Homeవిశ్లేషణఎల్‌నినో ముప్పు… పంటలకు ఎండగండం

ఎల్‌నినో ముప్పు… పంటలకు ఎండగండం

- Advertisement -

నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో వర్షించక పోవడం ఎల్‌నినో ప్రభావంతో సవాళ్లు రాష్ట్రంలో రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు జరిగే ఖరీఫ్ వ్యవసాయం అత్యంత కీలకం. ఈ కాలంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం 580.1 మిల్లీమీటర్లు కురవవలసి ఉన్నది. గత సంవత్సరం జూలై 8 నాటికి 131.1 మిల్లీమీటర్ల వర్షం కురవగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 84.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అంతే 35.6 మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు వీస్తున్నాయి. 45 డిగ్రీల నుండి 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం కలగజేస్తున్నది. సాగు, తాగునీటి ఎద్దడి నెలకొంటున్నది. ప్రధాన రిజర్వాయర్లు తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, వెలుగోడు, సోమశిల, కండలేరులలో గత సంవత్సరం 524.56 టీఎంసీల నీరు చేరగా ఈ సంవత్సరం జూలై 8వ తేదీ నాటికి 290.74 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. అనేక చిన్న నదులు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు వర్షాబావ ప్రభావంతో నీరు లేక ఎండిపోతున్నాయి. పశుపక్ష±యూదులకు తాగునీరు కొరత ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తోంది. వర్షాలు కురవాల్సిన ప్రస్తుత కాలంలో సైతం వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. అత్యధికంగా వర్షాధార వ్యవసాయం సాగించే రాయలసీమ జిల్లాలు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో రైతులు వేసిన మెట్ట పంటలు ఎండు ముఖం పట్టాయి. కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతాల్లో వరిసాగు ప్రశ్నార్థకం కానుంది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్‌టీఆర్, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఇప్పటివరకు నమోదయింది. అన్నమయ్య జిల్లాలో 60శాతం పైగా తక్కువ వర్షపాతం నమోదయింది. మిగిలిన జిల్లాల్లో 20 నుండి 59శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదై కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయి. ఓ పక్క ఎండలతో మండిపోతూ మరో పక్క ఉక్కపోతతో కూడిన వాతావరణం, అప్పుడప్పుడు కమ్ముకొస్తున్న మేఘాలు వర్షించకుండా అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కనిపించని దేవతామూర్తులకు మొక్కితే వరణుడు వర్షించకపోతాడా అంటూ పూజలు చేస్తున్నారు. వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ అంటూ రాయలసీమ ప్రాంత ప్రజలు తమ ఇష్ట దైవాలను వేడుకుంటున్నారు. కప్పలతో ఊరేగింపులు సామూహిక వనభోజనాలు చేస్తూ ఆశగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. కార్తెల కాలం అయిపోయెను వానమబ్బు పల్లెపై కనిపించడమే లేదు అనుకుంటూ ఆశ, నిరాశల మధ్య పల్లె ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితి దయనీయంగా ఉంటే చెదురమదురుగా పడిన వర్షాలకు 6.69 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు రైతులు సాగు చేశారు. ఖరీఫ్ కాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 30.84 హెక్టార్లు జరగాల్సి ఉండగా ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ 22 శాతం సాగు జరిగింది. అయితే ఇప్పటివరకు పడిన నామమాత్రపు వర్షపాతం వల్ల రైతాంగం వేసిన మెట్ట పంటలు ఎండిపోతున్నాయి. వర్షానికి వర్షానికి మధ్య దూరం పెరిగి డ్రైస్పెల్స్‌ ఏర్పడి పంట భూములలో తేమ లేక పంట చేలు సొమ్ముసిల్లిపోతూ ఎండిపోతూ పంటలు చేతికి దక్కుతాయన్న ఆశా,నమ్మకాన్ని రైతులు కోల్పోతున్నారు. రాయలసీమలో సాధారణ వర్షపాతం 407.7 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 60.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఉత్తరాంధ్ర జిల్లాలో 745.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 169.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. కోస్తాంధ్ర జిల్లాలో 638.22 మి.మీ. గాను 142.5 మి.మీ. వర్షం కురిసింది. అదేవిధంగా దక్షిణ కోస్తాలో 531.2 మి.మీ. వర్షపాతం నమోదు కావలసి ఉండగా 115.2 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. భారీస్థాయిలో లోటు వర్షపాతం నమోదు కావడంతో ఆశించిన స్థాయిలో సాగు జరగకపోగా వేసిన పంటలు ఎండిపోతూ రైతాంగాన్ని తీవ్ర నిరాశ గురిచేస్తోంది. ఇదిలా ఉంటే వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ పంటలకు తెగుళ్లు సోకి పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల, పల్నాడు, వైఎస్సార్ కడప, మార్కాపురం జిల్లాలో సుమారు 1700 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. జూలై 8వ తేదీ నాటికి వ్యవసాయ శాఖ అందించిన వివరాల ప్రకారం గత సంవత్సరం 4.81 లక్షల హెక్టార్లలో సాగు జరిగితే ప్రస్తుతం ఖరీప్‌లో 6.18 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. గత సంవత్సరం కంటే 108 శాతం అధికంగా సాగు జరిగింది. ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉంటుందని పెద్ద ఎత్తున వాతావరణ శాఖ ప్రచారం నిర్వహిస్తున్నా సాగు పెరగటంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాని ప్రశ్న. ఎల్‌నినో ప్రభావం వల్ల కలిగే నష్టాలను రైతాంగానికి వివరించి సాగు తగ్గించడం ప్రత్యామ్నాయ పంట సాగు వైపు మళ్లించడంలో జిల్లాల స్థాయిలో అధికారులు విఫలమయ్యారంటూ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మరో వైపు ప్రభుత్వ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే రైతులు కొద్దిపాటి వర్షం పడిన వెంటనే విత్తనాలు విత్తి వర్షాలు కురవక పోతాయా నారు పోసిన వాడు నీరు పోయక పోతాడా అంటూ ఆశగా పంటల సాగుకు సిద్ధమవుతున్నారనీ కిందిస్థాయి వ్యవసాయ సిబ్బంది పేర్కొంటున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో 105 మండలాలు తీవ్రంగాను 208 మండలాలు మధ్య స్థాయిలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో కూడా వర్షాబావ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో సాధరణ స్థాయిలో 7 జిల్లాలు మరో 20 జిల్లాల్లో 20 శాతం నుండి 59 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం మరింతగా పెరగవచ్చునని వాతావరణ శాఖ భావిస్తున్న తరుణంలో వ్యవసాయ, వెంటర్నరీ, ఉద్యాన శాఖ యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం సమీక్షలతో కాలం వెళ్లబుచ్చకుండా రాబోయే కరువు తీవ్రతను ఎదుర్కొనేందుకు సత్వర చర్యలు ప్రారంభించాలి. ఎండిపోయిన ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటల నష్టాలను ఎన్యుమరేషన్ చేయాలి. పశువులకు తాగునీరు, దాణా సరఫరా చేయాలి. వర్షాభావం వల్ల పంటలు వేయలేకపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఎండు ముఖం పట్టిన పండ్ల తోటలను బతికించుకునేందుకు వీలుగా అవకాశం ఉన్న ప్రాంతాల నుండి నీటి సరఫరా చేసుకునేందుకు రవాణా చార్జీలు ఇచ్చి ప్రభుత్వం ట్యాంకర్ ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి. వర్షాభావ పరిస్థితిని తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు అవసరమైన విత్తనాలు అందించాలి. సాగు, తాగునీటి చెరువులకు నీటి సరఫరా చేయాలి. ప్రస్తుతం రైతాంగం పండించిన మామిడి, పొగాకు తదితర పంటల కొనుగోలుకు నిధులు కేటాయించాలి. ఖరీప్ సీజన్‌లో పంటల భీమా, వాతావరణ బీమా గడువును పెంచి భీమా రుసుం ప్రభుత్వమే భరించాలి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు ప్రతి ఎకరానికి 10 వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించాలి.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు