Homeస్థానికం సానుకూలమే

స్థానికం సానుకూలమే

- Advertisement -

సర్వేలన్నీ కూటమి పార్టీలవైపే
ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
మూడు పార్టీలు సమన్వయంతో సాగాలి
వైసీపీ దుష్ప్రచారం తిప్పికొట్టండి
టీడీపీ సమావేశంలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మనదేనని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉన్నాయని, అయితే పార్టీ శ్రేణులు సమన్వయంతో ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తనను వాటర్ మెన్గా ఎకనామిక్ టైమ్స్‌ కథనం పేర్కొనటం సంతోషంగా ఉందని…జల సంరక్షణపై చేస్తున్న కష్టానికి అది దక్కిన గుర్తింపని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. పోలవరం సహా రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిచ్చి తెలుగుతల్లికి జలహారతి ఇస్తామని పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండు రోజుల లీడర్‌షిప్ సదస్సులో నేతల్ని ఉద్దేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. కష్టకాలంలో నిలబడిన కార్యకర్తకు పార్టీలో పూర్తి గౌరవం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన సామాన్య కార్యకర్త దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో తన జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జలాలను చూసి అక్కడి ప్రజల కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయని తెలిపారు. ఎల్‌నినో విపత్తుపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ ఇచ్చామని, పరిపాలనా వెసులుబాటు కోసం ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు.
ప్రజా ప్రతినిధులు సమరÆవంతగా పనిచేస్తూ, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. రాజకీయ పార్టీ బలపడటం ఎంత ముఖ్యమూ కూటమి ఐక్యత కూడా అంతే ముఖ్యమని, ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఫోటోల గురించి ఫ్లెక్సీల గురించి వివాదాలు వద్దని కూటమిగా కలిసి క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు. 2024 కంటే ఎక్కువ ఓట్లు వచ్చేలా పనిచేయాలని, ఇందుకోసం మనం చేసిన పనిని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం ముఖ్యమన్నారు.
వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి
ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోకుండా నిజాలతో గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నేతలకు దిశానిర్దేశం చేశారు. గొడ్డలి పార్టీ ఉగ్రవాదుల తరహాలో హిట్ – రన్ -హైడ్ విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో పనులు పూర్తి కాకపోయినా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం అంటూ డ్రామాలాడారన్నారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభిస్తే అది ఎప్పుడే పూర్తి చేసేశామని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీరసిస్తే గోదావరి జలాలు కావు పురుషోత్తపట్నం నుంచి వచ్చాయంటున్నారని.. కానీ ఆ ప్రాజెక్టుకు గొడ్డలి పార్టీ నాడు అడ్డుపడిందని గుర్తు చేశారు. ఆ పార్టీ చేస్తున్న వక్రీకరణలకు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీలో చర్చిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతో, బయట కూర్చుని అసత్యాలు అదే పనిగా చెబుతున్నారని విమర్శించారు.
‘వాటర్మ్యాన్’కు సదస్సు అభినందన
అంతకు ముందు సదస్సులో సీఈఓ సీఎం టూ వాటర్ మాన్ అంటూ ఎకనామిక్ టైమ్స్‌ రాసిన కథనంపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రికి అభినందన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చి తెలుగు యువతను ఐటీ నిపుణులుగా మార్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు, జల సంరక్షణతో వాటర్ మ్యాన్ గా మారారన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా వివిధ ప్రాంతాలకు జల వనరులు అందించేలా డ్రిప్ ఇరిగేషన్ సహా వివిధ ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారని ఎకనామిక్ టైమ్స్‌ తన కథనంలో పేర్కొందని మంత్రి వెల్లడించారు. జలం ఉంటేనే జనం, జలం ఉంటేనే అభివృద్ధి, ప్రగతి అన్న నినాదంతో 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పోలవరం, వెలిగొండ లాంటి ప్రాజెక్టులు చేపట్టిన సీఎంకు ఎకనామిక్ టైమ్స్‌ ప్రశంసలు తెలిపిందని వెల్లడించారు. సాగునీటి రంగంపై చేస్తున్న కృషికి గానూ తెలుగుదేశం పార్టీ నేతలంతా స్టాండింగ్ ఓవేషన్ తో ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు