. అక్టోబర్ 4న ‘ఆటో డ్రైవర్ సేవలో’
. హామీలు ఇచ్చాం… అమలు చేస్తాం
. అందరికీ రాష్ట్రాభివృద్ధే లక్ష్యం కావాలి
. శాసనసభలో చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నందువల్లే 15 నెలల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయగలిగామని, ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహకారంతో ప్రభుత్వం అంకితభావంతో ముందుకు సాగుతోందని…ఇది ఒక సమష్టి కృషి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యక్తిగత అజెండాల కారణంగా విఘాతం కలిగితే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని… అందరూ రాష్ట్రాభివృద్ధి లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. శాసనసభలో సభలో సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై జరిగిన చర్చలో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ… ముఖ్య పథకాలను వివరించారు. అక్టోబర్ 4న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం కానుందని, సొంత వాహనం కలిగిన ప్రతి ఆటో, క్యాబ్ డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద 2.90 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, ఏటా రూ.435 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన రూ.12 వేలకు బదులుగా కూటమి ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తున్నదని వివరించారు. పెన్షన్లను ‘పేదల సేవలో’ అని పేరు పెట్టినట్టు సీఎం తెలిపారు. నెలకు రూ.2,745 కోట్లు ఖర్చు చేస్తూ 63.50 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. వాటిలో 59శాతం మంది మహిళలని, ఏపీ తర్వాతి స్థానంలో తెలంగాణ (రూ.8,179 కోట్లు), కేరళ (రూ.7,295 కోట్లు) మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 8.86 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్టు సీఎం వెల్లడిరచారు. ఏటా రూ.2,963 కోట్లు ఖర్చు అవుతున్నప్పటికీ సంతోషంగా భరిస్తున్నామని చెప్పారు. ఈ పథకం అమలు వల్ల మహిళలకు ఆర్థిక లాభం మాత్రమే కాకుండా సామాజిక పరంగా ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించారు. తల్లికి వందనం కింద ఇప్పటివరకు రూ.10,090 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. కొత్తగా 2.79 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుని రూ.363 కోట్ల సాయం పొందనున్నారని చెప్పారు. దీపం-2.0 ద్వారా ఇప్పటివరకు 2.66 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించామని, రూ.1,718 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.డ్వాక్రా సంఘాలు అప్పులు తీసుకుని సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నాయని, మహిళా శక్తి ఎంత బలంగా ఉందో నిరూపితమైందన్నారు. లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రతి ఎమ్మెల్యే కనీసం వెయ్యి మహిళలను ఎంపిక చేసి ప్రోత్సహించాలని సూచించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతుల పట్ల అండగా ఉండటం గర్వకారణమని సీఎం అన్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటి వరకు 46.86 లక్షల మంది రైతులకు రూ.3,174 కోట్లు అందించామని వివరించారు. పంటలకు సబ్సిడీలు, విపత్తుల సమయంలో ప్యాకేజీలు, ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 4.71 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని సీఎం తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా పరిశ్రమలకు మానవ వనరులు అందజేస్తున్నట్టు చెప్పారు. అన్నక్యాంటీన్లను పునఃప్రారంభించి ఇప్పటివరకు 5.72 కోట్ల భోజనాలు అందించామని వివరించారు. తమిళనాడులో అమ్మా క్యాంటిన్‌లను ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తూ వచ్చాయని, కానీ ఏపీలో మాత్రం మరీ దారుణంగా పేదల అన్నదాన్ని పథకాన్ని నిలిపివేశారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా యూనివర్శల్ హెల్త్ పాలసీ ద్వారా 1.63 కోట్ల మందికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందజేస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3 లక్షల ఇళ్లు పూర్తి చేశామని, వచ్చే ఏడాది జూన్ నాటికి 6.15 లక్షల ఇళ్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రకటించారు.


