. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల పనులు వేగవంతం
. హార్టీకల్చర్‌కు ప్రభుత్వం అండ
. ఆయిల్‌పామ్‌కు మద్దతు ధర
. రైతు భరోసాకు రూ.9 వేల కోట్లు
. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రులు
విశాలాంధ్ర – హైదరాబాద్ : హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నియోజకవర్గ చిరకాల స్వప్నమైన 50 సీట్లతో కూడిన మెడికల్ పీజీ సెంటర్ ను మంత్రి దామోదర రాజనర్సింహ మంజూరు చేశారు. హుస్నాబాద్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం పర్యటించారు. పీజీ మెడికల్ సెంటర్ వల్ల హుస్నాబాద్ … ఆసుపత్రుల హబ్ గా మారుతుందని పొన్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ లో రూ.82 కోట్లతో 150 పడకల ప్రభుత్వ వైద్యశాల కు మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ.11.50 కోట్లతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని, ఆపరేషన్ థియేటర్ , ఐసీయూ, ఎన్ బిఎస్ యూ, ఓపీ బ్లాక్, పోస్ట్ నెటల్ వార్డు, ఫార్మసీ , ల్యాబ్ , ప్రసూతి విభాగాలకు ప్రారంభించారు. రూ.77.20 కోట్లతో కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు వరుసల రహదారికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన సభలో మంత్రి పొన్నం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ తరగతులు హుస్నాబాద్ లో ఈ ఏడాది నుంచి ప్రారంభం కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మంత్రి దామోదర మాట్లాడుతూ తెలంగాణ గొంతు… తెలంగాణ హక్కును పార్లమెంట్ లో యావత్ దేశానికి వినిపించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు. నా ప్రజల ఆరోగ్యం నా బాధ్యత … నా ప్రభుత్వ బాధ్యత అని ఇక్కడికి ఆసుపత్రి తెచ్చారన్నారు. ప్రజాప్రభుత్వంలో 16 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశామని అంతర్జాతీయ స్థాయిలో మన ఆడ బిడ్డలు నర్స్‌లు, డాక్టర్ లు ఉండాలని కోరారు. ఒకప్పుడు హుస్నాబాద్ నక్సల్ ప్రాంతం ,కమ్యూనిస్ట్ ప్రాంతం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రాంతంగా మారిందని తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం నుంచి బయటకు వస్తున్నామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యవసాయం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని, రూ.40 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలో వేసిందని వివరించారు. నెల రోజుల్లో సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. హార్టికల్చర్ పంటలకు మద్దతు ధర ఇస్తామని పేర్కొన్నారు. మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజుల్లో రూ.తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద అందించామన్నారు. తొలుత బస్వాపూర్ గ్రామానికి చేరుకున్న మంత్రులకు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఘన స్వాగతం పలికారు. హుస్నాబాద్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ హేమావతి ,అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి పాల్గొన్నారు.


