Wednesday, February 18, 2026
Homeతెలంగాణఅనుకున్నదొకటి…అయిందొకటి!

అనుకున్నదొకటి…అయిందొకటి!

- Advertisement -

తలకిందులైన పొత్తులు
మున్సి‘పోరు’లో అంతా గజిబిజి
ఖమ్మం జిల్లాలో వింత సమీకరణలు

విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానం తనకే ఖచ్చితంగా టికెట్ ఇస్తుందని అనుకున్న వారిలో కొందరికి టికెట్లు దక్కలేదు. డిప్యూటీ సీఎం భట్టికి అత్యంత సన్నిహితులు మల్లాది వాసుదేవ్ దంపతులకు టికెట్లు లభించలేదు. కాంగ్రెస్‌తో ఎంత మాత్రం పొత్తుకు అవకాశం లేదని చెప్పిన సీపీఎం… ఏకంగా తమ్మినేని సొంత గ్రామం లోనే చేతులు కలిపి కాంగ్రెసును ఏకగ్రీవం చేస్తూ ఆ పార్టీ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీపీఐ- కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందని ఆ రెండు పార్టీలు మొదటి నుంచి చెప్ప్పుకుంటూ వచ్చాయి. కాంగ్రెస్‌తో మైత్రి అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చి యోధులపురం మున్సిపాలిటీలో బీఆరఎస్, సీపీఎం… చైర్మన్ పదవి సీపీఐకి ఇస్తామని ఆ పార్టీని కోరినప్పటి¿ సీపీఐ పదవికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక విధానానికి కట్టుబడింది. అయితే కాంగ్రెస్ మాత్రం సీపీఐకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకపోగా తమ అభ్యర్థులను ప్రకటించడంతో సీపీఐ కూడా 14 వార్డుల్లో తమ అభ్యర్థులను నిలిపింది. నామినేషన్లు ఉపసంహరణ అనంతరం కాంగ్రెస్-సీపీఐకి మధ్య అవగాహన కొన్ని వార్డుల్లో కుదిరింది .అంటే ముందుగా అనుకున్నది ఏదీ జరగలేదు. అయితే ప్రతిష్టాత్మకంగా భావించే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పొత్తులు గజిబిజిగా మారడం కాంగ్రెసుకు కలిసి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా బీఆరఎస్‌తో జట్టు కట్టిన సీపీఎం తేల్దర్పల్లిలో కాంగ్రెస్ ఏకగ్రీవానికి సహకరించిందనే ప్రచారం కాంగ్రెసుకు కలిసి రాగా, సీపీఐ కూడా కొన్ని వార్డుల్లో అవగాహనకు రావడంతో ఇక కాంగ్రెసుకు బలమైన ప్రత్యర్థి బీఆరఎస్ మాత్రమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనూహ్యమైన సమీకరణల వల్ల కాంగ్రెస్ కు వ్యతిరేక జట్టు బలహీన పడిందని కొందరు విశ్లేషిస్తున్నారు. వైరాలో సీపీఐ… కాంగ్రెస్‌తో అవగాహన కుదరలేదు. ఇక్కడ సీపీఐ, సీపీఎం, బీఆరఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి .ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పక్షాన చైర్మన్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం ప్రధాన అనుచరుడు పువ్వాళ దుర్గాప్రసాద్ సతీమణి హఠాత్తుగా రంగంలో నుంచి తప్ప్పుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మధిరలో కాంగ్రెస్ -టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులకు బీఫారం ఇవ్వలేదు. అయితే టీడీపీ జిల్లా అధ్యక్షుడు రామనాథం… కాంగ్రెస్‌తో పొత్తులో ఉండగా , ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు బీ ఆరఎస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో నిలబడ్డారు. దీంతో ఆ పార్టీ క్యాడర్ గందరగోళంలో ఉంది. ఇక మధిర కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా వేమిరెడ్డి తులసి పేరు వినిపిస్తోంది. ఆమె భర్త శ్రీనివాస రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. ఇక మల్లాది వాసు దంపతులు గత ఎన్నికల్లో కాంగ్రెసుకు వెన్నుదన్నుగా నిలిచారు. భట్టి విక్రమార్క కు అత్యంత ఆత్మీయులు. భట్టి… తన నామినేషన్ వేసేందుకు అవసరమైన ఫీజు సెంటిమెంట్‌గా మల్లాది వాసు దంపతులకు నుంచే తీసుకుంటారనే ప్రచారం ఉంది. అంటే వారికి భట్టితో ఎంత ఆత్మీయబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఆ దంపతులు ఇద్దరికీ టికెట్ లభించలేదు. అంటే అనుకున్నదొకటైతే జరిగింది వేరేలా ఉంది. ఇక కల్లూరు సత్తుపల్లి మున్సిపాలిటీలోను చిత్రమైన పొత్తులు ఉన్నాయి. ఇదిలా ఉంటే, రెబల్స్‌ను తప్పించడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. రెబల్స్ గతంలో ధర్నాలు చేయడం కూడా చూశాం కానీ ఈసారి అధినాయకత్వం గీసిన గీత దాటలేదు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి క్యాడర్‌ను కాంగ్రెస్ అధిష్టానం గీత దాటకుండా కట్టడి చేస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి . మొత్తం మీద గజిబిజి పొత్తుల మధ్య ఈ ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు