Homeఇంధన స్విచ్‌ విఫలం

ఇంధన స్విచ్‌ విఫలం

- Advertisement -

పైలట్లపై నెపం నెట్టే ప్రయత్నమా?
ఎయిరిండియా దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక

ముంబై: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక తాజాగా బహిర్గతమైంది. మొత్తం 15 పేజీలతో రూపొందించిన ఈ నివేదికలో దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడిరచారు. ప్రమాదం వెనక ఎలాంటి కుట్ర కోణం లేదని, పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కనిపించలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ‘విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంగా పక్షులు ఎగరలేదు. పక్షి ఢీకొన్న ఆనవాళ్లను కూడా గుర్తించలేదు’ అని ఏఏఐబీ నివేదిక వెల్లడిరచింది. అంతేగాకుండా ఘటన వెనక విద్రోహ చర్య ఉండే అవకాశముందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాల్లేవని తెలిపింది. ఇంజిన్‌ ఇంధన కంట్రోల్‌ స్విచ్‌ ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తోంది. ప్రాథమిక నివేదికలోని మరిన్ని అంశా లను పరిశీలిస్తే… సెకను తేడాతో రెండు ఇంజిన్‌ ఇంధన కంట్రోల్‌ స్విచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. వాటిని తిరిగి రన్‌ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. ఒకటి పాక్షికంగా పనిచేయగా… రెండోది రికవరీ అవడంలో విఫలమైంది. ప్రమాద సమయంలో థ్రస్ట్‌ లివర్లు పనిచేయనట్లుగా అనిపించాయి. కానీ, బ్లాక్‌బాక్స్‌ డేటా పరిశీలిస్తే థ్రస్ట్‌ పని చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. దీన్నిబట్టి చూస్తే సాంకేతిక వైఫల్యం ఉన్నట్లు అనిపిస్తోంది. టేకాఫ్‌కు ఫ్లాప్‌ సెట్టింగ్‌, గేర్‌ సాధారణంగానే పని చేశాయి. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఆకాశం స్పష్టంగా కనిపించింది. గాలులు తేలికగానే ఉన్నాయి. ఎయిరిండియా పైలట్లు ఇద్దరూ మెడికల్‌గా ఫిట్‌గానే ఉన్నారు. ఇలాంటి విమానాలు నడిపిన అనుభవం ఎక్కువగానే ఉంది. గతంలో ఈ విమానంలోని ఇంధన కంట్రోల్‌ స్విచ్‌లలో సమస్య వచ్చిన సందర్భాలు లేవు. ఫ్యూయల్‌ కంట్రోల్‌ స్విచ్‌ లాకింగ్‌ మెకానిజంపై బోయింగ్‌ ఆప్షనల్‌ అడ్వైజరీ జారీ చేసింది. దీన్ని ఎయిరిండియా అనుసరించలేదు. సంబంధిత తనిఖీలు చేపట్టలేదు. విమానం థ్రాటిల్‌ కంట్రోల్‌ మాడ్యూల్స్‌ను 2019, 2023లో భర్తీ చేశారు. నివాస సముదాయాల మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది. పలు భవనాలను విమానం ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌, ల్యాండిరగ్‌ గేర్‌తో పాటు విమాన శిథిలాలు దాదాపు 1000 అడుగుల విస్తీర్ణంలో చెల్లాచెదురయ్యాయి. దీని ఆధారంగా ప్రమాదం చాలా తీవ్రంగా జరిగింది.
కాక్‌పిట్‌లో ఏ క్షణంలో ఏం జరిగిందంటే…
యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్‌ స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన చోటుచేసుకోవడానికి ముందు కాక్‌పిట్‌లో ఏ క్షణానికి ఏం జరిగిందన్న వివరాలను ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో’ తమ నివేదికలో వెల్లడిరచింది. జూన్‌ 12 ఉదయం 11:17 గంటలకు ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ వీటీ-ఏఎన్‌బీ విమానం దిల్లీ నుంచి అహ్మదాబాద్‌లో ల్యాండ్‌ అయింది. మధ్యాహ్నం 1:10:38 గంటలకు విమానాశ్రయంలోని బే 34 నుంచి బయల్దేరేందుకు సిద్ధమైంది. 1:25:15 గంటలకు ట్యాక్సీ క్లియరెన్స్‌ కోరగా… ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ అనుమతించింది. నిమిషం తర్వాత విమానం బే 34 నుంచి ఆర్‌ 4 ట్యాక్సీవే మార్గంలో 23వ రన్‌వే పైకి చేరుకుంది. అక్కడి నుంచి టేకాఫ్‌కు సిద్ధమైంది. 1:32:03 గంటలకు విమానం గ్రౌండ్‌ నుంచి టవర్‌ కంట్రోల్‌కు మారింది. 1:37:33 గంటలకు టేకాఫ్‌ క్లియరెన్స్‌ జారీ అయింది. 1:37:37 గంటలకు విమానం టేకాఫ్‌ ప్రారంభించింది. 1:38:39 గంటలకు విమానం ఎయిర్‌/గ్రౌండ్‌ సెన్సార్లు ఎయిర్‌ మోడ్‌లోకి మారాయి. దీంతో లోహవిహంగం గాల్లోకి లేచింది. 1:38:42 గంటలకు విమానం గరిష్ఠ వేగమైన 180 నాట్స్‌ను అందుకుంది. ఆ మరుక్షణమే ఇంజిన్‌ 1, ఇంజిన్‌ 2కు చెందిన ఇంధన స్విచ్‌లు ‘రన్‌’ నుంచి ‘కటాఫ్‌’ పొజిషన్‌కు మారాయి. ఒక సెకను తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజిన్లు రెండూ టేకాఫ్‌ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. స్విచ్‌లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్‌ మరో పైలట్‌ను ప్రశ్నించినట్లు కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో ఉంది. తాను చేయలేదని మరో పైలట్‌ సమాధానమిచ్చారు. ఎయిర్‌పోర్టు పెరీమీటర్‌ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకు రావడం సీసీటీవీ దృశ్యాల్లో రికార్డయింది. 1:38:47 గంటలకు మొదటి ఇంజిన్‌ ఇంధన స్విచ్‌ ‘కటాఫ్‌’ నుంచి మళ్లీ ‘రన్‌’కు మారింది. 1:38:56 గంటలకు రెండో ఇంజిన్‌ ఇంధన స్విచ్‌ కూడా ‘కటాఫ్‌’ నుంచి మళ్లీ ‘రన్‌’కు మారింది. ఇంజిన్‌ కంట్రోల్‌ స్విచ్‌లను ‘కటాఫ్‌’ నుంచి ‘రన్‌’కు మార్చినప్పుడు ప్రతి ఇంజిన్‌ ‘ఫుల్‌ అథారిటీ డ్యూయల్‌ ఇంజిన్‌ కంట్రోల్‌’ ఆటోమేటిక్‌గా రీలైట్‌ చేస్తుంది.
అప్పుడు ఇంధనం వచ్చి థ్రస్ట్‌ రికవరీ అవుతుంది. ఈ విమానంలో మొదటి ఇంజిన్‌ తిరిగి ఆన్‌ అవడం ప్రారంభించింది. కానీ, రెండో ఇంజిన్‌ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చేయలేకపోయింది. 1:39:05 గంటలకు పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్‌ ‘మేడే మేడే మేడే’ అనే సందేశం పంపించారు.1:39:11 గంటలకు డేటా రికార్డింగ్‌ ఆగిపోయింది.1:44:44 గంటలకు క్రాష్‌ ఫైర్‌ టెండర్లు సహాయక చర్యల నిమిత్తం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాయని నివేదిక వివరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు