల గొంతు నొక్కేయడమేనని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి కట్టుబడాలే తప్ప బీజేపీ కోసం పనిచేయరాదని అన్నారు. రాజ్యాంగాన్ని, దేశ పౌరుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఈసీకి ఉందని, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని హితవుపలికారు. అధికారం కోసం ప్రధాని మోదీ 25 స్థానాలు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సమగ్రత ప్రశ్నార్థకంగా మారిందనిన్నారు. కాగితాలకే పరిమితమైన ఓటర్లు పరిమితమైనట్లు ఉన్నారని తమ విచారణలో తేలిందని చెప్పారు.‘మీరు ఆధారాలను దాచిపెట్టలేరు... ప్రతిక్షాన్ని ఎదుర్కోక తప్పదు’ అని ఎన్నికల సంఘాన్ని రాహుల్ హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఓట్లు దోచుకున్న సర్కారు కొనసాగలేదు: ఖడ్గే ఓట్లు, సీట్లు దోచుకొని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం పెద్దఎత్తున ఎన్నికల మోసాలకు పాల్పడిరదని, ప్రజామోదంతో అధికారంలోకి రాలేదని, ఓట్లు దొచుకొని గద్దెనెక్కిందన్నారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలో 6.6లక్షల ఓట్ల అక్రమాలను రాహుల్ బయటపెట్టారని చెప్పారు. 2024 ఎన్నికలు ‘ప్రజలకు జరిగిన మోసం’గా వర్ణించారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ప్రజామోదం లేకపోయినా ఓట్లు దోచుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు మోదీఅమిత్‌షా యత్నిస్తున్నారని, ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పాలనలో నైతిక చట్టబద్ధత లేదని ఖడ్గే దుయ్యబట్టారు. ‘ఇది దోపిడీ ప్రభుత్వం. దేశాభివృద్ధి కోసం పని చేస్తున్నట్లు మోదీ చెబుతున్నది పచ్చిఅబద్ధం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల మోసాలు వెలుగు చూశాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీ ద్వారా ప్రతిపక్ష నాయకులను బెదిరించడం, వ్యూహాత్మక ఫిరాయింపులు చేయించడం ద్వారా ప్రజామోదం లేకున్నా కర్నాటక, మహారాష్ట్ర, గోవా, మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నాశనం చేశారు. నోట్ల రద్దు వంటి ఘోర తప్పిదాలతో తీవ్ర నష్టం కలిగించారు. ఇప్పుడు దేశానికి హానికలిగించే మరో తప్పు చేయబోతున్నారు. ఎన్నికల దోపిడీని ప్రతి ఒక్కరు గుర్తించాలి. దానిని ప్రతిఘటించాలి’ అని ఖడ్గే ఉద్ఘాటించారు. ఎన్నికల మోసాలకు సహకరించడం ద్వారా విశ్వసనీయతను కోల్పోయిదంటూ తమ పార్టీ ఎంపీలంతా సోమవారం ఈసీకి వినతులు అందజేస్తారన్నారు. ఈసీ అక్రమాలపై ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయని ఖడ్గే చెప్పారు. ఉమ్మడి సందేశం ఇచ్చేలా ఇండియా ఐక్య సంఘటన నాయకులు ఏకతాటిపైకి వచ్చారని అన్నారు. ఐక్యంగానే మోదీ మోసాలను ఆపగలమని వక్కాణించారు. మన ఓట్లు ఒకసారి దోపిడీకి గురయ్యాయంటే మన మనుగడకు ముప్పు ఏర్పడినట్లే అని హెచ్చరించారు.
నాడు మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆదర్శకంగా చేసుకొని ‘చావో`రేవో’ అన్న స్ఫూర్తితో మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాడదామంటూ ఖడ్గే పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని, ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు ఆయనకు లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. మోదీ అధికారం కోసం సీట్లను దోచుకున్నట్లు రాహుల్ బయట పెట్టిన ఎన్నికల మోసాలతో స్పష్టమైందన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ దేశంలో న్యాయబద్ధమైన బ్యాంకులు (లీగల్ బ్యాంక్స్) ఏర్పాటు చేసి, బూత్‌స్థాయిలో ప్రతి ఒక్క ఓటరు హక్కును పరిరక్షించాలని రాహుల్ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. బ్లడ్ బ్యాంకుల తరహా లీగల్ బ్యాంకుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తామన్నారు.


