Homeవిద్యుత్కు ఎల్‌నినో సెగ

విద్యుత్కు ఎల్‌నినో సెగ

- Advertisement -
  • 275 ఎంయూలు దాటిన రోజువారీ వినియోగం – 13,500 మెగావాట్లకు పీక్ డిమాండ్
  • థర్మల్ ప్లాంట్లపై పెరిగిన ఒత్తిడి – వర్షాభావంతో జల విద్యుత్కు గండం
  • సౌర, పవనాలపై ప్రకృతి ప్రభావం – మార్కెట్ నుంచి కొనుగోళ్లే కీలకం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వ్యవసాయరంగాన్ని అతలాకుతలం చేసిన ఎల్‌నినో సెగ ఇప్పుడు విద్యుత్ రంగాన్నీ తాకింది. ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతుండగా, విద్యుత్ వినియోగం వేసవిని మరిపిస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గాల్సి ఉన్నా, ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎండలు, ఉక్కపోత, వర్షాభావ పరిస్థితులతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం ఇప్పటికే 275 మిలియన్ యూనిట్లు (ఎంయూ) దాటింది. ఆగస్టులో సగటు రోజువారీ వినియోగం 269 ఎంయూలకు చేరిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇదే నెలలో 223 ఎంయూలుగా ఉన్న వినియోగంతో పోలిస్తే దాదాపు 20 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సెప్టెంబర్‌లో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతోంది. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర సరఫరా చేయడం విద్యుత్ సంస్థలకు సవాల్‌గా మారింది.
31 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
రాష్ట్రంలో థర్మల్, సౌర, పవన, జల విద్యుత్ ప్రాజెక్టులన్నింటి ద్వారా సుమారు 31,040 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇందులో సుమారు 12,900 మెగావాట్లు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ద్వారా, 1,300 మెగావాట్లకుపైగా గ్యాస్ ఆధారిత, 3,350 మెగావాట్లకుపైగా జల విద్యుత్, 13,300 మెగావాట్లకుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అయితే పూర్తిస్థాయి విద్యుత్ సామర్థ్యం అన్ని సమయాల్లో అందుబాటులో ఉండదు. ఇదే ప్రస్తుత సమస్యకు మూల కారణం. ప్లాంట్ల నిర్వహణ, సాంకేతిక సమస్యలు, ఇంధన లభ్యత, నీటి నిల్వలు, సూర్యరశ్మి, గాలుల వేగం వంటి అంశాలపై ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది.
థర్మల్ సామర్థ్యం ఉన్నా…ఉత్పత్తి సగమే
రాష్ట్ర విద్యుత్ సరఫరాలో థర్మల్ విద్యుత్ అత్యంత కీలకమైన ఆధారం. మొత్తం అన్ని విద్యుత్ ప్లాంట్లు కలిపి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 8,902 మెగావాట్లు కాగా, ఆగస్టులో సగటున అందుబాటులోకి వచ్చింది కేవలం 5,904 మెగావాట్లే. కొన్ని ప్లాంట్లలో నిర్వహణ, మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, బొగ్గు కొరత తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. డిమాండ్ పెరుగుతున్న సమయంలో ప్లాంట్లలో ఒక్కో యూనిట్ కూడా అందుబాటులో లేకపోవడం సరఫరా వ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతోంది. అందుకే థర్మల్ ప్లాంట్ల నిర్వహణను ముందుగానే పూర్తి చేయడంతో పాటు బొగ్గు నిల్వలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
జల విద్యుత్కు వర్షాభావం దెబ్బ
రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో చౌకగా, అత్యంత వేగంగా అందుబాటులోకి వచ్చే జల విద్యుత్ కీలకమైన వనరు. కానీ ఎల్‌నినో నేపథ్యంలో వర్షాలు లేక జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలో కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో జల విద్యుత్ ఉత్పత్తిపై ఇటీవల కేఆర్‌ఎంబీ రెండు రాష్ట్రాలకు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని, జల విద్యుత్ ఉత్పత్తి ఆపాలని సూచించింది. ఈ పరిణామాలు విద్యుత్పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో సౌర విద్యుత్ సామర్థ్యం సుమారు 7,500 మెగావాట్లు. పవన విద్యుత్ సామర్థ్యం సుమారు 4,400 మెగావాట్లుగా ఉంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో రాష్ట్రం గణనీయమైన సామర్థ్యాన్ని సాధించింది. అయితే సౌర, పవన విద్యుత్పై ప్రకృతి ప్రభావం ఉంటుంది. పగటి సమయంలో సూర్యరశ్మి ఉన్నంతవరకే గరిష్ఠంగా సౌర ఉత్పత్తి సాధ్యమవుతుంది. సూర్యాస్తమయం తర్వాత సౌర ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోతుంది. అదే సమయంలో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల వినియోగం కొనసాగుతుంది. అందుకే భవిష్యత్తులో కేవలం సౌర విద్యుత్ సామర్థ్య పెంచడం మాత్రమే కాకుండా, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది. పగటిపూట సౌర విద్యుత్‌ను నిల్వ చేసి సాయంత్రం, రాత్రి వినియోగించుకునే వ్యవస్థలు అందుబాటులోకి వస్తే పీక్ డిమాండ్ సమయంలో థర్మల్, మార్కెట్ విద్యుత్పై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు కార్యాచరణ చేపడుతున్నారు. రాష్ట్రంలో పవన విద్యుత్ సామర్థ్యం కూడా 4,400 మెగావాట్లకు పైగానే ఉన్నప్పటికీ గాలి వేగం, సీజన్ ఆధారంగా ఉత్పత్తి మారుతూ ఉంటుంది.
కొనుగోళ్లపైనే ఆధారం
డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో ఉత్పత్తి సరిపోని సమయంలో బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం అనివార్యం. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డిస్కమ్లు 5,282.97 ఎంయూల షార్ట్టర్మ్ విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. ఇందుకోసం సుమారు రూ.3,586.53 కోట్లు ఖర్చు చేశాయి. సగటున యూనిట్ విద్యుత్కు రూ.6.79 చెల్లించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా బొగ్గు నిల్వలు పెంచుకోవడం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో అన్ని యూనిట్లలో ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు విద్యుత్ వినియోగాన్ని బట్టి కొనుగోళ్లకు కూడా సిద్ధపడుతోంది. ఏదిఏమైనా ఎల్‌నినో ప్రభావంతో పెరుగుతున్న ఎండల తీవ్రత, వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుండటం వంటి అంశాలు అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. నవంబరు నుంచి చలికాలం ప్రవేశిస్తే విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉందని, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొనుగోలు తప్పదని అధికారులు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు