Homeఎండిన మెట్టకు ‘ఎత్తిపోతల’ జీవం

ఎండిన మెట్టకు ‘ఎత్తిపోతల’ జీవం

- Advertisement -

విశాలాంధ్ర-సచివాలయం: సాగునీటి కాల్వలు పారే సుసంపన్నమైన డెల్టా ప్రాంతాల్లో మూడు పంటలతో రైతాంగం కళకళలాడుతుంటే, కేవలం ఆకాశం వైపు చూస్తూ వర్షాధారంగా బతికే మెట్ట ప్రాంతాల అన్నదాతలకు ఎత్తిపోతల పథకాలే (లిఫ్ట్ ఇరిగేషన్) నిజమైన కల్పవృక్షాలు. నదులు, చెరువులు, వాగుల్లో లభ్యమయ్యే కొద్దిపాటి జలాలను ఎగువ ప్రాంతాల్లోని పొలాలకు ఎత్తిపోసి…ఎండిన భూములను సస్యశ్యామలం చేసే ఈ పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారిన ఎత్తిపోతల పథకాల సమూల ప్రక్షాళన కోసం ఏకంగా రూ.4,400 కోట్లతో రూపొందించిన మెగా మాస్టర్ ప్లాన్ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద తుది ఆమోద దశలో ఉంది. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సన్న, చిన్నకారు, వెనుకబడిన బలహీన వర్గాల సాగు ప్రయోజనాల కోసం మొత్తం 1,023 ఎత్తిపోతల పథకాలను గతంలో ఏర్పాటు చేశారు. వీటి పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వినియోగిస్తే రాష్ట్రంలో ఏకంగా 8 లక్షల 42 వేల ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందాల్సి ఉంది. సాధారణంగా ఈ పథకాల సివిల్, మెకానికల్ పనులను ప్రభుత్వం పూర్తి చేశాక, వాటి రోజువారీ నిర్వహణ బాధ్యతలను స్థానిక లబ్ధిదారుల కమిటీలకు అప్పగిస్తారు. ఈ కమిటీలు రైతుల నుంచి ఎకరానికి రూ.500ల నుండి రూ.2,500ల వరకు నిర్వహణ చార్జీలుగా వసూలు చేసుకుంటూ… ఎప్పటికప్పుడు చిన్నపాటి లోపాలను సరిదిద్దుకుంటూ నీటి సరఫరాను యోగ్యంగా ఉంచుకోవాలి. కానీ, గత ఐదేళ్లగా రైతు కమిటీలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రోత్సాహం, సాంకేతిక మద్దతు పూర్తిగా సున్నాగా మారింది. మోటర్లు కాలిపోవడం, పైపులైన్లు పగిలిపోవడం, సివిల్ స్ట్రక్చర్స్ దెబ్బతినడం వంటి పెద్ద పెద్ద సమస్యలు తలెత్తినప్పుడు పేద రైతుల కమిటీలు వాటిని సొంత ఖర్చులతో బాగు చేయించుకోలేక చేతులెత్తేశాయి. ఫలితంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పథకాల్లో 362 ఎత్తిపోతల కేంద్రాలు మోటర్ల శబ్దమే లేకుండా పూర్తిగా మూతపడ్డాయి. మరో 505 పథకాలు నామమాత్రంగా, పాక్షికంగా మాత్రమే పని చేస్తూ అరకొర నీటిని అందిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఏకంగా 3 లక్షల 50 వేల ఎకరాల మెట్ట ఆయకట్టు ఎండిపోయి, వేలాది రైతు కుటుంబాలు వలసల బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే కేవలం తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకునే పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ… ఈసారి వ్యవస్థను దీర్ఘకాలికంగా పటిష్టం చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. అధికారులు రూపొందించిన సరికొత్త ప్రణాళిక ప్రకారం మూతపడిన, పాక్షికంగా నడుస్తున్న ఎత్తిపోతల పథకాలన్నింటినీ ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించడమే కాకుండా, రాబోయే 10 ఏళ్ల పాటు వాటి నిరంతర నిర్వహణ బాధ్యతలను టెండర్ల ప్రక్రియ ద్వారా సమర్థ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఈ పదేళ్ల మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ విధానం వల్ల ఎక్కడ ఏ చిన్న సాంకేతిక లోపం తలెత్తినా ప్రైవేట్ సంస్థలే తక్షణమే స్పందించి బాగు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమయ్యే రూ.4,400 కోట్ల భారీ నిధుల ప్రతిపాదనలను జలవనరుల శాఖ ఇప్పటికే సిద్ధం చేయగా… ఆర్థిక శాఖ దీనిపై సానుకూల పరిశీలన జరుపుతోంది. ఏళ్లుగా నీటి చుక్క లేక బీడువారిన భూములకు శాశ్వత ఉపశమనం కలిగించే ఈ సుదీర్ఘ కార్యాచరణ, మెట్ట ప్రాంత రైతులకు నూతన ఆశాకిరణంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిలిచిపోయిన ఈ పథకాలను పునరుద్ధరించడం ద్వారా తక్షణమే లక్షలాది ఎకరాలను మళ్లీ సాగులోకి తీసుకురావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎత్తిపోతల పథకాలు సజావుగా సాగాలంటే నాణ్యమైన కరెంట్ సరఫరా అత్యంత కీలకం. రాష్ట్రంలోని మొత్తం పథకాల్లో 474 భారీ ఎత్తిపోతల కేంద్రాలు నడవడానికి హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్లు తప్పనిసరి. పంట కాలంలో పొలాలు ఎండిపోకుండా రైతులకు నమ్మకంగా నీరందించేందుకు గాను, వీటికి రోజుకు 16 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా ప్రత్యేక విద్యుత్ లైన్లను డిజైన్ చేశారు. ఈ హైటెన్షన్ కనెక్షన్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులను నీటిపారుదల కార్పొరేషనే నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, గత ప్రభుత్వంలో విద్యుత్ డిస్కామ్‌లకు చెల్లించాల్సిన చార్జీల బకాయిలు కొండలా పేరుకుపోయి ప్రస్తుతం రూ.508 కోట్ల 24 లక్షలకు చేరాయి. దురదృష్టవశాత్తూ సంస్థకు అందుతున్న వార్షిక బడ్జెట్ కేటాయింపులు కేవలం రూ.150 కోట్లు మాత్రమే కావడంతో ఈ బకాయిలు పెద్ద భారంగా మారాయి. లో-టెన్షన్ కనెక్షన్లు కలిగిన చిన్న తరహా ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం ద్వారా పూర్తి రాయితీ ఇస్తోంది. ఈ క్రమంలోనే, పాత విద్యుత్ బకాయిలను క్లియర్ చేస్తూనే, దశాబ్దాలుగా నిధులు లేక పెండింగ్‌లో ఉండిపోయిన 27 కొత్త ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మరో రూ.132 కోట్ల 46 లక్షలు అవసరమని జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. పాత బకాయిలు చెల్లించి, కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసి, యావత్ మెట్టనీటి పారుదల రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడం ద్వారా ప్రతి ఎకరాకూ నీరందించేందుకు సర్కార్ సర్వసన్నద్ధమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు