ఆ మధ్యనే కదా…ఇతగాడి కవిత్వాన్ని భుజానకెత్తుకున్నాను. మళ్లీ మరోసారి ఇలా… వెంపర్లాడడమెందుకు… వేసారడమెందుకు. అతనిలో వెతుకులాటని బయటకు తీయాలనుకోవడమెందుకు. అతనొక్కడే నీకు కనిపించిన కవా… అతనిదే కవిత్వమా… ఇలా మాటిమాటికి కాగితంపై నీ ప్రేమను పంచుకోవడం అవసరమా. నువ్వు కాకపోతే మరొకరు రాస్తారుగా. నువ్వు కాకపోతే ఇంకొకరు అతని కవిత్వాన్ని మోస్తారుగా. నువ్వు కాకపోతే వేరొకరు చెబుతారుగా. నువ్వే రాయాలా. ఆ పసునూరి శ్రీధర్‌బాబు కొత్త కవిత్వ పొత్తం ఏకాంతం ఒక అతిథి చదివిన తర్వాత నా నుంచి నాకు ఎదురైన ప్రశ్నలు. వీటన్నింటికి నాకు నేను చెప్పుకున్న సమాధానం. నేనే రాయాలి. నేనే చెప్పాలి. నేనే అనుభవించి పలవరించానని ప్రకటించాలి. ఈ కవిత్వం నాకు నేను సంపాదించుకున్న స్వార్జితం. ఈ కవిత్వం నాకు నేను ముచ్చటపడిన వాక్యం. ఈ కవిత్వం నన్ను తన చుట్టూ తిప్పుకున్న మురిపెం. సముద్రం ముందు పదేపదే ఎందుకు నిలబడతాం. అలలు అలలుగా ఎగిసిపడాలనుకుంటాం. పూల ముందు…మేఘమాల కోసం… పచ్చి మట్టి వాసన కోసం… లే వరి కంకుల నుంచి వచ్చే లేలేత పాల కోసం ఎందుకు ఆశ పడతాం. అలాగే నేను ఈ పసునూరి శ్రీధర్‌బాబు కవిత్వం కోసం ఆరాటపడతాను. పడ్డాను. ఒకటా, రెండా….మూడున్నర దశాబ్దాల కవిత్వ ప్రయాణం మాది. ఎన్ని చదివాం. ఎంత వాదులాడుకున్నాం. ఎంత ఆనందపడ్డాం. ఎంత దుఃఖితులమయ్యాం. ఎంత వేదన చెందాం. ఆ పసునూరి శ్రీధర్‌బాబు రాసిన కవిత్వమే అయినా నుప్పుల నొప్పులన్నీ మావే కదా. అందుకే ఇలా మరోసారి రాసి ‘‘శ్రీధర్ మామా… నీ కవిత్వం సెలయేరురా నాయనా… నీ కవిత్వం జడ గంటల సవ్వడిరా… నీ కవిత్వం మంచు బిందువుని ఆహ్వానించిన లే మామిడి ఆకురా’’ అని చెప్పాలనిపించింది. చదువుకుంటున్నామంటూ విప్లవ నినాదాలమైనప్పుడే ఆ పేరు పరిచయం. కాకపోతే అది శ్రీకాకుళ ఘర్జనను వినిపించిన రాయలసీమ శ్రీరాములయ్య పేరు. మనసులో ముద్రించుకుపోయింది. ఆ పేరే ఈ శ్రీధర్‌బాబు తండ్రి శ్రీరాములు. ప్రాంతం వేరైనా ఆకలి, కవిత్వం వేరు కాదు కదా…! చిరుద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్న సమయంలో ఈ శ్రీధర్‌బాబు బాపు శ్రీరాములుతోనూ కలిసి నడిచాం. అందుకేనేమో ఆ బాపు గురించి రాసిన ఈ వాక్యాలు…
‘‘నువ్వు / వెళ్తూ వెళ్తూ / నీ లోపలి గది / తాళాలు ఇచ్చి వెళ్లావు / అప్పటి నుంచి / నేను అపరాధిలా అల్లాడుతున్నాను’’ నన్నూ అపరాధిని చేశాయి. ఓ చోట రాశాను…వెళ్లిపోవడమంటే మిగిలిపోవడమే అని. అలా శ్రీరాములు బిడ్డ శ్రీధర్‌బాబు కవిత్వంలో మిగిలిపోయారు. బహుశా చాలామంది తండ్రులు ఇలాగే మిగిలిపోయారేమో. ఈ పద్యంలోనే ఇలా కూడా అంటాడు శ్రీధర్ బాబు.
‘‘నువ్వు వెళ్లిపోయిన తర్వాత / నువ్వు లేని ప్రపంచం నుంచి / బయటకు చూస్తున్నానేమో / నీ ప్రపంచం నన్ను నిలువునా ఆవరిస్తోంది’’ ఇదీ అసలుసిసలు నాన్నకు ప్రేమతో కవిత్వం రాయడమంటే. కొందరు తండ్రులంతే వాళ్లు వెళ్లిపోయిన తర్వాత బయట ప్రపంచాన్ని మనకు అప్పగించి వెళ్లిపోతారు. మనం ఆ ప్రపంచంలో ఈద లేక, నాన్న చిటికెన వేలు కానరాక ఇలా ఒంటరిగా మిగిలిపోతామేమో…! సాహిత్యానికి…ముఖ్యంగా కవిత్వానికీ… వయసుకి ఓ లంగరుంటుంది. ఇరవై ఏళ్లలోపు రాసిన కవిత్వంపై మక్కువ ఉంటుంది. ఏమీ తెలియకుండా ఏదైనా రాసేయగలమనే థీమా ఉంటుంది. వయసు మీద పడుతున్న కొద్దీ ఆ తెరలు, భ్రమలు తొలగిపోతాయి. ఒక్కోసారి మనం రాసిన కుర్ర కవిత్వం చదువుకుంటే మక్కువ పోయి ముక్కున వేలేసుకుంటాం సంకల్పితంగానే. ఇదే కవిత్వంలో ఉండే మజా. శ్రీధర్‌బాబు కూడా దీనికి అతీతుడేం కాదు. అందుకే ఏభై వయసొచ్చాక రాసిన తన కవిత్వం గురించి ఇలా చెప్పాడు… 50 తర్వాత అనే కవితలో …‘‘రాయాల్సింది చాలా ఉందని / ఇన్నేళ్లు రాసిందంతా / అక్కడికి చేరుకోవడానికి / చేసుకున్న బాటేనని తెలుస్తుంది / యాభై ఏళ్ల తర్వాత’’ ఇదీ వయసొచ్చాక అలవరచుకోవాల్సిన తాత్వికత అంటున్నాడు శ్రీధర్‌బాబు. కవి చుట్టూ ఏదో దిగులు వెంటాడుతూంటేనే ఇలాంటి కవిత్వం వస్తుంది అనిపిస్తుంది. ఆ దిగులుకి అనేకానేక కారణాలుండచ్చు. ఆ కారణాల నుంచే…‘‘ఈ బాటలో ఎందరెందరినో నడిపించి / బాధించి ఉంటానా / క్షమించమని కోరాలని ఓ పరిణితి / యాభై తర్వాత ‘‘ అంటూ తాను రాసిన కవిత్వం గురించి సంజాయిషీ కూడా ఇచ్చుకున్నాడు ఈ ఆధునికానంతర కవి. ఇంచుమించు చలం కూడా ఇలాగే చెప్పుకున్నాడు తన మలి వయసులో. ‘‘ఈ ఎడం భుజమ్మీదకు / ముఖ్యంగా అర్థరాత్రికి కాస్త అటూ ఇటూ / జల జలా పైకి వచ్చి / జివ్వున తిరుగుతూంటాయి’’ అంటున్నాడు తన పునరపి గురించి. ఇదే గాయాన్ని గేయం చేయడమంటే. కవిత్వ రహస్యం తెలిసిన వారే ఇలా రాయగలరు. శ్రీధర్‌బాబు అదే పని చేశాడు. అచ్చమైన కవి కదా. ఇలాగే చేస్తాడు. నిజమైన కవులు ఇలాగే చేయాలంటున్నాడు తన కొత్త కవిత్వ సంకలనం ఏకాంతం ఒక అతిథిలో. ఈ కవిత్వం చదివితే శుద్ధ కవిత్వం చదివిన తర్వాత వచ్చే అనుభూతి మిగులుతుంది. మంచి కవిత్వం చదవాలనిపిస్తుంది. వినాలనిస్తుంది. ముఖ్యంగా కొన్నేళ్లు బతకాలనిపిస్తుంది.
సీనియర్ జర్నలిస్టు, 99120 19929
ఏకాంత వేళల్లోసామూహిక వేదన ఈ కవిత్వం
- Advertisement -


