. విద్యా ప్రమాణాలు, మెరుగైన వసతులే ప్రామాణికం
. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక పరిశీలన
. పరిగణనలోకి సుప్రీంకోర్టు తీర్పులు
. నిర్దేశిత సమయంలోనే కౌన్సెలింగ్ ప్రారంభం
విశాలాంధ్ర – హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా కళాశాలల్లో బోధనా సిబ్బంది, బోధన స్థాయి, ల్యాబ్‌లు, భవనాలు, మౌలిక వసతులు… ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలనే భావనలో ప్రభుత్వం ఉంది. ఫీజుల నిర్ణయానికి వీటినే ప్రాతిపదిక తీసుకోవాలని భావిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ) కోర్సులు సాంకేతిక రంగంపై బలమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాలలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీ పడేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఇస్లామిక్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్సెస్ కర్నాటక, పీఏ ఇనాందార్ అండ్ అదర్స్ వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో… కళాశాల భవిష్యత్ ప్రణాళికలు, కళాశాల ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపాదిక చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫీజుల నిర్ణయంలో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతులు, బోధన సిబ్బంది.. ఇతర వ్యవహారాలపై గత ప్రభుత్వం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖతో తనిఖీలు చేయించింది. ఆ శాఖ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి నివేదిక రూపొందించింది.
కానీ గత ప్రభుత్వం ఆ నివేదికపై ఎటువంటి చర్య తీసుకోలేదు. కానీ తమకు నచ్చిన కళాశాలలకు ఫీజులు పెంచుకునే అవకాశాన్ని కల్పించి… మరికొన్ని కళాశాలలకు మాత్రం పక్షపాత వైఖరితో మొండి చేయి చూపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ నివేదిక పరిశీలనతో పాటు ఇంజినీరింగ్ కళాశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలను మదింపు చేసి ఫీజులపై నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని నియమించాలని, అదే సమయంలో ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


