Sunday, December 7, 2025
Homeసంపాదకీయంఎగ్జిట్‌ పోల్స్‌ చిలక జోస్యం

ఎగ్జిట్‌ పోల్స్‌ చిలక జోస్యం

- Advertisement -

ఎన్నికల ఫలితాలపై జనం ఉత్కంఠకు సమాచారం వెల్లడిరచడానికి ప్రీపోల్‌ (ఎన్నికలకు ముందు) సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ (పోలింగ్‌ తరవాత) ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఎన్నికలకు ముందు సర్వేలకు అవకాశం లేకుండా పోయింది. ఎగ్జిట్‌ పోల్స్‌ కొన్ని మీడియా సంస్థలూ, కొన్ని ఇతర సంస్థలు నిర్వహిస్తాయి. బీహార్‌ ఎన్నికల తరవాత పోలింగ్‌ ముగిసీ ముగియక ముందే కనీసం డజను ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో అధిక శాతం బీహార్‌లో మళ్లీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేనే గెలుస్తుందని చెప్పాయి. మొదటి దశ ఎన్నికల తరవాత ఎన్డీయే ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయం అన్న మాట బలంగా వినిపించింది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించే వారు ఓటు వేసి వచ్చిన వారిలో కొందరితో మాట్లాడి ఎన్నికల రంగంలో తమ కళాకౌశలాన్ని రంగరించి ఫలితాలు విడుదల చేస్తారు. వీరు పోలింగ్‌ ముగిసిన తరవాత ఎంత మందిని సంప్రదించారు, వారిలో ఏ వర్గం వారు ఎందరు, ప్రస్తుత ప్రభుత్వ అనుకూలురు ఎంతమంది, వ్యతిరేకులు ఎందరు అన్న ప్రశ్నలు సమాధానం లేకుండానే మిగిలిపోతాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ సశాస్త్రీయమైనవని అంటూ ఉంటారు. ఆ క్రమంలో కొంత శాస్త్రీయత ఉంటే ఉండొచ్చు కానీ సంపూర్ణంగా శాస్త్రీయత ఉంటుందని చెప్పలేం. మంగళవారం వెలువడిన అనేకా నేక ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు చూస్తే అందులో ఉదాహరణ ప్రాయంగా ఒకటో రెండో తప్ప ఎన్డీయేకే మళ్లీ అధికారం దక్కుతుందని చెప్పాయి. అయితే ఈ సర్వేలు నిర్వహించిన సంస్థల్లో చాలా వాటి పేర్లు మొదటి సారిగా వింటున్నవే. వాటి సామర్థ్యం ఏ పాటిదో తెలియదు. సాధారణంగానే ఎగ్జిట్‌ పోల్స్‌ మిడతంభొట్లు జోస్యం లాగానే ఉంటున్నాయి. అవి నిజమవుతాయో, లేదో చెప్పలేం. వీటి సరళిని బట్టి చూస్తే ఇవన్నీ ఎవరి పనుపుననో జరిగినవనిపిస్తోంది. ఉదాహరణకు 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చాలా సంస్థలు మోదీ ప్రచారాన్ని పుక్కిట పట్టినట్టు ఎన్డీయేకీ 400 స్థానాలు వస్తాయని చెప్పాయి. అబ్కీ బార్‌ చార్‌ సౌ పార్‌ అన్నది 2024 సార్వత్రిక ఎన్నికలలో మోదీ ప్రచారంలో పెట్టిన నినాదం. తీరా చూస్తే ఎన్డీయేకు దక్కింది 240 సీట్లు మాత్రమే. అంటే 2019 లో సాధించిన 303 సీట్ల కన్నా 63 తగ్గాయి. కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు కూడా ఎన్డీయేకు రాలేదు. అంటే ఆ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టంగా గతి తప్పాయి. ఏలినవారి ఆదేశాల మేరకే ఈ ఫలితాలు వెల్లడిరచినట్టు విమర్శలు వచ్చాయి. మంగళవారం వెలువడిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు సైతం కారణం ఏదైనా మోదీ మనసుకు ఇంపైన రీతిలోనే వచ్చాయి. రెండు విడతలుగా జరిగిన బీహార్‌ ఎన్నికలు ఎన్డీయేకు, మహా ఘట్బంధన్‌కు మధ్య జరిగిన పోటీగా లేవు. తేజస్వీ యాదవ్‌కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఎన్నికల్లా పొడసూపాయి. మోదీ, అమిత్‌ షా ఎన్నికల ప్రచార సభలలో అంతటా జనం పలచగానే కనిపించారు. తేజస్వీ సభలకు మాత్రం అన్ని చోట్లా జనం పోటెత్తినట్టు వచ్చారు. సభల్లో కనిపించిన జనం కూడా ఓటర్ల నాడి పట్టిస్తుందని చెప్పలేం. ఫలితాలు వెల్లడిరచినప్పుడు మాత్రమే తామర తంపరగా వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ పస ఏమిటో తేలదు. ఇంతకు ముందు రెండో మూడో సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించేవి. అవి సాధికారికమైనవి అన్న భావన కూడా ఉండేది. అవి కూడా అప్పుడప్పుడు పేలని టపాసుల్లా మిగిలిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇంతకు ముందు ఎగ్జిట్‌ పోల్స్‌కు ప్రసిద్ధి చెందిన సంస్థల ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఈసారి వెలవడలేదు. బీహార్‌లో పురుషుల కన్నా 8 శాతం మహిళలు అధికంగా ఓటు వేశారంటున్నారు. మహిళలు ఎన్డీయేకు అనుకూలంగా ఓటు వేయొచ్చునని ముందు నుంచీ చెప్తున్నారు. దాదాపు కోటి మంది మహిళల ఖాతాలో పదేసి వేల రూపాయలు నితీశ్‌ ప్రభుత్వం జమ చేసింది. ఆయన ఉప్పు తిన్నందుకు మహిళలు ఓటు వేయకుండా ఉంటారా అన్న వాదన మీదే ఈ అంశం ఆధారపడి ఉంది. నిజానికి బీహార్‌ జనాభాలో పురుషుల సంఖ్యే ఎక్కువ. ప్రతి 1000 మంది పురుషులకు 918 మంది మహిళలే ఉన్నారు.
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూస్తే మహాగట్బంధన్‌ పని అయిపోయిందన్న అభిప్రాయమే కలుగుతోంది. ఏమైతేనేం ఎగ్జిట్‌ పోల్స్‌ బీహార్‌ ఎన్నికలకు మరింత మసాలా జోడిరచాయి. పోలింగ్‌ పూర్తి అయ్యీ కాక ముందే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలూ వెలువడడం మొదలైంది. మరి చివరి వరసలో ఉన్న ఓటర్ల అభిప్రాయాలు ఇందులో ప్రతిబింబించాయో లేదో తెలియదు. ఎవరిని గెలిపించాలో ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించిన వారు పోలింగ్‌కు ముందే నిర్ణయించుకు న్నట్టు కనిపించింది. 2020 లో ఆర్‌జేడీకి 75 సీట్లు వచ్చాయి. ఈసారి ఎగ్జిట్‌ పోల్‌ నిర్వాహకులకు ఔదార్యం ఎక్కువై మొత్తం మహాగట్భందన్‌కు రాబోయే స్థానాలు 80 అన్నారు. ఎగ్జిట్‌పోల్‌ నిర్వహించే వారందరినీ ఓ గదిలో బంధించి వారి తలలకు తుపాకీ ఉంచి మీరు ఈ రకమైన ఫలితాలే ప్రకటించాలి అని ఎవరో ఆదేశిం చినట్టుగా ఉంది. ఆ పని చేయగలవారెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమిత్‌ షా ఎన్డీయేకు 200 సీట్లు వస్తాయన్నారు. కానీ ఎగ్జిట్‌పోల్‌ నిర్వాహకులు మొరపెట్టు కున్నందువల్లో ఏమో ససారం ఎన్నికల ప్రచార సభలో ఎన్డీయేకు వచ్చే స్థానాలను 160 కి తగ్గించారు. వివిధ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూస్తే అవన్నీ కొంచెం అటూ ఇటుగా ఇదే సంఖ్య దగ్గర రాజీపడ్డట్టు ఉన్నారు. అసలు ఫలితాలు ఎలా ఉన్నా, ఏ పక్షం అధికారంలోకి వచ్చినా ఎదుటి పక్షం ఆ ప్రభుత్వాన్ని సాగనివ్వదు అన్న సంకేతం కూడా ఎగ్జిట్‌ పోల్‌ నిర్వాహ కులు ఇస్తున్నట్టున్నారు. అనేక చోట్ల ఎగ్జిట్‌పోల్స్‌ పరిస్థితిని గమనిస్తే వాటి విశ్వసనీయత మీద అనుమానం కలగక తప్పదు. ఉదాహరణకు 2024 లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల తరవాత కేకే అనే సంస్థ వెల్లడిరచిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు అచ్చు గుద్దినట్టు అసలు ఫలితాలతో సరిపోలాయి. ఆ ఎగ్జిట్‌ పోల్స్‌లో కూటమికి 164, వైఎస్సార్‌ సీపీకి 11 సీట్లు దక్కుతాయని చెప్పారు. సరిగ్గా అలాగే జరిగింది. ఆత్మ సాక్షి సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో మాత్రం వైసీపీకి 100 నుంచి 105 సీట్లు వస్తాయని చెప్పి తీరా ఫలితాలు వెలువడినప్పుడు బోల్తా పడిరది. బీహార్‌లో గెలవడానికి బీజేపీ ఏ ప్రయత్నాన్నీ వదలలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అందులో భాగమైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ప్రతిపక్షాలను నైతికంగా దెబ్బ తీసే లక్ష్యమూ ఉండొచ్చు. ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించే సంస్థలు వారు ఎంతమందిని సంప్రదించారో చెప్పలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ చిలక జోస్యం స్థాయికి దిగజారినట్టున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు