


సర్కారు ఏకపక్ష విధానాలపై కార్మిక – కర్షకాగ్రహం
. కేంద్రం మెడలు వంచేందుకు ఒక్కటైన శ్రామికవర్గం
. రోడ్డెక్కని బస్సులుతెరుచుకోని విద్యా సంస్థలు
. పనిచేయని బ్యాంకులుపరిశ్రమలు: రైల్`రాస్తా రోకోలు
. అన్ని రాష్ట్రాల్లో భారీ ప్రదర్శనలు
. మార్మోగిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు
. పాల్గొన్న 30 కోట్ల మంది
. సార్వత్రిక సమ్మె విజయవంతం: కార్మిక సంఘాల ప్రకటన
న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను కార్మికులు, రైతులు ప్రతిఘటించారు. అమెరితో వాణిజ్య ఒప్పందం, నాలుగు లేబర్ కోడ్లు, విత్తనాల బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు వంటివాటిని కార్మికులు, రైతులతో పాటు అన్ని రంగాల ఉద్యోగులు వ్యతిరేకించారు. కేంద్రం మెడలు వంచుదామంటూ ఐక్య నినాదమిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గురువారం సార్వత్రిక సమ్మెను విజయవంతం చేశారు. సమ్మెలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో రాస్తా రోకోలు, రైల్ రోకాలు నిర్వహించారు. మహిళలు ప్రత్యేకించి ఐసీడీఎస్, ఆశా, మధ్యాహ్న భోజనం, బీడీ రంగం, ఇంటి పనివారు తరలి వచ్చారు. అసంఘటిత రంగాýకు చెందిన నిర్మాణ రంగ కార్మికులు, హాకర్లు, విక్రేతలు, లోడర్లు పాల్గొన్నారు. ఈరిక్షా, ఆటో, ట్యాక్సీ యూనియన్లు కలిసివచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు. బొగ్గు, ఎనఎండీసీ లిమిటెడ్, ఉక్కు, కాపర్, బాక్సైట్, అల్యూమీనియం, బంగారం గనుల్లో పనిచేసే కార్మికులతో పాటు స్టీల్, బ్యాంకులు, ఎలఐజీ, జీఐసీ, పెట్రోలియం, విద్యుత్, పోస్టల్ ఉద్యోగులు, గ్రామీణ డాక్ సేవక్‌లు, టెలికం, అణుశక్తి, సిమెంట్, పోర్టుడాక్ టీ ప్లాంటేషన్లు, జూట్ మిల్లు, ప్రజా రవాణా, ప్రైవేటు రవాణా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. రక్షణ రంగ సిబ్బంది సమ్మెకు మద్దతు తెలుపుతూ తమ విధులకు గంట ఆలశ్యంగా హాజరయ్యారు. రైల్వే యూనియన్లు సైతం సంఘీభావం తెలిపాయి.
కార్మిక కోడ్ల రద్దు సహా వ్యతిరేక చట్టాల ఉపసంహరణకు డిమాండ్‌తో ప్రదర్శనలు, ధర్నాలతో దేశాన్ని హోరెత్తించారు. సమ్మె కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. రవాణా స్తంభించింది. ప్రైవేటు బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, రిక్షాలు సైతం నడవలేదు. విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. ప్రభుత్వ కార్యలయాలు, పారిశ్రామిక వాడలలో పని జరగలేదు. దేశ రాజధాని దిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక, త్రిపుర, గోవా, అసోం, ఒడిశా, బీహార్, పుదుచ్చేరి, ఒడిశా, చత్తీస్‌గఢ్, బెంగాల్, జార్ఖండ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల్లో సమ్మె జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సమ్మె పాక్షికంగా విజయవంతమైంది. తమ హక్కుల పరిరక్షణ, డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం కార్మికరైతు సంఘాలు డిమాండ్ చేశాయి. నాలుగు లేబర్ కోడ్ల రద్దు, విత్తునాల బిల్లువిద్యుత్ సవరణ బిల్లుతో పాటు శాంతి చట్టం ఉపసంహరణ, ఎంజీఎనఆరఈజీఏ పునరుద్ధరణవీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దునకు డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఎసఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, ఐయూయూసీ సహా 10 కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెను గురువారం చేపట్టాయి. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిలభారత కిసాన్ సభ కలిసి రాగా వామపక్షాలతో పాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు సమ్మెకు మద్దతిచ్చాయి. 30 కోట్ల మందికిపైగా సమ్మెలో పాల్గొన్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ వెల్లడించారు. న్యూదిల్లీలోని పారిశ్రామిక వాడల్లో ప్రదర్శనలు జరిగినట్లు చెప్పారు. బ్యాంకింగ్, పోస్టల్, బీమా, రవాణా, ఆరోగ్య, బొగ్గు గనులు, ఇతర గనులు, గ్యాస్ పైప్లైన్లు, విద్యుత్ రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కార్మికులు, రైతులు, ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి తమ నిరసన గళం వినిపించినట్లు వెల్లడించారు. సార్వత్రిక సమ్మె విజయవంతమైనట్లు కేంద్ర కార్మిక సంఘాలు ఐక్య ప్రకటన విడుదల చేశాయి. సమ్మెలో భాగంగా దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగినట్లు తెలిపాయి. దిల్లీలో జంతర్ మంతర్ వద్ద కేంద్ర కార్మిక సంఘాలు భారీ సభ నిర్వహించాయి. నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటులో సంఘీభావం తెలుపడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణపట్టణ ప్రాంతాల్లో సమ్మెకు లభించిన మద్దతుపై హర్షం వ్యక్తంచేశారు. వక్తల్లో అశోక్ సింగ్ (ఐఎన్టీయూసీ), అమర్జిత్ కౌర్ (ఏఐటీయూసీ), హర్భజన్ సింగ్ సిందూ (హెచఎంఎస్), సుదీప్ దత్తా (సీఐటీయూ), ఆర్కే శర్మ (ఏఐయూటీయూసీ), జి.దేవరాజన్ (టీయూసీసీ), లతాబేన్ (ఎసఈడబ్ల్యూఏ), రాజీవ్ దిమ్రీ (ఏఐసీసీటీయూ), శత్రుజీత్ సింగ్ (యూటీయూసీ), సంతోశ్ కుమార్ (ఎంఈసీ)తో పాటు రైతు నాయకులు ఉన్నారు.
సమ్మెలో భాగంగా ఒడిశాలో ఉదయం 6 నుంచి బంద్ విజయవంతంగా జరిగింది. అన్ని ప్రధాన రహదారులను కార్మిక సంఘాలు దిగ్బంధించాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బీజేడీ వర్కర్స్ ఫ్రంట్ సమ్మెకు నైతిక మద్దతిచ్చింది. బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు నిలిచిపోయాయి. విద్యా సంస్థలు, దుకాణాలు తెరుచుకోలేదు. భువనేశ్వర్, కటక్, బాలాసోర్, బెర్హంపూర్, సంబల్పూర్లో సమ్మె ప్రభావం ఎక్కువగా కనిపించింది. అమా బస్ డిపోను నిరసనకారులు దిగ్బంధించారు. దీంతో భువనేశ్వర్కటక్ జంట నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సమ్మె నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య రాకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఒడిశా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు గట్టి భద్రత నడుమ పనిచేశాయి. రైల్వే స్టేషన్ల వద్ద పికెట్లతో రైలు రవాణాకు అంతరాయం కలిగింది. చత్తీస్‌గఢ్‌లో జాతీయ బ్యాంకులు పనిచేయలేదు. బీమా కంపెనీల సిబ్బంది, పోస్టాఫీసు సిబ్బంది సమ్మెలో భాగస్వాములయ్యారు. అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యల సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సహా వేలాది మంది పాల్గొన్నారు. రాయ్‌పూర్‌లోని పండ్రీలోని ఎలఐసీ కార్యాలయం వద్ద, రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో, కోర్బాలోనూ ఆందోళనలు, ప్రదర్శనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు, పరిశ్రమలు పనిచేయలేదు. అసెంబ్లీ ఎన్నికల జరగబోయే క్రమంలో ‘సేవ్ బెంగాల’ నినాదాలు మార్మోగాయి. దుర్గాపూర్, హల్దియాలోని పారిశ్రామిక వాడలో ప్రదర్శనలు జరిగాయి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ దాని పరిసరాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. 25 వేల మంది రక్షణ సిబ్బంది గంట ఆలశ్యంగా విధులకు హాజరై తమ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాష్ట్రంలో హోరెత్తాయి. జాతీయ బ్యాంకుల సిబ్బంది, ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగులు, బీమా రంగ కార్మికులు సమ్మెలో భాగస్వాములయ్యారు. బీహెచఈఎల్ గేటు వద్ద కార్మికులు ధర్నా చేశారు. జబల్పూర్లోని సివిల్ సెంటర్ ప్రాంతలో ర్యాలీ జరిగింది. ఇండోర్‌లో బ్యాంకింగ్, బీమా, ఇతర రంగాల కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. తమిళనాడులో తూత్తుకుడి, చెన్నైలో పోర్టు కార్యకలాపాలు స్తంభించాయి. పారిశ్రామిక హబ్ శ్రీపెరంబదూర్లోనూ ధర్నాలు జరిగాయి. బస్సులు నడవలేదు. కేరళలో సమ్మె క్రమంలో అక్కడి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డైస్‌నాన్ (నో లీగల్ బిజినెస్ డే)ను ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతబడ్డాయి. ప్రైవేటు బస్సులు సైతం రోడ్డెక్కలేదు.ఆటో యూనియన్లు సమ్మెకు మద్దతిచ్చాయి. పంజాబ్‌లోనూ ఆప్ ప్రభుత్వం సమ్మెకు మద్దతిచ్చింది. గోవాలో బ్యాంకులు, బీమా కంపెనీలు పనిచేయలేదు. త్రిపుర, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సమ్మె పాక్షికంగా జరిగింది.


