Friday, March 6, 2026
Homeఅంతర్జాతీయంఇమ్రాన్ హత్యకు కుట్ర?

ఇమ్రాన్ హత్యకు కుట్ర?

- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ఇమ్రాన్ కంటిచూపు కోల్పోయినట్లు వార్తలు రావడంతో బుధవారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలను కలిపే కీలక మార్గాలను నిరసనకారులు అడ్డుకున్నారు. ఇస్లామాబాద్ పార్లమెంట్ సమీపంలో ఇమ్రాన్ మద్దతుదారులు ధర్నా నిర్వహించారు. ఇదిలా ఉంటే, ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండి అడియాలా జైలులో తీవ్రంగా హింసించారని… మంత్రి, పీసీబీ చీఫ్ అయిన మోహ్సీన్ నఖ్వీ తమను బెదిరిస్తున్నారని ఆయన సోదరీమణులు ఆరోపించారు. సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది తన నివేదికలో ఇమ్రాన్‌ఖాన్ కుడి కంటి చూపు 85 శాతం కోల్పోయినట్లు నివేదికలో వెల్లడించడంతో పాకిస్థాన్‌లోని ఆయన పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ కార్యకర్తలతో పాటు ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసిమ్ మునీర్, మోహ్సీన్ నఖ్వీలు ఇమ్రాన్ ఖాన్‌ను కస్టడీలో చంపడానికి కుట్రపన్నారని ఇమ్రాన్ సిస్టర్స్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్‌కు, మాకు ఏదైనా జరిగితే దానికి మోహ్సీన్ నఖ్వీనే కారణమని అన్నారు. ఆసిమ్ మునీర్ ఆదేశాల మేరకే ఇమ్రాన్ ఖాన్‌పై జైలులో క్రూరంగా ప్రవర్తించినట్లు వారు ఆరోపించారు. మరోవైపు, ఇమ్రాన్ మద్దతుదారులు “కంటికి కన్ను” అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగైందని చెప్పారు. గతంలో గడియారాన్ని కూడా చూడలేని ఇమ్రాన్ ఇప్పుడు, అందులో ముళ్లను కూడా చూడగలుగుతున్నారని తెలిపారు.
ఇమ్రాన్ ఫుడ్ మెనూ విడుదల చేసిన ప్రభుత్వం
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఫుడ్ మెనూను వెల్లడించింది. దేశీ చికెన్, మటన్‌తో పాటు డ్రైఫ్రూట్స్ పెడుతున్నట్లుగా పేర్కొంది. అడియాలా జైలులోని ఏడు గదుల ప్రత్యేక జైలు సముదాయంలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారని.. సహజ వెలుతురుతో పాటు స్వచ్ఛమైన గాలి అందుతోందని పేర్కొంది. అలాగే వ్యాయామం కోసం సైక్లింగ్ యంత్రాలు, జిమ్ పరికరాలు అందించినట్లు తెలిపింది. ఇక ఆహార, పానీయాల్లో ఖర్జూరాలు, వాల్‌నట్‌లు, చికెన్, మటన్, సలాడ్, వేయించిన గుడ్లు, వివిధ ఫ్రూట్ షేక్‌లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇమ్రాన్ ఎండలో కూర్చుని పుస్తకాలు, వార్తాపత్రికలు చదువుతున్నారని నివేదికలో పేర్కొంది. అల్పాహారంలో ఖర్జూరం, వాల్‌నట్‌లు, తేనె, కాఫీ, గంజి, లస్సీ, వేడి పాలు, చియా గింజలు, దానిమ్మ రసం తీసుకుంటున్నారని తెలిపింది. మధ్యాహ్న భోజనంలో దేశీ చికెన్, మటన్, సలాడ్, మిశ్రమ ఊరగాయలు, బంగాళాదుంప చిప్స్, గుడ్లు, వివిధ రకాల పప్పులు ఉన్నాయని చెప్పింది. ఇక సాయంత్రం బాదం, ఎండుద్రాక్ష, తురిమిన కొబ్బరి, పాలు, ఖర్జూరం, అరటిపండ్లు, ఆపిల్ షేక్‌లను తీసుకుంటున్నారని వివరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు