. పశ్చిమాసియా దిశగా అమెరికా ఫైటర్ జెట్లు
. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ సైనిక విన్యాసాలు
. జెనీవాలో చర్చల్లో స్వల్ప పురోగతి
తెహ్రాన్/వాషింగ్టన్: ఓ పక్క చర్చలు…మరోపక్క దేనికైనా సిద్ధమన్నట్లు అమెరికా, ఇరాన్ వ్యవహార శైలి ఉంది. జెనీవా వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు మూడు గంటల్లోనే ముగిశాయి. ఇవి ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగినట్టు సమాచారం. మరోవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైనిక చర్యలు చేపట్టింది. అందుకోసం కొన్ని గంటల పాటు జలసంధిని మూసివేసింది. అంతేకాకుండా లైవ్ క్షిపణులను ప్రయోగించింది.తద్వారా ఎన్నో దేశాల ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం హార్ముజ్‌పై తమకు పట్టు ఉందనే పరోక్ష సందేశాన్ని అమెరికాకు ఇరాన్ పంపింది. హార్ముజ్ జలసంధి వద్ద తాము చేస్తున్న సైనిక విన్యాసాల ప్రభావం అమెరికాతో జరుపుతున్న చర్చలపై పడుతుందని ఇరాన్ భావిస్తోంది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి. అదే ప్రాంతంలో అమెరికా కూడా సైన్యాన్ని మోహరిస్తోంది. 24 గంటల్లో దాదాపు 50 అత్యాధునిక ఫైటర్ జెట్ల ను అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది. దీంతో అగ్రరాజ్యం ఏ క్షణాన ఎలాంటి చర్యలకు దిగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తాజా చర్యలను అమెరికా అధికారిణి ఒకరు ధ్రువీకరించినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాకు చెందిన ఎఫ్-22, ఎఫ్-16, ఎఫ్-35 వంటి ఫైటర్ జెట్‌లతో పాటు గగనతలంలోనే ఫ్యూయల్ నింపుకునే యుద్ధ విమానాలు పశ్చిమాసియా దిశగా వెళ్తున్నట్లు కొన్ని ఫ్లైట్ ట్రాకింగ్‌లు కూడా నివేదించాయి. కాగా, అమెరికా విమాన వాహక నౌక యూఎసఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కరేబియన్ సముద్రం నుంచి పశ్చిమాసియా దిశగా వెళుతోందని ఓ నేవీ అధికారి తెలిపారు. యుఎసఎస్ మహాన్, యూఎసఎస్ బెయిన్‌బ్రిడ్జ్, యూఎసఎస్ విన్ట్సన్ చర్చిల్ వంటి మూడు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్‌లతో ఇది ప్రయాణిస్తుందని ఆయన వెల్లడించారు. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎసఎస్ అబ్రహం లింకన్‌తో పాటు అనేక యుద్ధ విమానాలను ఇప్పటికే ఈ ప్రాంతంలో మోహరించిన సంగతి తెలిసిందే.
ఇరాన్ వాటిని ఇంకా అంగీకరించలేదు: రూబియో
జెనీవాలో చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని అమెరికా, ఇరాన్‌లు పేర్కొన్నాయి. చర్చల్లో పురోగతి సాధించామని.. కొన్ని విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సిఉందని అమెరికా అధికారులు తెలిపారు. ఓ ఒప్పందం కుదుర్చుకునేందుకు మార్గం సుగుమమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. కాగా తాజా చర్చలు మిశ్రమ ఫలితాలు ఇచ్చాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇరానియన్లు అంగీకరించడానికి సిద్ధంగా లేని కొన్ని కఠినమైన షరతులను ట్రంప్ నిర్దేశించినట్లు తెలిపారు. అమెరికా ఇంకా దౌత్యపరమైన పరిష్కారాలనే ఇష్టపడుతుందని అంటూనే… తమ అధ్యక్షుడి వద్ద మరిన్ని ఎంపికలు ఉన్నాయంటూ హెచ్చరికలు చేశారు. చర్చలకు ముందే రెండు దేశాల అధినేతలు హెచ్చరికలు చేసుకున్న సంగతి విదితమే. ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరకపోతే పరిణామాలు తీవ్రమవుతాయని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తదుపరి దశలో జరిగే చర్చల్లో సహేతుక వైఖరి అవలబించాలని ఇరాన్‌కు సూచించారు. గతేడాది జూన్‌లో జరిగిన బీ-2 బాంబు దాడిని గుర్తు చేశారు. దీనికి ప్రతీగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కూడా ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో బలమైన సైన్యానికైనా ఒక రోజు దెబ్బ తగిలితే తిరిగి లేచే అవకాశం ఉండకపోవచ్చని హెచ్చరించారు. అమెరికా నౌకాదళ ఉనికిపై వ్యాఖ్యానిస్తూ, సముద్రంలో యుద్ధనౌకలు ఉన్నా వాటిని ముంచగల ఆయుధాలు ఉన్నాయని సూచించారు. ఈ మేరకు ‘ఎక్స’ వేదికగా వరసగా పోస్టులు చేశారు.


