- డీఈవో విచారణకు అభ్యర్థి డుమ్మా
- విద్యాశాఖ నివేదికలో నివ్వెరపోయే నిజాలు
- డీఎస్‌సీ క్రీడా కోటా దందా…
- కర్నూలు జిల్లాలో మరో 24 పోస్టులపై అనుమానాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :డీఎస్‌సీ-2026 నియామకాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఆందోళనలకు సిద్ధమవుతున్న వేళ… కూటమి ప్రభుత్వం మాత్రం డీఎస్‌సీ నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేస్తోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరో అడుగు ముందుకేసి డీఎస్‌సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరిన విషయం విదితమే. తాజాగా కర్నూలు జిల్లా వల్లూరు ఎంపీపీఎస్ పాఠశాలలో వెలుగులోకి వచ్చిన ఒక ఎస్‌జీటీ నియామక వ్యవహారం ఇప్పుడు ఈ వాదనలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డీఎస్‌సీ క్రీడా కోటా కింద ఎస్‌టీటీగా ఎంపికయిన ఒక అభ్యర్థికి సంబంధిత టెట్ అర్హతలు లేవన్న విషయం విద్యాశాఖ అధికారుల ప్రాథమిక పరిశీలనలో నిర్ధారణ అయినట్లు సమాచారం. టెట్ అర్హత లేకపోయినా డీఎస్‌సీ క్రీడా కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగానికి ఎలా ఎంపికయ్యారు?, నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని అభ్యర్థికి నియామకం ఎలా సాధ్యమైంది? ఈ ప్రక్రియలో అధికారుల పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. డీఎస్‌సీ నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేదని, అంతా పారదర్శకంగానే జరిగిందని మంత్రి లోకేశ్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా వల్లూరు ఎస్‌జీటీని టెట్ లేకుండానే నియమించారని ప్రాథమిక విచారణలో తేలగా, ఇక చర్యలే తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే డీఎస్‌సీ అక్రమాలపై వచ్చిన కథనాల నేపథ్యంలో కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారులు విచారణకు ఆదేశించగా… ఈ వ్యవహారం బట్టబయలైనట్లు సమాచారం. టెట్ పేపర్-1(ఏ) లో అర్హత సాధించకుండానే ఒక అభ్యర్థి ఎస్‌జీటీ ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఎస్‌జీటీ పోస్టు పొందిన అభ్యర్థితో పాటు డీఎస్‌సీ క్రీడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో విధులు నిర్వహించిన అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ అభ్యర్థి సెలవు పెట్టి డీఈవో విచారణకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. డీఎస్‌సీ సమయంలో జీవో నంబర్ 47 ఆధారంగా డీఎస్‌సీ పరీక్ష లేకుండానే క్రీడా కోటాలో ఉన్న వారిని ఎంపిక చేయాలంటూ ప్రభుత్వం హడావుడీగా జీవో తీసుకురావడమే ఈ అక్రమాలకు కారణమైందన్న ఆరోపణలున్నాయి. క్రీడా కోటాలో ఉద్యోగం పొందాలంటే తగిన ప్రాథమిక విద్యార్హతలు కచ్చితంగా ఉండాలని, టెట్‌లో అర్హత సాధించాలని అదే 47 జీవోలో స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో క్రీడా కోటా కింద 64 మంది ఉద్యోగాలు సాధించగా… అందులో మరో 24 మంది వరకు కనీస విద్యార్హత అయిన టెట్ ఉత్తీర్ణత లేదా క్రీడలకు సంబంధించిన కనీస అర్హతలు లేవన్న వాదనలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల పోస్టులతో డీఎస్‌సీ ప్రకటించగా… అందులో 430 పోస్టులను క్రీడా కోటా కింద చేపట్టిన పోస్టులలో భారీ కుంభకోణం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
జిల్లాల వారీగా భర్తీలో అనుమానాలెన్నో !
క్రీడా కోటా పేరుతో జీవోలు మార్చి, డీఎస్‌సీ పరీక్ష లేకుండానే 382 పోస్టులను భర్తీ చేశారన్న ఆరోపణలున్నాయి. జిల్లాల వారీగా కేస్ స్టడీలను పరిశీలిస్తే అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగానికి టెట్ అర్హత తప్పనిసరి. డీఎస్‌సీ నోటిఫికేషన్లోనే ఓసీ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీ అభ్యర్థులకు 75 మార్కులు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 60 మార్కులు రావాలని స్పష్టంగా తెలుస్తోంది. ఆ నిబంధనలను పక్కనపెట్టి కర్నూలు జిల్లాలో టెట్ అర్హత లేని వారికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారన్నదీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కృష్ణా జిల్లాలో క్రీడా కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగం పొందిన ఒక అభ్యర్థికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే… డీఎస్‌సీ తుది జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి సర్టిఫికెట్లు, సెల్ఫ్ డిక్లరేషన్, టెట్ వివరాలు కనిపించడం లేదని సమాచారం. క్రీడా కోటాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయిన 160 మంది జాబితాలోనూ ఆ అభ్యర్థి పేరు లేదని తెలుస్తోంది. అలాంటి పరిస్థితిలో ఆయనకు ఉద్యోగం ఎలా వచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. చిత్తూరు జిల్లాలో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఓసీ అభ్యర్థికి టెట్‌లో 90 మార్కులు రావాల్సి ఉండగా… ఆ అభ్యర్థికి 79 మార్కులు మాత్రమే వచ్చినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం అర్హత లేని అభ్యర్థికి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం ఎలా ఇచ్చారన్నదీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డీఎస్‌సీ బాధిత అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఎస్‌జీటీ పోస్టుకు బీసీ అభ్యర్థికి టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా… 65 మార్కులే వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఎలా ఇచ్చారన్న ప్రశ్న తలెత్తుతోంది. టెట్‌లో అర్హత సాధించకపోతే టీచర్ ఉద్యోగానికి ఎలా అర్హత వచ్చిందన్న దానిపై విద్యాశాఖ అధికారులు విచారించి… సదరు అభ్యర్థికి అవసరమైన విద్యార్హతలు లేవని నిర్ధారించినట్లు సమాచారం. అదే కర్నూలు జిల్లాకు చెందిన మరో మహిళా అభ్యర్థి మాథమ్యాటిక్స్, సైన్స్ విభాగంలో టెట్ రాశారు. ఆ విభాగంలో ఆమె అర్హత సాధించినప్పటికీ… నిబంధనలకు అనుగుణంగా కాకుండా వేరే సబ్జెకుట్‌కు ఉద్యోగం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో బయలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయిన ఒక అభ్యర్థికి సంబంధించిన టెట్ వివరాలు కనిపించడం లేదని సమాచారం. ప్రభుత్వ వెరిఫికేషన్ వివరాల్లో టెట్ అర్హతకు సంబంధించిన ఆధారం లేకపోయినా… ఆ అభ్యర్థికి ఉద్యోగం ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. కడప జిల్లాలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయిన అభ్యర్థి వివరాలను పరిశీలిస్తే… టెట్ హాల్టికెట్ నంబర్ నమోదు చేయగా, దాని ప్రకారం టెట్ ఫలితాన్ని వెతికితే నో రిజల్ట్ ఫౌండ్ అని రావడంతో అనుమానాలు ఉన్నాయి. అయినప్పటికీ సదరు అభ్యర్థికి ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం ఎలా ఇచ్చారన్నదీ అధికారులు సమాధానం చెప్పాలి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళా అభ్యర్థి సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం పొందారు. ఆమె టెట్‌ను 11 సార్లు రాసినట్లు, ఆ పరీక్షలన్నీ భాషా విభాగాలకు సంబంధించినవేనని తెలిసింది. సోషల్ స్టడీస్‌పై టెట్ రాసినట్లు వివరాలు లేవని, అలాంటప్పుడు భాషా టెట్ రాసిన అభ్యర్థికి సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగమెలా ఎలా ఇచ్చారన్నదీ తేలాలి. తూర్పు గోదావరికి చెందిన మరో అభ్యర్థి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో బీఈడీ సర్టిఫికెట్ సమర్పించలేదని, ‘నాట్ క్వాలిఫైడ్’ అని ప్రభుత్వ అధికారి నమోదు చేసినట్లు సమాచారం. దానికి సంబంధించి తుది జాబితాలో ఆ అభ్యర్థికి తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చినట్లు సమాచారం. ప్రకాశం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన డీఎస్‌సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ డేటా కనిపించడం లేదని, ఆ వివరాలను తక్షణమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని డీఎస్‌సీ బాధిత అభ్యర్థులు కోరుతున్నారు. డీఎస్‌సీ నియామకాల్లో ఎలాంటి తప్పులు జరగలేదని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఎందుకు అందుబాటులో లేవని వారు ప్రశ్నిస్తున్నారు.


