Homeవిశ్లేషణస్థానిక సమరంలో ప్రజల ఎజెండా ఏది?

స్థానిక సమరంలో ప్రజల ఎజెండా ఏది?

- Advertisement -

కంచల జయరాజ్

ఆంధ్రప్రదేశ్ మరో రాజకీయ సమరానికి రంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల నుంచి మండల, జిల్లా పరిషత్తుల వరకు, నగర పంచాయతీల నుంచి పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల వరకు స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ దృష్టి కేంద్రీకృ తమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వ హణకు అవసరమైన ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతోంది. మండల, జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల ఓటర్ల జాబితాల తయారీకి చర్యలు చేపట్టగా, ప్రస్తుత మండల, జిల్లా పరిషత్తుల ఐదేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 23, 24 తేదీలతో ముగియనుంది. మరోవైపు పట్టణ స్థానిక సంస్థ ల్లోనూ ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. 59 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఖరారు చేసింది. ఈసారి స్థానిక ఎన్నికలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. నగరపాలక సంస్థల మేయర్లు, పురపాలక సంఘాలు, నగర పంచా యతీల చైర్‌పర్సన్‌లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానానికి రాష్ట్రం తిరిగి వచ్చింది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణను శాసనసభ ఆమోదించింది. 1986 నుంచి 2005 వరకు అమలులో ఉన్న ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి అనం తరం రెండు దశాబ్దాలుగా కొనసాగిన పరోక్ష విధానానికి బదులుగా మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల వ్యవస్థను తీసుకువచ్చారు. దీని వల్ల వార్డు సభ్యుడి ఎన్నికతో పాటు నగరం లేదా పట్టణానికి నాయకత్వం వహించే వ్యక్తి ఎంపికలోనూ ఓటరు నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను కేవలం మరో రాజకీయ పోరాటంగా చూడటం సరిపోదు. ఏ పార్టీకి ఎన్ని పంచాయతీలు వస్తాయి ? ఎన్ని మండలాలు, జిల్లా పరిషత్తులు దక్కుతాయి ? ఏ నగరపాలక సంస్థపై ఎవరి జెండా ఎగురుతుంది ? అనే రాజకీయ లెక్కల Å£తీతంగా ఈ ఎన్నికలను చూడాల్సిన అవసరం ఉంది. ఎందు కంటే ప్రజా స్వామ్యానికి అసలు పునాది స్థానిక సంస్థలే. భారత రాజ్యాంగానికి చేసిన 73, 74వ సవరణల వెనుక ఉన్న ప్రధాన స్ఫూర్తి అధికార వికేంద్రీ కరణ. ఢిల్లీ లోనో, రాష్ట్ర రాజధానిలోనో కేంద్రీకృతమైన అధికారం గ్రామానికి, పట్టణానికి చేరాలి. తమ ప్రాంతానికి ఏం కావాలో అక్కడి ప్రజలే నిర్ణయించుకోవాలి.
ఎన్నికలు ఉంటేనే స్వపరిపాలన వచ్చినట్లా ? క్రమం తప్పకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్యానికి అవసరం. కానీ ఎన్నికలు నిర్వహించడంతోనే అధికార వికేంద్రీకరణ పూర్తయినట్లు కాదు. ఎన్నికైన సంస్థలకు అధికారాలు. నిధులు, అవసరమైన సిబ్బంది ఉండాలి. తమ ప్రాంత అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. సర్పంచ్ నుంచి మేయర్ వరకు ప్రతి చిన్న పనికీ ప్రభుత్వ శాఖల అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటే స్థానిక స్వపరిపాలన అనే మాటకు అర్థం తగ్గిపోతుంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, పురపాలక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం కింది స్థాయి కార్యాలయాలుగా మారకూడదు. అవి రాజ్యాంగం గుర్తించిన ప్రజాప్రాతినిధ్య సంస్థలుగా పనిచేయాలి. అందుకే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో మొదటి ప్రశ్న ఇదే కావాలి-స్థానిక సంస్థలకు ఎంత అధికారం ఇస్తారు ? ఎన్ని నిధులు కేటాయిస్తారు ? రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఎలా అమలు చేస్తారు ? స్థానిక సంస్థల సొంత ఆదాయాన్ని ఎలా పెంచుతారు? ప్రజలపై అదనపు భారాలు మోపకుండా పట్టణాలను ఎలా అభివృద్ధి చేస్తారు ?
విజయవాడ… వామపక్ష రాజకీయాల చరిత్ర : ఆంధ్రప్రదేశ్ స్థానిక రాజ కీయాల గురించి మాట్లాడేటప్పుడు విజయవాడకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు విజయవాడ అంటే కార్మిక, ప్రజా ఉద్యమాలు, వామపక్ష రాజకీయా లకు బలమైన కేంద్రంగా గుర్తింపు ఉండేది. 1970వ దశకంలో నగరం కమ్యూ నిస్టుల బలమైన కేంద్రంగా ఉన్నట్లు సమకాలీన చరిత్రపై వచ్చిన కథనాలు నమోదుచేశాయి. నగరపాలక సంస్థ చరిత్రలోనూ వామపక్షాలకు గణనీయమైన స్థానం ఉంది. విజయవాడ 1981లో నగరపాలక సంస్థగా మారిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో సీపీఐ-సీపీఎం కూటమి మెజారిటీ డివిజన్లను గెలుచు కుంది. సీపీఐకి చెందిన టి. వెంకటేశ్వరరావు తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఒప్పందంలో భాగంగా సీపీఎంకు చెందిన ఎ.రాములు, సీపీఐకి చెందిన లంక గోవిందరాజులు తదితరులు మేయర్లుగా పనిచేశారు. 1995లో మరోసారి టి.వెంకటేశ్వరరావు మేయర్‌గా ఎన్నికయ్యారు. 2005 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన వామపక్షాల నుంచి సీపీఐకి చెందిన తాడి శకుంతల మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ చరిత్ర ఎవరు మేయర్ అయ్యారన్న పేర్ల జాబితా కాదు. విజయవాడ నగరంలో కార్మికులు, రిక్ష± కార్మికులు, అసంఘటితరంగ శ్రామికులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి, పేద వర్గాలతో వామపక్షాలకు ఒకప్పుడు ఉన్న సామాజిక సంబంధానికి అది ప్రతిబింబం.పారిశుధ్యం, మంచినీరు, నివాసం, పన్నులు, కార్మికుల హక్కులు, పేదల కాలనీలు వంటి స్థానిక సమస్యలను రాజకీయ ఎజెండాగా మార్చడంలో కమ్యూనిస్టు ఉద్యమాలకు ఒక చారిత్రక పాత్ర ఉంది.
ఆ పునాది ఇప్పుడు ఎక్కడ ? : కాలంతో పాటు విజయవాడ రూపురేఖలు మారాయి. కొత్త కాలనీలు వచ్చాయి. అపార్ట్‌మెంట్ సంస్కృతి విస్తరించింది. ఐటీ, సేవారంగ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిపై ఆధారపడే వారు, అసంఘటిత రంగ కార్మికులు-కొత్త సామాజిక వర్గాలు నగర జీవితంలో భాగమయ్యాయి. స్థానిక ఎన్నికల్లో రాష్ట్రస్థాయి ప్రధాన పార్టీల ప్రభావం పెరి గింది. కుల సమీకరణలు, ఆర్థిక వనరులు, భారీ ఎన్నికల ప్రచారం స్థానిక ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వామపక్షాలకు గత చరిత్ర ఒక్కటే సరిపోదు. ఉదాహరణకు 2026 ఏప్రిల్‌లో ఆస్తిపన్ను పెంపుపై సీపీఎం బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది పట్టణ స్థానిక పాలన లో పన్నుల విధానం రాజకీయ చర్చాంశంగా ఉందనడానికి ఉదాహరణ.
మారుతున్న రాజకీయ సమీకరణాలు : ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రాధాన్యంగా తీసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక స్థాయిలో సమన్వయంపై చర్చలు సాగిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో తమ బలాబలాలను అంచనా వేస్తున్నట్లు ప్రకటించింది. జనసేన స్థానిక ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నా ఎన్నికల కేంద్రబిందువు ప్రజలే కావాలి.
ప్రత్యక్ష మేయర్ ఎన్నిక-కొత్త అవకాశం, కొత్త బాధ్యత : మేయర్లు, చైర్ పర్సన్లను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానం ఈ ఎన్నికల రాజకీయ స్వభా వాన్ని కొంత మార్చే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఎన్నికలో నగరం మొత్తం ఒక అభ్యర్థిని పరిశీలించే అవకాశం ఉంటుంది. దీంతో మేయర్ అభ్యర్థులు నగర్ఙాó వృద్ధిపై స్పష్టమైన ప్రణాళికను ప్రజల ముందుంచాల్సిన అవసరం పెరుగు తుంది. విజయవాడకు వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తారు ? విశాఖ అభివృద్ధి ఎలా ఉండాలి ? తిరుపతిలో పెరుగుతున్న జనాభా, యాత్రికుల అవసరాలను ఎలా సమన్వయం చేస్తారు ? గుంటూరు, నెల్లూరు, కర్నూలు, రాజమహేంద్రవరం వంటి నగరాల్లో మౌలిక వసతులను ఎలా మెరుగుపరుస్తారు? అనే అంశాలపై మేయర్ అభ్యర్థుల మధ్య బహిరంగ చర్చలు జరిగితే స్థానిక ఎన్నికల స్థాయి మెరుగవుతుంది. స్థానిక సంస్థల ద్వారా మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం విస్తరించింది. అయితే రిజర్వేషన్‌తో పదవి రావడం సాధికారత కాదు. ఎన్నికైన మహిళా ప్రతినిధి స్వయంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండాలి. ఆమె స్థానంలో భర్‌తో, కుటుంబ సభ్యుడో అనధికారికంగా అధికారాన్ని నిర్వహించే పరిస్థితి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక నుంచే మహిళా నాయకత్వాన్ని స్వతంత్రంగా ఎదిగేలా ప్రోత్సహించాలి.
ప్రజల మేనిఫెస్టో రావాలి : ప్రతి రాజకీయ పార్టీ రాష్ట్రస్థాయి మేనిఫెస్టో ప్రక టించడం మనకు అలవాటు. కానీ స్థానిక ఎన్నికల్లో ప్రతి నగరానికి, ప్రతి పుర పాలక సంఘానికి, సాధ్యమైనంత వరకు ప్రతి వార్డుకు ప్రజా ప్రణాళిక ఉండా లి. విజయవాడలో వచ్చే ఐదేళ్లలో డ్రైనేజీకి ఏం చేస్తారు? ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఏమిటి? కొండ ప్రాంతాల్లో మౌలిక వసతులు ఎలా కల్పిస్తారు ? పేదలకు ఇళ్లు ఎలా అందిస్తారు? కృష్ణా వరద ముప్పును ఎలా ఎదుర్కొం టారు? నగరానికి అవసరమైన పచ్చదనాన్ని ఎలా పెంచుతారు? నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితిని ప్రజలపై పన్నుల భారం పెంచకుండా ఎలా మెరుగు పరుస్తారు? ఇలాంటి ప్రశ్నలకు రాజకీయ పార్టీలు లిఖితపూర్వక సమా ధానాలు ఇవ్వాలి. గతంలోనూ విజయవాడ పౌర సంఘాలు రాజకీయ పార్టీలు నగర సమస్యలపై ప్రత్యేక మేనిఫెస్టోలు విడుదల చేయాలని కోరాయి. ఇప్పుడు ప్రత్యక్ష మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఈ అవసరం మరింత పెరిగింది.
స్థానిక సంస్థలను నిజంగా స్థానికం చేద్దాం : ఎన్నికల ఫలితాలు వచ్చిన మరు సటి రోజు రాజకీయ పార్టీలు తమ విజయాలు, పరాజయాలను విశ్లేషించు కుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు మరో సెమీఫైనల్ గానో, అధికార-ప్రతిపక్షాల బలాబలాల పరీక్షగానో పరిమితం కాకూడదు. గ్రామ స్వరాజ్యం, పట్టణ స్వపరిపాలన అనే రాజ్యాంగ లక్ష్యాన్ని ఎంతవరకు సాధించామో సమీక్షించుకునే సందర్భం కావాలి. గ్రామసభకు గౌరవం కావాలి. వార్డుకు గొంతు కావాలి. స్థానిక సంస్థలకు నిధులు కావాలి. ఎన్నికైన ప్రతినిధు లకు అధికారాలు కావాలి. పాలనలో పారదర్శకత కావాలి. ప్రజలకు ప్రశ్నించే హక్కు కావాలి. ఒకప్పుడు విజయవాడ వంటి నగరాల్లో ప్రజా సమస్యలే స్థానిక రాజకీయాల ఎజెండాను నిర్ణయించాయి. మారిన కాలంలోనూ ఆ స్ఫూర్తి అవ సరం. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది ప్రజల తీర్పు. కానీ ఎవరు గెలి చినా స్థానిక పాలన ప్రజల చేతుల్లో ఉండాలన్నదే ప్రజాస్వామ్యానికి శాశ్వత ఎజెండా. ఎన్నికల్లో ఎవరు గెలిచారన్న లెక్కతో రాజకీయ సమరం ముగుస్తుంది. కానీ ఎన్నికైన వారు ప్రజల కోసం ఏం చేశారన్న లెక్కతోనే స్థానిక ప్రజాస్వామ్యానికి అసలు పరీక్ష మొదలవుతుంది. సెల్ : 98489 92299

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు