- కిలో రూ.70కి చేరిన ధర – వారం వ్యవధిలోనే రూ.20 పెరుగుదల
- రైతు బజార్లలో పరిమితంగానే రాయితీ ఉల్లి
- అది కూడా నాణ్యతలేని సరుకంటూ విమర్శలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పేదల వంటింట్లో మరోసారి ఉల్లి మంటలు రాజుకున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.40 నుంచి 50 మధ్య అమ్మిన ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగి రూ.60 నుంచి 70కి చేరాయి. నాణ్యమైన ఉల్లి మరింత ధర పలుకుతోంది. వారం రోజుల వ్యవధిలోనే కిలోకు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఒకపక్క నిత్యావసరాల ధరలు ఇప్పటికే సామాన్యుడిని ఉక్కిర్ఙిక్కిరి చేస్తుండగా ఉల్లి ధరల పెరుగుదల మరింత ఆర్థిక భారంగా మారింది. దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే సరఫరాపైనే ఏపీ మార్కెట్లు అధికంగా ఆధారపడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సరఫరా తగ్గడం, నిల్వల్లో ఉన్న ఉల్లి నాణ్యత దెబ్బతినడం, కొత్త పంట పూర్తిస్థాయిలో మార్కెట్‌కు రాకపోవడం వంటి కారణాలతో హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు పెరిగాయి. ఆ ప్రభావం నేరుగా చిల్లర మార్కెట్‌పైనా పడింది. ఉల్లి ధరల పెరుగుదల హోటల్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లలో ఉల్లి వినియోగించే ఆహార పదార్థాల ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ధరలను పెంచితే వినియోగదారులు తగ్గిపోతారనే భయంతో హోటల్ నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ధరలు పెంచక తప్పదని హోటల్ యజమానులు పేర్కొంటున్నారు.
ఎందుకీ పెరుగుదల?
ఉల్లి ధరల పెరుగుదలకు సరఫరా తగ్గడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో ఉల్లి ధరలు భారీగా పతనమైన సమయంలో రైతులకు గిట్టుబాటు ధర లభించలేదు. దీంతో ఈసారి కొన్ని ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. మరోవైపు వర్షాల ప్రభావంతో పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు నిల్వల్లో ఉన్న ఉల్లికి కూడా కొంత నష్టం జరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఉల్లి పంట ఉత్పత్తి ఎక్కువ. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే సరఫరా తగ్గడం వల్ల ఏపీ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఇటువంటి పరిస్థితులు తరచూ తలెత్తుతున్నా ఉల్లి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే అంశంలో ప్రభుత్వాలు శ్రద్ధ కనబర్చకపోవడంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా అక్కడ టోకు ధరలు పెరిగితే ఇక్కడ చిల్లర మార్కెట్లో వెంటనే ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన ఉల్లి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం రైతు బజార్లలో కిలో రూ.35చొప్పున రాయితీ ఉల్లి విక్రయిస్తున్నప్పటికీ ఇవి కొందరికే అందుతున్నాయి. పైగా ఈ ఉల్లి నాణ్యత ఉండడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యమైన ఉల్లిపాయలను బడా వ్యాపారుల కోసం అధిక రేట్లకు విక్రయిస్తూ… రైతు బజార్లలో సామాన్యులకు మాత్రం నాణ్యత లేని వాటిని విక్రయిస్తున్నారు.
వచ్చే వారం నుంచి రైతు బజార్లలో కిలో రూ.32కే ఉల్లి
కిలో ఉల్లిపాయలు 32 రూపాయలకే వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 115 రైతు బజార్లలో విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. మొబైల్ కౌంటర్ల ద్వారా కూడా ఉల్లిపాయలు సరఫరా చేయాలని నిర్ణయించారు. అలాగే రేషన్ కార్డు ద్వారా కిలో కందిపప్పును సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మార్కెట్ ధర కంటే 25-30శాతం తక్కువకు కందిపప్పు విక్రయిస్తామని, ఇందుకోసం 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కంది సేకరణకు కేంద్రం సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. నాలుగు నుంచి ఐదు నెలల పాటు కందిపప్పును పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పామాయిల్ ధరల నియంత్రణకూ కేంద్రంతో చర్చలు జరుపుతామని చెప్పారు. పీడీఎస్ బియ్యంలో 25శాతం నూకల స్థానంలో 10శాతం నూకలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 నాటికి వెయ్యి ‘మీ మార్ట్’ దుకాణాలు ప్రారంభిస్తామని, ఇప్పటికే 870 ‘మీ మార్ట్’ దుకాణాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 64 రకాల నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు మీ మార్ట్ దుకాణాల ద్వారా అమ్మకాలు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 100, 250, 500 గ్రాముల చిన్న ప్యాకెట్లలో సరుకులు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. నిత్యావసర వస్తువుల ధరల అదుపులో భాగంగా బ్లాక్ మార్కెట్లపై నిఘా పెంచినట్లు మంత్రి వెల్లడించారు.


