విశాలాంధ్ర బొమ్మనహాల్ :- ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడిగా నిలిచిన తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శివమొగ్గ, తీర్థహళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి ఇన్‌ఫ్లో పెరుగుతోందని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు.ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 28 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1604.55 అడుగులకు నీటిమట్టం చేరింది. పూర్తి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 28 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం జలాశయానికి 21,089 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 8,035 క్యూసెక్కుల అవుట్‌ఫ్లోగా నీటిని విడుదల చేస్తున్నారు.గత ఏడాది ఇదే తేదీతో పోలిస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. అప్పట్లో జలాశయంలో 1625.64 అడుగుల నీటిమట్టంతో 78.60 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఆ సమయంలో 29,546 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 38,557 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు.ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల వర్షాలతో తుంగభద్రకు పెరుగుతున్న వరద ప్రవాహం..
- Advertisement -
RELATED ARTICLES


