Homeఆంధ్రప్రదేశ్విద్యుత్ కొరతకు చెక్

విద్యుత్ కొరతకు చెక్

- Advertisement -

నిరంతరాయ సరఫరాకు కార్యాచరణ: విజయానంద్

విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర ప్రజలకు ఏ క్షణంలోనూ విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం 24/7 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, ఎల్‌నినో వల్ల తలెత్తే వాతావరణ సవాళ్లను సమర్థ వంతంగా తట్టుకునేందుకు గాను ప్రభుత్వం ‘ఎనర్జీ రోడ్మ్యాప్’ను రూపొందించిందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. విజయవాడ విద్యుత్ సౌధలో మంగళవారం ఆయన అధ్యక్షతన ‘ఆంధ్రప్రదేశ్ పవర్ కో-ఆర్‌డినేషన్ కమిటీ’ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 12 నుంచి 25 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితితో, విద్యుత్ చట్టం-2003 సెక్షన్ 63 ప్రకారం టారిఫ్ ఆధారిత పోటీ వేలం ద్వారా 1,600 మెగావాట్ల అత్యంత చౌకైన థర్మల్ విద్యుత్‌ను…డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్, ఆపరేట్ పద్ధతిలో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద తక్కువ ధరకే విద్యుత్ పొందేందుకు దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న ఉత్పత్తి సంస్థలైనా ఈ బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని వివరించారు. అకస్మాత్తుగా బొగ్గు కొరత ఏర్పడి ఉత్పత్తి ఆగిపోకుండా ప్లాంట్లలో కనీసం 15 రోజుల నిల్వలు (గతంలో 7 రోజులు) తప్పనిసరి చేశామని, సరఫరాను ధ్రువీకరించేలా బ్యాంక్ గ్యారెంటీలను కఠినతరం చేశామన్నారు. దీనికితోడు ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా జెన్కోకు పోటీ బిడ్డింగ్ ద్వారా విదేశీ బొగ్గు సేకరణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. డిస్కమ్లు వచ్చే సెప్టెంబర్ వరకు ఏడాది పాటు ముందస్తు సరఫరా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది ఎల్‌నినో తీవ్ర ప్రభావంతో ఆగస్టులోనే సగటు రోజువారీ విద్యుత్ వాడకం గతేడాదితో పోలిస్తే 20శాతం పెరిగి, 269 మిలియన్ యూనిట్లకు చేరుకోగా…గరిష్ట రోజువారీ డిమాండ్ 286 మిలియన్ యూనిట్లను తాకిందని తెలిపారు. సెప్టెంబర్‌లో లోడ్ 14,150 మెగావాట్లకు చేరుకునే అవకాశముందని, ఈ అదనపు భారాన్ని తట్టుకుంటూ రైతులకు ఉచిత విద్యుత్, పరిశ్రమలకు నాణ్యమైన కరెంట్, గృహాలకు 24/7 నిరంతర సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వాతావరణ సవాళ్లు ఏవొచ్చినా గ్రిడ్ కుప్పకూలకుండా అత్యాధునిక సాంకేతికతతో వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని, భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్ రంగం మరింత బలోపేతం అవుతుందని విజయానంద్ ధీమా వ్యక్తం చేశారు.ఈ భేటీకి ఏపీ జెన్కో ఎండి యస్.నాగలక్ష్మీ, ఏపీ ట్రాన్సోక్క జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఏపీ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు