ఏదో ఓ వివాదం లేకపోతే నరేంద్ర మోదీకి, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వానికి నిద్రపట్టదు. రాజ్యసభలో వందే మాతరం, జై హింద్ లాంటి నినాదాలు చేయకూడదని రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇది బులెటెనే అయినప్పటికీ అది ఉత్తర్వుతో సమానమే. ఈ ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరించ బోతున్న చంద్రాపురం పొన్ను సామి రాధా కృష్ణన్ కాదు. కానీ ఆయన అధ్యక్షత వహించే రాజ్యసభ సచివాలయం ఆయనకు తెలియకుండా ఇలాంటి ఆదేశం జారీ చేయగలుగు తుందనుకోలేం. మరి సంఫ్‌ుపరివార్‌కు ప్రీతిపాత్రమైన ‘‘జై శ్రీరాం’’ నినాదం పార్లమెంటులో చేయవచ్చునో లేదో తెలియదు. పోనీ మోదీ అని అనొచ్చునా? మరి బీజేపీ ఎంపీ బిధూడీ నిండు కొలువులో ముస్లింలను అవమానించే మాటలు మాట్లాడడం పార్లమెంటు మర్యాదకు అనుగుణమైందని అనుకోవాలేమో. వందే మాతరం మీద బీజేపీ రకరకాల తమాషాలు చేస్తూ ఉంటుంది. ఇటీవలే వందేమాతరంలోని కీలక పంక్తులను పండిత్ నెహ్రూ తొలగించారని క్షుద్ర వివాదానికి తెర తీసింది. ఇది పచ్చి అబద్ధం. బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన వందేమాతరం గేయంపై తమకు ఎనలేని భక్తి శ్రద్ధలు ఉన్నట్టు ప్రవర్తించింది. వందేభారతం గేయంపై సంఫ్‌ు పరివార్‌కు వల్లమాలిన భక్తి శ్రద్ధలే ఉంటే ఆర్‌ఎస్‌ఎస్ శాఖలలో ఆ గేయాన్ని ఎందుకు ఆలపించరు అన్న ప్రశ్నకూ సమాధానం ఉండదు. నిజానికి వందేమాతరం ఆధారంగా సంఫ్‌ు పరివార్, దాని రాజకీయ అంగమైన బీజేపీ రాజకీయం మాత్రం దండిగా చేస్తున్నాయి. భారత్‌కు జయం కలుగుగాక అన్న అర్థం ఇచ్చే జైహింద్ అన్న నినాదం విన్నా బీజేపీకి తేళ్లు జెర్రులు పాకినట్టు ఉంటుందేమో! ‘‘జై హింద్’’ నినాదాన్ని మొట్ట మొదట ఇచ్చింది కేరళలోని ట్రావంకోర్ కు చెందిన స్వాతంత్య్ర సమర యోధుడు చమప రామన్. ఆయన జర్మనీలో ఉంటూ భారత స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఈ నినాదాన్ని విదేశాలలోని భారత విప్లవకారులు ప్రచారంలోకి తెచ్చారు. బ్రిటీష్ వారికి వందేమాతరం అన్నా, జై హింద్ అన్నా పడేది కాదు. స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారి కొమ్ము కాసిన సంఘ పరివార్‌కు, దాని రాజకీయ విభాగమైన బీజేపీకి అంత కోపం కావొచ్చు. స్వాతంత్య్ర పోరాట కాలంలో 1943-1944లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జై హింద్ నినాదాన్ని విరివిగా వాడే వారు. ఆయన ప్రసంగాల తరవాత విధిగా జై హింద్ అనే వారు. ఆయన నెలకొల్పిన ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదం కూడా ఇదే. జనం ఒకరినొకరు పలకరించుకున్నప్పుడూ జై హింద్ అనడం సంప్రదాయంగా వస్తోంది. దేశం స్వతంత్రమైన తరవాత భారత రక్షణ దళాలు జై హింద్‌ను పరస్పరం పలకరించుకోవడానికి వాడే వారు. ఇది దేశవాసుల్లో దేశ భక్తిని ప్రోదిచేసింది. జై హింద్‌కు నిజానికి నిఖార్సైన సెక్యులర్ స్వభావం ఉంది. ఇది దేశవాసులను సంఘటితం చేసింది. స్వాతంత్య్ర పోరాటంలో ఈ నినాదం బాగా మార్మోగింది. పండిత్ నెహ్రూ ఉపన్యాసాల చివరలో కూడా జై హింద్ అని దీనికి విస్తృత ప్రచారం తీసుకొచ్చారు.
1906 నుంచి 1910 మధ్య బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం వందేమాతరం గేయాన్ని అనేక సార్లు నిషేధించింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ నినాదమే ఎక్కువగా వినిపించేది. 1930లలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వందేమాతరం గీతాలాపనను నిషేధించారు. ఆర్య సమాజ్ నాయకుడు వందే మాతరం రామ చంద్రరావు జైలులో ఉన్నప్పుడు ఈ పోలీసులు కొరడా దెబ్బలు కొట్టినప్పుడల్లా వందేమాతరం అనే వారు. అది కడకు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. భగత్ సింగ్, ఖుదీరాం బోస్ కూడా ఉరికంబానికి వేలాడినప్పుడూ జై వందే మాతరం, జై హింద్ అనే నినదించారు. 1950 జనవరి 24న రాజ్యాంగ నిర్ణాయక సభ వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించింది. గాంధీకి, సుభాష్ చంద్ర బోస్‌కు, నెహ్రూకు-సర్దార్ పటేల్ పటేల్‌కు లేదా నెహ్రుకు నేతాజీకి పోటీ పెట్టే సంఫ్‌ు పరివార్ వందేమాతరంను ఈసడిరచు కోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంత చరిత్ర ఉన్న ఈ వందేమాతరం, జై హింద్ అన్న మాటలనే పార్లమెంటులో ప్రస్తావించకూడదు అని రాజ్యసభ సచివాలయం ఆదేశాలు జారీ చేయడం ఆశ్చర్యకరం ఏమీ కాదు. అంతేకాదు రాజ్యసభలో ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని కూడా అనకూడదట. ఆ ఇతర మాటలేమిటో మాత్రం రాజ్యసభ సచివాలయం జారీ చేసిన బులెటిన్‌లో వివరించలేదు. సభా గౌరవాన్ని పరిరక్షించడానికి ఈ మాటలు ప్రస్తావించకూడదట. అక్కడికి ఇవేవో పార్లమెంటు గౌరవానికి విరుద్ధమైనవైనట్టు. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఆవగింజంత చోటైనా లేని సంఫ్‌ు పరివార్, బీజేపీకి వందేమాతరం, జై హింద్ అన్న మాటలు రుచించకపోవడమూ సహజమే. సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేస్తున్న సమయంలో సావార్కర్ బ్రిటిష్ సైన్యంలో జనాన్ని చేర్చడంలో తలమునకలై ఉన్నారన్న సత్యాన్ని గుర్తు పెట్టుకుంటే అసలు రహస్యం బయట పడ్తుంది. బెంగాల్ శాసన సభకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది కనక బీజేపీ ఈ వివాదానికి తెర లేపి ఉండొచ్చు. కానీ వందేమాత్రం, జై హింద్ – ఈ రెండిరటికీ బెంగాల్‌తో అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఇవి బెంగాల్ ఆత్మగౌరవంతో ముడివడి ఉన్నాయి. అప్పుడే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ బీజేపీ మీద అగ్గి మీద గుగ్గిలంలా పోరాడుతున్నారు. బీజేపీ నాటకాల మర్మం అర్థం చేసుకుంటే వందేమాతరం, జై హింద్ అంటే ఎందుకంత వ్యతిరేకత వెళ్లగక్కుతున్నారో అర్థం అవుతుంది. కిందటి బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫైళ్లు బయట పెడ్తామని మోదీ ప్రభుత్వం బీరాలు పలికింది. అందులో ఆర్‌ఎస్‌ఎస్‌కు, హిందూ మహాసభకు వ్యతిరేకమైన అంశాలున్నాయని కనిపెట్టగానే ఆ విషయం ప్రస్తావించడమే మానుకుంది. నెహ్రూకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు విరుద్ధంగా లేశమంత ఆనవాలైనా నేతాజీ ఫైళ్లలో లేదు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హయాంలో ఇలాంటి ఆదేశాలు జారీ కావడానికి స్పష్టమైన కారణమే ఉంది. ఆయన మధ్యలో కాషాయ తీర్థం పుచ్చుకున్న మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ లాంటి వారు కాదు. రాధాకృష్ణన్ మూలాలు ఆర్‌ఎస్‌ఎస్‌లో బలంగా ఉన్నాయి. డిసెంబర్ ఒకటిన ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ వివాదం ప్రతిపక్షాలకు మరో ఆయుధం అందివచ్చినట్టైంది.
అపశబ్దాలైపోయిన వందే మాతరం, జై హింద్
- Advertisement -


