గజా పునర్నిర్మాణం కోసం శాంతి మండలి ఏర్పాటుచేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అయితే శాంతి మండలి ఏర్పాటు కేవలం గజా పునర్నిర్మాణానికి పరిమితం కాబోదు. ఈ శాంతి మండలిలో ఇప్పటికే 25దేశాలు చేరిపోయాయి. ఈ శాంతి మండలి ముఖ్యోద్దేశం వివిధ దేశాల మధ్య ఘర్షణల నివారణ అని ట్రంప్ చెప్తున్న విషయం పూర్తిగా డొల్ల అని ఈ మండలిలో చేరిన దేశాల జాబితాయే రుజువు చేస్తోంది. ఏ ఘర్షణను నివారించాలన్నా అందులో రెండు పక్షాల పాత్ర ఉండాలి. కానీ ఈ మండలిలో ఇజ్రాయిల్ చేరింది. కానీ గజా నుంచి ప్రాతినిధ్యమే లేదు. పలస్తీనా ఊసే లేదు. మరి పలస్తీనా భాగస్వామ్యం లేకుండా ఘర్షణ ఎలా నివారిస్తారు. పలస్తీనా పాత్ర లేకపోవడం అంటే తీవ్రవాద దేశమైన ఇజ్రాయిల్ అఘాయిత్యాలను ప్రోత్సహించడమేగా ! రష్యా, ఉక్రేన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. కానీ ట్రంప్ ఏర్పాటుచేస్తున్న శాంతి మండలిలో ఈ రెండు దేశాలు చేరనే లేదు. గత 16వ తేదీన ట్రంప్ ఈ మండలి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా ఘర్షణలు ఏ మేరకు నివారిస్తారో ట్రంప్ వ్యవహార సరళి చూస్తేనే తేలిపోతోంది. ఆ మాటకొస్తే ట్రంప్‌తో పాటు అమెరికా అధ్యక్షులుగా పని చేసిన అనేకమంది వివిధ దేశాల మధ్య తంపులు పెట్టి తమాషా చూశారు. హాయిగా ఆయుధాలు అమ్ముకున్నారు. ఇప్పటికీ పరస్పరం ఘర్షణ పడ్తున్న రెండు పక్షాలకు ఆయుధాలు అమ్ముకుంటూనే ఉన్నారు. పోట్లాడే వారికి ఆయుధాలు అందించడం, గాయపడ్డ వారికి మందులు అమ్ముకోవడం ఎప్పటి నుంచో అమెరికా తంతుగా ఉంది. గజా పునర్నిర్మాణం కోసమే ఈ శాంతి మండలి అని ట్రంప్ ఊదరగొడ్తున్నారు తప్ప అంతిమంగా ప్రకటించిన లక్ష్యాలలో గజా ప్రస్తావనే లేదు. సుస్థిరతను పెంపొందించడం, నమ్మదగిన, చట్టబద్ధమైన పరిపాలన కొనసాగేట్టు చూడడం, ఘర్షణలు కొనసాగుతున్న ప్రాంతాలలో శాంతి నెలకొనేట్టు చేయడం తాను ఏర్పాటుచేస్తున్న శాంతి మండలి ప్రధానోద్దేశం అని ట్రంప్ నమ్మబలుకుతున్నారు. ప్రపంచ శాంతిని కాపాడడానికి, ఘర్షణలు నివారించడానికి ఉపకరించవలసిన అంతర్జాతీయ వ్యవస్థలు విఫలమైనందువల్ల శాంతి మండలి అనే కొత్త వ్యవస్థ అవసరం తలెత్తిందని ట్రంప్ అంటున్నారు. విఫలమైన అంతర్జాతీయ వ్యవస్థలు అన్న మాట ఆయన ఐక్య రాజ్యసమితిని ఉద్దేశించే అన్నారని అర్థం అవుతూనే ఉంది. అంటే ట్రంప్ ప్రతిపాదిస్తున్న శాంతి మండలి ప్రపంచంలో అత్యధిక దేశాలకు సభ్యత్వం ఉన్న ఐక్యరాజ్య సమితికన్నా గొప్పదనుకోవాలి. ఐక్యరాజ్య సమితి వైఫల్యాలు వాస్తవమే. అయితే ఆ వైఫల్యాలకు కారణం అమెరికా, దాని మోచేతి నీళ్ల మీద ఆధారపడి బతుకుతున్న దేశాలేగా ! ట్రంప్ ఏర్పాటు చేస్తానంటున్న శాంతి మండలి వ్యవస్థా రూపాన్ని గమనిస్తే సర్వాధికారాలు ఈ మండలి దగ్గర కాకుండా ట్రంప్ చేతిలో ఉంటాయి. ఈ మండలికి ట్రంపే అధ్యక్షులుగా ఉంటారు. ఆయన ఎంత కాలం ఈ పదవిలో ఉంటారో తెలియదు. బహుశ జీవితాంతం శాంతి మండలికి అధిపతిగా ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నట్టుంది. ఈ వ్యవస్థ లక్ష్య నిర్దేశ పత్రం ప్రకారం వీటో అధికారంతో పాటు సర్వాధికారాలు అధ్యక్ష స్థానంలో ఉన్న వారికే ఉంటాయి. ప్రస్తుతానికి ట్రంపే సర్వాధికారి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానం 2027 దాకా అమలులో ఉంటుంది. దానికే అతీగతి లేదు. మన దేశానికీ ఈ శాంతి మండలిలో చేరాలని ఆహ్వానం వచ్చింది. కానీ దానికి ఇచ్చిన గడువు చాలా తక్కువ. ఆ గడువు ఒక రకంగా గురువారంతో తీరిపోయినట్టే. ఘర్షణలు నిలిపి వేయించడానికి పని చేస్తుందంటున్న ఈ శాంతి మండలిలో మన దేశం చేరితే మొదటికే మోసం రావడం ఖాయం. ఈ వ్యవస్థలో ఇప్పటికే పాకిస్థాన్ చేరిపోయింది. ఈ వ్యవస్థకు ఘర్షణలు నివారించే అధికారం ఇవ్వడం అంటే కశ్మీర్ విషయంలో భారత పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న ఘర్షణలను పరిష్కరించే అధికారం కూడా ఈ శాంతి మండలికి, నిజానికి ట్రంప్‌కు ఇచ్చినట్టే. ప్రపంచంలో అనేక ఘర్షణలు ఉండొచ్చు. కానీ ఈ ఘర్షణలను నివారించడానికి ఘర్షణ పడ్తున్న రెండు పక్షాలు కాక మూడో పక్షం కలగజేసుకోవడానికి అవకాశం ఇవ్వడం వినాశనానికే దారితీస్తుంది. దేశ విభజన వెంటనే పాకిస్థాన్ పనిగట్టుకుని కశ్మీర్ వ్యవహారాన్ని వివాదాస్పదం చేసింది. చివరకు 1971లో కుదిరిన సిమ్లా ఒప్పందం తరవాత కశ్మీర్ వివాదం భారత పాకిస్థాన్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్యేనని, ద్వైపాక్షిక సంప్రదింపుల వల్లే పరిష్కరించుకుంటామన్న స్పష్టమైన వైఖరి మన దేశానికి ఉంది. ఇప్పటిదాకా మనం అదే మాట మీద ఉన్నాం. కానీ పాకిస్థాన్ మాత్రం అనేక అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ సిమ్లా ఒప్పందాన్ని కాలరాస్తోంది. కశ్మీర్ సమస్య అంతర్జాతీయ సమస్య కాదని మనం ఎప్పటినుంచో చెప్తున్నాం. శాంతి మండలి ఏర్పాటు గురించి ట్రంప్ మొదట ప్రస్తావించినప్పుడు అందులో గజా వ్యవహారం మాత్రమే ఉంది. ఇప్పుడు సకల ఘర్షణలు శాంతి మండలి కిందకు వచ్చే సూచనలున్నాయి. ఈ వ్యవస్థలో భారత్ చేరడమంటే ద్వైపాక్షికమైన కశ్మీర్ వ్యవహారాన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చేయడానికి మనం అంగీకరించినట్టే. ఇది ఆత్మహత్యా సదృశం అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఘర్షణ చెలరేగినా, యుద్ధం జరిగినా అందులో అమెరికా పాత్ర కచ్చితంగా ఉంటుంది. దీనివల్ల అమెరికా ఆయుధ వ్యాపారం జోరుగా సాగుతుంది. కశ్మీర్ విషయంలో తలదూర్చడానికి అవకాశం ఇస్తే ట్రంప్ ఒక్క దెబ్బతో భారత పాకిస్థాన్ అనే రెండు పిట్టలను కొట్టడానికి అవకాశం ఇవ్వడమే. రష్యా, ఉక్రేన్ మధ్య చాలాకాలంగా యుద్ధం కొనసాగుతూ ఉంటే ఐక్యరాజ్య సమితి చేసింది ఏమీ లేదు. అమెరికా అయితే నిర్మొహమాటంగా ఉక్రేన్‌కు సకలవిధ సహాయమూ అందించింది. ఇజ్రాయిల్ అక్రమంగా పలస్తీనియన్ల మీద దాడి చేసి సర్వనాశనం చేసినప్పుడు అమెరికా ఇజ్రాయిల్ పక్షాననే ఉంది. మారణహోమాన్ని అంగీకరించిన, మరీ మాట్లాడితే ప్రోత్సహించిన అమెరికా ఘర్షణలు నివారిస్తుందంటే నమ్మడం సాధ్యం కాదు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవడానికి ట్రంప్ ఎలా కాలు దువ్వుతున్నారో చూస్తూనే ఉన్నాం. మన విదేశాంగ విధానం మోదీ హయాంలో ఎందుకూ కొరగాకుండా తయారై ఉండొచ్చు. సుదీర్ఘకాలం మనం వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి, అలీన విధానానికి కట్టుబడి ఉన్నాం. అందుకని శాంతి మండలిలో చేరకపోవడమే మంచిది. చిరకాలంగా మనం పలస్తీనియన్ల పక్షాన ఉన్నామని మోదీ మరిచిపోయి ఉండొచ్చు. కర్కశ ఖడ్గానికి కరుణ ఉంటుందనుకోలేం గదా !


