బెంగుళూరు : గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి కీలక పరీక్షను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను పూర్తిగా అభివృద్ధి చేసిన ఇస్రో… క్వాలిఫికేషన్ టెస్ట్ ప్రోగ్రామ్ ద్వారా సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను సమగ్రంగా పరీక్షించింది. ఎస్‌ఎంపీఎస్‌కు చెందిన 350 సెకన్ల ఫుల్ డ్యూరేషన్ హాట్ టెస్ట్‌ను శుక్రవారం పూర్తి చేశారు. గగన్‌యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. హాట్ టెస్ట్ సమయంలో ప్రొపల్షన్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ సాధారణంగా సాగిందని ఇస్రో శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గగన్‌యాన్‌కు చెందిన సర్వీస్ మాడ్యూల్‌ను ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా రెగ్యులేట్ చేస్తారు. కక్ష్యలో పరిభ్రమణ దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్బిట్ సర్క్యులేషన్, ఆన్ ఆర్బిట్ కంట్రోల్, డీబూస్ట్ మాన్యువరింగ్ లాంటి ప్రక్రియలన్నీ సర్వీస్ మాడ్యూల్ చూసుకుంటుంది. ఆర్బిట్ సర్క్యులేషన్, డీబూస్ట్ దశల్లో లిక్విడ్ అపోజీ మోటార్ ఇంజిన్లు శక్తిని ఇస్తాయి. ఇక ఆల్టిట్యూడ్ కంట్రోల్‌ను రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ త్రస్టర్స్ చూసుకుంటాయి. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్… గగన్‌యాన్ ఎస్‌ఎంపీఎస్‌ను డిజైన్ చేసి, డెవలప్ చేసినట్లు ఇస్రో చెప్పింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో పరీక్షలు జరిగాయి.


