Homeఉధృతంగా కృష్ణా, గోదావరి

ఉధృతంగా కృష్ణా, గోదావరి

- Advertisement -

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
తగ్గుముఖం పట్టి మళ్లీ పెరిగిన కృష్ణా ప్రవాహం
తీర ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.6 అడు గులకు చేరుకోగా, ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 10.11 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఈ వరద నీటి మొత్తాన్ని ప్రాజెక్టున్న 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మూడు ప్రధాన పంట కాలువల ద్వారా 11,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. దీంతో నీటిపారుదల శాఖాధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లంక గ్రామాలు, తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం మరికొన్ని గంటల్లో 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం కనిపిస్తోందని అధికారులు పేర్కొన్నారు. మరోప్రక్క కృష్ణానది వరద పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం రాత్రి నుంచి తగ్గుముఖం పట్టిన కృష్ణా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శనివారం సాయంత్రానికి వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద శనివారం సాయంత్రానికి ఇన్‌, ఔట్‌ ఫ్లో 3.74లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల నుంచి ప్రస్తుతం 4లక్షల 80 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయానికి 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అత్యవసర సహాయం కోసం వరద బాధితులు కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్లు: 112, 1070, 18004250101. చేసి సహాయ సహకారం పొందాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగం క్షేత్రస్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసి 24/7 అందుబాటులో ఉండాలని కోరారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అలెర్ట్‌ మేసేజ్‌లు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక దక్షిణ ఒడిశా, గోపాల్‌పూర్‌ సమీపంలో వాయుగుండం తీరం దాటినందున వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్‌ జైన్‌ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు