Homeఇంచార్జ్‌ మంత్రులదే బాధ్యత

ఇంచార్జ్‌ మంత్రులదే బాధ్యత

- Advertisement -

విశాలాంధ్ర-సచివాలయం : కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పులు చేస్తే ఇంచార్జ్‌ మంత్రులు బాధ్యత తీసుకొని సరిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు మంత్రులతో కూటమి నేతల తీరుపై చర్చించారు. పార్టీ, ప్రభుత్వ ఇమేజ్‌కు దెబ్బ తగలకుండా ఎమ్మెల్యేల తీరును నివారించాలని సూచించారు. ఎమ్మెల్యేల చర్యలు పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని ప్రశ్నిస్తూ… ఈ విషయమై ఇంచార్జ్‌ మంత్రులు తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలను వెంటనే పిలిచి హెచ్చరించాలని, కౌన్సెలింగ్‌ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తనలు సహించేది లేదని, చట్టవిరుద్ధంగా వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుచిత చర్యలు, పెరోల్‌ సిఫార్సులు, ఇతర వివాదాల్లో చిక్కుకున్న సంఘటనలు ఈ చర్చకు దారితీశాయి. సదరు ఎమ్మెల్యేలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. గుంటూరు ఈస్ట్‌, అనంతపురం అర్బన్‌, అముదలవాలస, శ్రీశైలం, నెల్లూరు రూరల్‌, గూడూరు మొదలైన నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రవర్తనపై సమావేశంలో చర్చకొచ్చింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేసే వ్యాఖ్యలు, ప్రవర్తనలపై ఇంఛార్జ్‌ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని, క్రమశిక్షణ కాపాడాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోతే ప్రభుత్వ పనులు ఆలస్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆదేశాలు టీడీపీ, జనసేన, బీజేపీ సహా ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ పనితీరుపై సీఎం చంద్రబాబు, సహచర మంత్రులు ప్రశంసలు కురిపించారు. పవన్‌ పనితీరు స్ఫూర్తిదాయకంగా ఉందని అభినందించారు. ఇటీవల మామండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచందనం డిపోను సందర్శించిన వివరాలను పవన్‌ కల్యాణ్‌ మంత్రివర్గ సమావేశంలో పంచుకున్నారు. వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆక్రమణలపై ఆధారాలతో సహా వీడియోలు తీయించానని తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ చొరవను, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తీరును చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలతో ఏవైనా పరికరాలు తయారు చేయిద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేల్లో ఎవరు తప్పు చేసినా ఇంఛార్జ్‌ మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబుతో అన్నారు. రెండు పార్టీలు అనేక వివాదాలకు సంబంధించి రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒప్పుకోవడం లేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలందరికి గట్టిగా చెప్పాలని చంద్రబాబును పవన్‌ కోరారు. జనసేనకు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు అంశాన్ని కందుల దుర్గేశ్‌ ప్రస్తావించగా, అది పాలసీ మేటర్‌ అని నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టుకోవాలని సీఎం సూచించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఇంఛార్జి మంత్రులు ఆ బాధ్యత తీసుకుంటారన్నారు. మరోవైపు 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై మరోసారి కేబినెట్‌ లో చర్చ జరిగింది. ఆ 48 మంది పనితీరు మార్చుకోవాలని, ఈ విషయంలో ఇంఛార్జి మంత్రులు బాధ్యతలు చంద్రబాబు స్పష్టం చేశారు.
అర్హులందరికీ ఇళ్లు…
మంత్రులు, ఎమ్మెల్యేల చొరవ అవసరం
పేదలందరికీ ఇళ్లు కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని, నివాస స్థలంలేని వారందరి అర్హుల జాబితా రూపొందించి అందరికీ ఇళ్ల స్థలాలు దక్కేలా చూడాలన్నారు. ఏడాదిలోగా నివాస స్థలంలేని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం ఉండకూడదని, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలన్నారు. మొంథా తుపాను సమయంలో క్షేత్ర స్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో ఉండి, ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లే తుపాను సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు. ఇక, ఆర్టీజీ సెంటర్‌ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామని వెల్లడిరచారు. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీం స్పిరిట్‌ తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని అభినందనలు తెలిపారు. మీరంతా ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కేబినెట్‌ సమావేశానికి ముందు మంత్రులతో లోకేశ్‌ భేటీ అయ్యారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచి-చెడు తెలియడం లేదని లోకేశ్‌ అన్నట్లు తెలిసింది. అవగాహన రాహిత్యంతో ఎమ్మెల్యేలు-కేడర్‌ మధ్య సమన్వయం ఉండల్లేదని, వారికి సీనియర్‌ నేతలతో అవగాహన కల్పించాలని కోరినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచి కేడర్‌ను సమాయత్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వ పని తీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ, కేడర్‌ మాత్రం నిరాశకు గురైనట్టు తేలింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు