. గజా కోసం ఆందోళనలు హింసాత్మకం
. అమెరికా ఎంబసీ ముట్టడికి యత్నం: ఇద్దరి మృతి
. మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గజా ప్రజలకు సంఫీుభావం తెలుపుతూ, ఇజ్రాయిల్ మారణహోమాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. గజాను కాపాడాలని నినాదాలు ఇచ్చారు. బ్యానర్లు ప్రదర్శించారు. నిరసనల్లో మహిళలు పాల్గొన్నారు. ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీని ముట్టడిరచేందుకు ప్రయత్నించిన క్రమంలో భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్యాయి.
గజాలో మారణహోమం, ట్రంప్ ప్రణాళికకు వ్యతిరేకంగా శుక్రవారం ఇస్లామాబాద్‌లో భారీ మార్చ్‌కు తెహ్రీకే లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) సంస్థ పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం… రాజధానికి వెళ్లే ప్రధాన మార్గాలను షిప్పింగ్ కంటైనర్లు అడ్డుపెట్టి మూసివేసింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. నిరసనకారులను కట్టడి చేసేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. నిరసనకారులు కోపంతో రగిపోయారు. వాహనాలు, దుకాణాలు ధ్వంసం చేశారు. పరిస్థితులు చేయిదాటే క్రమంలో ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు.
లాహోర్‌లోనూ నిరసనలు భారీగా జరిగాయి. దీంతో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. రావల్పిండిలో శనివారం వరకు 144 సెక్షన్ అమలు చేశారు. కర్ఫ్యూ సమయంలో లౌడ్ స్పీకర్లు, ప్రదర్శనలును నిషేధించారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, దౌత్య మిషన్లు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్‌గా పరిగణిస్తూ పెద్దఎత్తన పహారా ఏర్పాటు చేశారు. ఎటు వెళ్లేవీలు లేకుండా అన్ని మార్గాలను ఇస్లామాబాద్ అధికారులు మూసివేశారు.


