Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపీఏబిఆర్-హంద్రీనీవా కాల్వలను అనుసంధానం చేయండి

పీఏబిఆర్-హంద్రీనీవా కాల్వలను అనుసంధానం చేయండి

- Advertisement -

ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మలకు పరిటాల శ్రీరామ్, ఎంపీ పార్థసారథి విజ్ఞప్తి
విశాలాంధ్ర ధర్మవరం : పీఏబీఆర్ కుడి కాలువ- హంద్రీనీవా కాలువలను అనుసంధానం చేసి ధర్మవరం నియోజకవర్గంలో నీటీ సమస్యలను తీర్చాలని టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిశారు. ఎస్ఐఆర్ సమావేశంలో భాగంగా విజయవాడకు వెళ్లిన శ్రీరామ్ హిందూపురం ఎంపీ పార్థసారథితో కలిసి మంత్రి నిమ్మలతో భేటి అయ్యారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల రైతాంగానికి సాగు, తాగునీటి భద్రత కల్పించాల్సిన అవసరం గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత కారణంగా పీఏబీఆర్ కెనాల్ పరిధిలోని చెరువులు పూర్తిస్థాయిలో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కాలువ ద్వారా రెండు జిల్లాల్లో 49 మైనర్ ఇరిగేషన్ చెరువులకు నీరు అందించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పీఏబీఆర్ ద్వారా వస్తున్న నీరు సరిపోవటం లేదని అందుకే హంద్రీనీవా కాలువ ద్వారా అనుసంధానం చేస్తే ఈ చెరువులకు పూర్తిస్థాయిలో నీరు అందించవచ్చన్నారు. 150 క్యూసెక్కుల నీటిని 70 రోజులపాటు విడుదల చేసే విధంగా 0.90 టీఎంసీ నీటి కేటాయింపు అవసరం ఉందని ఈ లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.4.50 కోట్ల వ్యయం అవసరమవుతుందన్నారు. ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగకరమైన హంద్రీనీవా ఫేజ్ఉ2లో జిల్లేడు బండ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించిన మార్పులు చేయాల్సిన అవసరం గురించి కూడా వివరించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రతిపాదిత 2.41 టీఎంసీల సామర్థ్యం కారణంగా భారీ స్థాయిలో వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని రైతులు, భూ యజమానులు ఆందోళనలో ఉన్నారన్నారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.0 నుంచి 1.5 టీఎంసీల మధ్య లేదా సాంకేతికంగా అనుకూలమైన స్థాయికి మార్చే అవకాశాలను పరిశీలించాలని కోరడం జరిగిందన్నారు. ప్రాజెక్టు ప్రయోజనాలు కొనసాగుతూనే భూముల ముంపు, నిర్వాసితుల సంఖ్య గణనీయంగా తగ్గేలా ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కోరారు. మరోవైపు రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని కూడా శ్రీరామ్, ఎంపీ పార్థసారథి కలిశారు. ధర్మవరం నియోజకవర్గంలో రహదారి, వంతెనల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్మవరం ఉ ఎన్.హెచ్ 42 రహదారిపై దెబ్బతిన్న కాజ్‌వేకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని కోరారు. కాజ్‌వే పక్కనున్న చెక్‌డ్యామ్ ప్రతి వర్షాకాలంలో పొంగిపొర్లడం వల్ల కొన్ని రోజుల పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయన్నారు. గుట్టకిందపల్లి, గూడ్స్‌షెడ్ కొట్టాల, గొట్లూరు, సుబ్బారావుపేట, సంగమేశ్వరం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే ఇక్కడ కాజ్ వేకి మరమ్మతులు చాలా అవసరం అని.. ఇందు కోసం రూ.90 లక్షలు మంజూరు చేయాలన్నారు. ధర్మవరంఉధర్మపురి రహదారిలో గంగమ్మగుడి సమీపంలో చిత్రావతి నదిపై ఉన్న లో-లెవల్ కాజ్‌వే స్థానంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ధర్మపురి, మల్లాకాలువ, దర్శనమల, వెంకటతిమ్మాపురం, రావులచెరువు, నేలకోట, నేలకోట తండా, ఏలుకుంట్ల గ్రామ పంచాయతీల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.30 కోట్లు అవసరం ఉంటుందని వివరించారు. శ్రీరామ్ ఇచ్చిన విజ్ఞప్తులపై మంత్రులు రామానాయుడు, బీసీ జనార్ధన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలను కచ్చితంగా పరిశీలించి.. తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు