అడవులపై ప్రత్యేక నిఘా ` పెట్రోలింగ్ ముమ్మరం
ఏడాదిన్నర కాలంలో 8.53 టన్నులు స్వాధీనం
విశాలాంధ్ర బ్యూరో`కడప: వైఎసఆర్ కడప జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణా దశాబ్దాలుగా సాగుతోంది. ఇది పెద్ద సవాల్‌గా మారిపోయింది. జిల్లాలోని అడవుల్లో లభించే ఈ సహజ సంపదను దోచుకునే వారి ఆట కట్టించేందుకు అటవీ శాఖాధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఉండే గిరాకీ కారణంగా ఎర్ర చందనం నిరంతరం దోపిడీకి గురవుతోంది. ఇటీవల పోలీసులు, అటవీ శాఖ నిఘా పెంచి… కొత్త వ్యూహాలతో బడా స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. ఇదే క్రమంలో ఏడాదిన్నర కాలంలో 8.53 టన్నుల ఎర్రచందనాన్ని స్మగర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. పది వాహనాలు సీజ్ చేశారు. మొత్తం 30 మందిపై కేసులు పెట్టారు. పట్టుబడిన వారి నుంచి సేకరించే సమాచారం ఆధారంగా స్మగ్లర్లను పట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ‘ఎర్ర’ డబ్బు రుచి మరిగిన బడా స్మగ్లర్ల గురి పెట్టారు. అంతర్గతంగా నిఘా పెంచడమే కాకుండా ఎర్రచందనం రాష్ట్ర సరిహద్దులు దాటించే వారి కోసం గాలింపులు చేపట్టారు. దేశ రాజధాని దిల్లీ నుంచి ఈ అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిసి మరిన్ని భద్రతా పరమైన ప్రత్యేక చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో తమిళనాడు రాజధాని చెన్నై, పుదుచ్చేరికి చెందిన ఏడుగురు స్మగ్లర్లను కడప డీఎఫఓ వినీత్ కుమార్ నేతృత బృందం అరెస్టు చేసింది. వారి నుంచి మూడు టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకుంది. ఫలితంగా ఎర్ర అడవుల్లోకి చొరబాట్లు తగ్గాయి. ఆరితేరిన పాత స్మగ్లర్లపై జిల్లా అటవీ శాఖ నిఘా పెంచింది. కేసులు ఎదుర్కొంటున్న వారు ప్రత్యక్షంగా కాకుండా తెర వెనుక నుంచి స్మగ్లింగ్ చేయిస్తున్నట్లు తెలిసి మరింత నిఘా పెట్టింది. పాత స్మగ్లర్‌లలో ఒకరిని అధికారులు ఇటీవల అరెస్టు చేశారు. ఈ స్మగ్లర్ ప్రజాప్రతినిధిగానూ పనిచేసినట్లు తెలిసింది. వారి ఆటకట్టిస్తే తప్ప అనుచర స్మగ్లర్లను అడ్డుకోగలమని అధికారులు భావించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ఎక్కువగా అవకాశం ఉండే ప్రాంతాలకు వెళ్లే దారులతో పాటు నీటి వనరులు ఉన్న అటవీ ప్రాంతాýపై ప్రత్యేక నిఘా పెట్టారు. పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు గురికాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని కడప డీఎఫఓ వినీత్ కుమార్ వెల్లడించారు. టాస్క్ ఫోర్స్‌తో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడవుల్లో 22 బేస్ క్యాంపుల ద్వారా భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఉన్న 20 మందికిపైగా పాత స్మగ్లర్లపై గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు. తమకు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ అలసత్వం చూపకుండా, పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు కుమార్ వెల్లడించారు.


