Homeజాతీయంఎర్రకోట వద్దభారీ పేలుడు

ఎర్రకోట వద్దభారీ పేలుడు

- Advertisement -

. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని
. ఎర్రకోట సమీపంలో భారీ పేలుళ్లు
. 10 మంది మృతి…24 మందికి తీవ్రగాయాలు
. మెట్రో స్టేషన్‌ గేట్‌1 పార్కింలో ఘటన
. దిల్లీ సహా అనేక నగరాల్లో హైఅలర్ట్‌

న్యూదిల్లీ : దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట సమీపంలో భారీ పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన రెండు కార్లలో వరుస పేలుళ్లు సంభవించగా… పెద్ద ఎత్తు మంటలు ఎగిసిపడి పక్కనున్న వాహనాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. 24మంది తీవ్రంగా గాయపడగా… వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటనలో డెలివరీ బాయ్‌ ఒకరు సజీవదహనం అయినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో చారిత్రక ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్‌ గేట్‌ నెంబర్‌ 1 వద్ద ఒక కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. మొత్తం నాలుగు వాహనాలు దగ్ధమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఏడు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను ఆర్పివేయడం ప్రారంభించగా… ఆ తర్వాత మరికొన్ని అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ‘‘ఆసుపత్రికి 15 మంది క్షతగాత్రులను తీసుకువచ్చారు. వారిలో 8 మంది మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఒక వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది’’ అని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. కాగా ఘటనా స్థలి వద్ద పరిస్థితిని చూస్తే చూస్తే ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి లాగానే కనిపిస్తోందని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. దిల్లీ పోలీసులు హై అలెర్ట్‌ ప్రకటించారు. ఘటనాస్థలిలో పరిస్థితి భయానకంగా మారింది. కార్లు, ఆటోలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సమీపంలోని షాపులు, భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ప్రతి సోమవారం దిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత, ప్రాణ నష్టం కాస్త తగ్గిందని తెలుస్తోంది.
హైగ్రేడ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ ఉపయోగించినట్లు అనుమానం
ఎర్రకోట మెట్రో స్టేషన్‌ పార్కింగ్‌ కారులో హైగ్రేడ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటన నేపథ్యంలో దిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో కేంద్రహోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. పేలుడు ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. కాగా, పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. ముంబై, హైదరాబాద్‌ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఈ హైఅలర్ట్‌ ప్రకటించారు. భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఎన్‌ఎస్‌జి, ఎన్‌ఐఏ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. ఎర్రకోట సహా కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలిస్తున్నారు. భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్‌ టీమ్‌ ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఎర్రకోట, చాందినీచౌక్‌ వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు.
ఆగిన వాహనంలో పేలుడు?
ఎర్రకోట వద్ద సాయంత్రం 6.52 గంటలకు పేలుడు జరిగిందని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. నెమ్మదిగా వచ్చిన వాహనం రెడ్‌లైట్‌ దగ్గర ఆగగా… ఆ హనంలో పేలుడు జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు