Wednesday, February 18, 2026
Homeవిశ్లేషణఐక్య ప్రతిఘటన అవశ్యం

ఐక్య ప్రతిఘటన అవశ్యం

- Advertisement -

డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి

సిపిఐ రెండవ శతాబ్దంలోకి అడుగుపెడుతున్న సమయంలో భారతదేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. మతతత్వం, పెరుగుతున్న ఫాసిజం గణతంత్ర పునాదులకు ముప్పుగా మారాయి. ఆర్థికాభివృద్ధికి తీవ్రనిరుద్యోగం, అనిశ్చితి, విస్తృతమవుతున్న అసమానతలు తోడయ్యాయి. మన ముందున్న కర్తవ్యం స్పష్టంగా ఉంది. వ్యవస్థల్లో క్షీణప్రభావాన్ని ప్రక్షాళన చేయడం, గణతంత్రాన్ని తిరిగి సాధించడం, సమానత్వం, లౌకికవాదం, న్యాయం పునాదులపై భారతదేశాన్ని పునర్నిర్మించడం.
2025 డిసెంబర్‌ 26వ తేదీన భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (సిపిఐ) 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శతాబ్ది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇది భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి రూపాన్నిచ్చిన ఒక ఉధృత ఉద్యమం, దేశభవిష్యత్తు కోసం ముందుచూపును, సామాజిక, ఆర్థిక దార్శనికతను ప్రతిబింబించే చారిత్రక ఘట్టం. తన తొలినాళ్ళలోనే చారిత్రక కాన్పూర్‌ సమావేశానికి ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడుగా ఉన్న మౌలానా హస్రత్‌ మోహని రూపొందించిన ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అనే విప్లవ నినాదానికి సిపిఐ గొంతును అందించింది. ఆ నినాదాన్ని భగత్‌ సింగ్‌, ఆయన సహచరులు అమరత్వాన్ని అందించారు. కమ్యూనిస్టు కార్యకర్తల ద్వారా, విప్లవాత్మక పరివర్తన కోసం ఈ నినాదం దేశంలోని ప్రతి మూలకు పయనించి, ప్రతిఘటన, ఆశ, దేశభక్తికి సజీవ వ్యక్తీకరణగా మారింది. వలస పాలనతో సంఘర్షిస్తూ సిపిఐ ఆవిర్భవించింది. జాతీయ ఉద్యమం ఎదుర్కొంటున్న ఎవరికి, ఎందుకు కోసం స్వాతంత్య్రం అనే ప్రాథమిక ప్రశ్నకు సమాధానం కోసం ప్రయత్నించింది. సామాజిక, ఆర్థిక పరివర్తన లేకుండా రాజకీయ స్వాతంత్య్రం ప్రజలను పాత, కొత్త రూపాల్లో దొపిడీలో చిక్కుకుపోయేలా చేస్తుందని సిపిఐ శతాబ్దకాలంగా నిరంతరం వాదిస్తున్నది. వలసవాద పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సిపిఐ చేసిన రాజీలేని పోరాటంలో దాని చారిత్రక మూలాలు ఉన్నాయి. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం భారతదేశ ఆర్థిక వ్యవస్థను విదేశీ మూలధన పెట్టుబడి అవసరాలకు కట్టబెట్టి, స్వదేశీ పరిశ్రమలను నాశనం చేసింది. దోపిడీ భూ-సంబంధాలను మోపింది. పేదరికాన్ని విస్తరించింది. అదే సమయంలో అది ఆధునిక కార్మికవర్గాన్ని సృష్టించి, భారతీయ విప్లవకారులను ప్రత్యేకించి 1917 రష్యన్‌ విప్లవం తర్వాత ప్రపంచ సోషలిస్ట్‌ ఆలోచనల స్రవంతులకు చేరువయ్యేలా చేసింది. విదేశాలలో మార్క్సిజంకు దగ్గరైన లేదా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల ద్వారా సన్నిహితమైన భారతీయ కార్యకర్తలు, విప్లవకారులు జాతీయ విముక్తి, సామాజిక చైతన్యం విడదీయరానివని గ్రహించడం ప్రారంభించారు. ఈ అవగాహనే 1925 డిసెంబర్‌లో కాన్పూర్‌లో సిపిఐని స్థాపించే విధంగా సంస్థాగత రూపంలోకి పరిణతి చెందింది.
మార్క్సిస్టు సిద్ధాంతం, భారతీయ వాస్తవాలు :
మార్క్సిస్టు సిద్ధాంతం, భారతీయ వాస్తవికతల మూలాలు కలిగిన విప్లవాత్మక పార్టీని నిర్మించడానికి కట్టుబడి ఉన్న విప్లవకారులు, కార్మిక సంఘాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యకర్తలను కాన్పూర్‌ సమావేశం ఒకచోటకు చేర్చింది. వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో సిపిఐ పాత్ర రాజీలేనిది, అత్యంత దేశభక్తితో కూడుకున్నది. సామ్రాజ్యవాద శక్తితో సర్దుబాటు కోరుకునే జాతీయవాద సమూహాల మాదిరిగా కాకుండా, కమ్యూనిస్టులు వలసవాదాన్ని రాజకీయ ఆధిపత్యం ద్వారా ఆర్థిక దోపిడీని కొనసాగించే వ్యవస్థగా అర్థం చేసుకున్నారు. వారు ట్రేడ్‌ యూనియన్‌ పోరాటాలు, రైతు ఉద్యమాలు, అజ్ఞాత జీవితం నుంచి ప్రతిఘటన, సైద్ధాంతిక పోరాటాల రూపాలలో బ్రిటిష్‌ పాలనపై పోరాడారు. వారి దేశభక్తి ఉన్నత వర్గాల చర్చలలో కాకుండా, సామాన్య భారతీయుల జీవితాలు, పోరాటాలలో పాతుకుపోయింది. సిపిఐ అత్యంత ముఖ్యమైన ఘనతలో ఒకటి ప్రజాసంఘాల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వడం. సమాజాన్ని దానిలోని వైవిధ్యాలతో సమీకరించకుండా రాజకీయ విముక్తి సాధించలేమని పార్టీ గుర్తించింది. ఇది ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎఐటియుసి), ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌), ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(ఎఐఎస్‌ఎఫ్‌), ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ (పిడబ్లుఎ), ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ (ఇప్టా) వంటి సాంస్కృతిక, రచయితల సంస్థలు లేదా అనంతర కాలంలో మహిళలు, యువజన సంఘాలు వంటి వేదికలను నిర్మించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడిరది. ఈ పొందికల ద్వారా కార్మికులను, రైతులను, విద్యార్థులను, మేధావులను, కళాకారులను సిపిఐ ఉమ్మడి పోరాటాల చుట్టూ ఏకం చేసింది.
ప్రజాపోరాటాల ద్వారానే కమ్యూనిస్టు రాజకీయాలు లోతైన మూలాలను కలిగి ఉన్నాయి. భూమి, ఆత్మగౌరవం కోసం జరిగిన చారిత్రక పోరాటాలకు సిపిఐ నాయకత్వం వహించింది. భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం, బెంగాల్‌లో రైతులకు తమ ఉత్పత్తులపై హక్కులను దఖలుపరిచిన తెభాగ ఉద్యమం, భూస్వామ్య నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కేరళలో పున్నప్రవయలార్‌ పోరాటం, తంజావూర్‌ డెల్టా, మిలిటెంట్‌ భూపోరాటాలు ఉన్నాయి. అలాగే కాన్పూర్‌, బొంబాయి, కలకత్తా, పుదుచ్చేరి వంటి పారిశ్రామిక కేంద్రాలలో, కమ్యూనిస్టు నాయకత్వంలో ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం కార్మికుల హక్కులు, వేతనాలు, గౌరవాన్ని కాపాడుతూ ప్రధాన కార్మిక విజయాలను సాధించింది. సిపిఐ జాతీయ పోరాట ఎజెండాను నిర్ణయాత్మకంగా సమూలంగా మార్చింది. రాజీమార్గంగా అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్‌ స్టేటస్‌) గురించి చర్చించబడుతున్న సమయంలో, కమ్యూనిస్టులు సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పట్టుబట్టారు. రాజ్యాంగ పరిషత్తు కోసం తొలినాళ్ళలోనే, అత్యంత స్థిరంగా డిమాండ్‌ చేసిన వారిలో వారు ఉన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన సర్వసత్తాక సంస్థ మాత్రమే ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించ గలదని వాదించారు. ఈ డిమాండ్‌ తరువాత భారతదేశం స్వాతంత్య్రం కోసం పరివర్తన చెందడానికి మూలంగా మారింది. భూ-సంస్కరణలు, కార్మిక హక్కులు, సామాజిక సమానత్వం లేని స్వాతంత్య్రం కేవలం విదేశీ పాలకులను స్వదేశీ ఉన్నత వర్గాలతో భర్తీ చేస్తుందని వాదిస్తూ, పార్టీ స్వాతంత్య్ర పోరాటానికి కేంద్రంగా నిర్మాణాత్మక సంస్కరణలను ఉంచింది. కమ్యూనిస్ట్టు నేతృత్వంలోని ఉద్యమాల ద్వారానే భూమి పున:పంపిణీ, భూస్వామ్య వ్యవస్థ రద్దు, కౌలుదారుల రక్షణ, ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు, కనీస వేతనాలు, సామాజిక భద్రతలను జాతీయ ఎజెండాలోకి ప్రవేశపెట్టారు. కులాన్ని సాంస్కృతిక అవశేషంగా కాకుండా వర్గ దోపిడీతో లోతుగా ముడిపడి ఉన్న భౌతిక వ్యవస్థగా గుర్తించి, సిపిఐ వర్గరహిత, కులరహిత ప్రపంచం దృక్పథాన్ని స్పష్టంగా వ్యక్తీకరించింది. కుల అణిచివేతను ఆర్థిక వ్యవస్థలకు అనుసంధానించడం ద్వారా పార్టీ సామాజిక న్యాయం అనే అర్థాన్ని విస్తృతం చేసి, స్వాతంత్య్ర పోరాటానికి పరివర్తన కలిగించే సారాంశాన్ని అందించింది. ఈ డిమాండ్‌లలో చాలా వరకు రాజ్యాంగంలో, స్వాతంత్య్రానంతర విధానపరమైన చర్చల్లో ప్రతిబింబించాయి. 1947లో స్వాతంత్య్రం సిపిఐ పోరాటాన్ని ముగించలేదు. భూస్వామ్య వ్యవస్థలను కూల్చేయడం, గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానాన్ని నిరోధించడం, ప్రజాస్వామ్యాన్ని వేళ్ళూనుకునేలా చేయడంపై దృష్టి సారించిన కొత్త దశకు ఇది నాంది పలికింది. భూస్వామ్య వ్యతిరేకంగా చారిత్రాత్మక రైతు పోరాటాలకు పార్టీ నేతృత్వం వహించింది. అలాగే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, బిహార్‌ వంటి రాష్ట్రాలలో భూ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. పార్లమెంటరీ, పార్లమెంటేతర రంగాలలో, సిపిఐ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలలో ప్రభుత్వ ఆధిపత్యాన్ని ఛాంపియన్‌ చేసింది. బ్యాంకులు, బొగ్గు, బీమా, ఇతర కీలక పరిశ్రమల జాతీయీకరణను నిరంతరం సమర్థించింది. వ్యూహాత్మక వనరులు అనేవి జాతీయ అభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం ఉపయోగపడాలే తప్ప ప్రైవేట్‌ సముపార్జన కోసం కాదని సిపిఐ ఎల్లప్పుడు వాదించింది.
సమాఖ్యవాద పరిరక్షణ : భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు సమాఖ్యవాదం, భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని సిపిఐ గట్టిగా సమర్థిస్తుంది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళల హక్కులను కాపాడటంలో, అలాగే లౌకికవాదం , హేతుబద్ధమైన ఆలోచనలకు దృఢంగా కట్టుబడి ఉండటంలో సామాజిక న్యాయం పట్ల సిపిఐ నిబద్ధత వ్యక్తమవుతుంది. దశాబ్దాలుగా, సంస్కరణ, పురోగతి కోసం, ప్రతీఘాత శక్తులపై ప్రతిఘటనకు ఎర్రజెండా సంకేతంగా నిలిచింది. ఇవాళ సిపిఐ తన రెండవ శతాబ్దంలోకి అడుగుపెడుతున్న సమయంలో భారతదేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. మతతత్వం, పెరుగుతున్న ఫాసిజం గణతంత్ర పునాదులకు ముప్పుగా మారాయి. ఆర్థికాభివృద్ధికి తీవ్ర నిరుద్యోగం, అనిశ్చితి, విస్తృతమవుతున్న అసమానతలు తోడయ్యాయి.
వామపక్షాల ముందున్న సవాలు :
మరోసారి ప్రజల ఆకాంక్షలకు పర్యాయపదంగా మారడమే వామపక్షాల ముందున్న సవాలు. దీనికి సమానత్వం, ప్రజాస్వామ్యం, న్యాయం అనే తన ప్రధాన విలువలను గట్టిగా కొనసాగిస్తూనే, సమకాలీన పెట్టుబడిదారీ విధానం పట్ల దాని అవగాహనను పునరుద్ధరించడం అవసరం. మన చరిత్రలోని ఈ కీలక సమయంలో సిపిఐ శతాబ్ది కేవలం గుర్తుంచుకునే క్షణం మాత్రమే కాదు, ఇది కార్యాచరణకు పిలుపు. ప్రజాస్వామ్యం దాడికి గురవుతోంది. ప్రజల హక్కులు, జీవనోపాధి క్రమంగా క్షీణిస్తున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమం సాధించిన విజయాలు ఉద్దేశపూర్వకంగా రద్దు చేయబడుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి కలయిక మన సామాజిక సంఫీుభావాన్ని కూల్చివేసి, మన ఆర్థిక సార్వభౌమత్వాన్ని డొల్ల చేసి, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం ద్వారా నిరంకుశత్వాన్ని, కొన్ని విభాగాలను వెలివేసే వ్యవస్థను విధించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రమాదాన్ని విడివిడిగా నిరోధించలేము. సిపిఐ, వామపక్షాలను బలోపేతం చేసి, మరింత చేరువై విస్తృత ప్రజాస్వామ్య ప్రతిఘటనగా ఆవిర్భవించాలి. బలమైన నిర్మాణాలుగా కొనసాగుతున్న వర్గ దోపిడీ, కుల అణచివేత, పితృస్వామ్య వ్యవస్థలపై సంఘటిత, రాజీలేని పోరాటాలు అవసరం. మన ముందున్న కర్తవ్యం స్పష్టంగా ఉంది. వ్యవస్థల్లో క్షీణ ప్రభావాన్ని ప్రక్షాళన చేయడం, గణతంత్రాన్ని తిరిగి సాధించడం, సమానత్వం, లౌకికవాదం, న్యాయం పునాదులపై భారతదేశాన్ని పునర్నిర్మించడం. ఐక్యంగా మనం ప్రతిఘటించాలి. ఐక్యంగా మనం ముందుకు సాగాలి. ఐక్యంగా మనం సమానత్వంతో కూడిన, ప్రజాస్వామ్యబద్ధ, సుసంపన్నమైన ఒక నూతన భారతదేశాన్ని సృష్టించాలి. ఎర్రజెండా మరింత ఎత్తుకు ఎగరాలి. ప్రజలు విజయం సాధించాలి. భవిష్యత్తు మనదే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు