మంగళవారం పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, ఆ స్థానంలోకి వచ్చిన బీఆర్ గవాయ్ ఒకే భాష మాట్లాడడం, ఒకే లక్ష్యాన్ని ప్రకటించడం న్యాయవ్యవస్థ ఇప్పటికీ ఎంతోకొంత పదిలంగా ఉందనడానికి నిదర్శనం. ఈ ఇద్దరి మాటలు ప్రజాస్వామ్యంపై నమ్మకం సడలకుండా చేస్తాయి. బుధవారం 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ గవాయ్ ఆ పదవిలోకి రాకముందే పదవీ విరమణ తరవాత ఏ ప్రభుత్వ పదవినీ స్వీకరించబోనని చెప్పారు. న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా వీడ్కోలు సభలో ఇదే మాట చెప్పారు. గత పదకొండేళ్ల కాలంలో న్యాయవ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవడానికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పాల్పడ్డ ఆగడాలను చూసిన తరవాత ఈ ఇద్దరు న్యాయమూర్తుల మాటలు కొత్త గాలి పీల్చుకున్నట్టుంది. పదవీ విరమణానంతరం ప్రభుత్వం కట్టబెట్టే పదవుల మీద ఆశతో న్యాయం మెడలు వంచడం, ఆ క్రమంలో పాలకపక్ష పల్లకీకి బోయీలుగా మార్చిన ప్రధాన న్యాయమూర్తులే ఎక్కువ. రంజన్ గొగోయ్‌తో ఈ వినాశకర పద్ధతి మొదలైంది. రెండేళ్లపై చిలుకు కాలం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించే అవకాశం వచ్చిన డీవై చంద్రచూడ్ ఉదారవాదిగా, కొన్ని సందర్భాలలో ప్రగతిశీల భావాలు ఉన్న వారిగా కనిపించినప్పటికీ మోదీ ప్రభుత్వం విషయం దగ్గరకు వచ్చే సరికి జోహుకుం దారుగా మిగిలిపోయారు. చంద్రచూడ్ అసలు ఆ పదవికి అర్హుడే కాదనేంత దాకా విమర్శలు ఎదుర్కొన్నారు. మంగళవారం పదవీ విరమణ చేసిన సంజీవ ఖన్నా, బుధవారం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ మధ్య మరో పోలిక కూడా ఉంది. ఇద్దరూ దాదాపు ఆరు నెలలు మాత్రమే ప్రధాన న్యాయమూర్తులుగా ఉండడం. సంజీవ్ ఖన్నా న్యాయవ్యవస్థలో దాపరికం లేకుండా చూడడానికి కృషి చేశారు. కొన్ని సందర్భాలలో న్యాయమూర్తి ఖన్నా మౌనంగా ఉన్నట్టు కనిపించినా అది ఆయన బలహీనత మాత్రం కాదు. వక్ఫ్ కేసులో సుప్రీం తీర్పును బీజేపీ ఎంపీ నిశికాత్ దూబే చులకన చేసి మాట్లాడినప్పుడు, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై అత్యున్నత న్యాయస్థానం చట్టసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా అట్టిపెట్టుకున్న సందర్భంలో చట్టసభల సభ్యుల, కార్య నిర్వాహకవర్గ సభ్యుల ప్రవర్తన ఎలా ఉండాలో ఖన్నా చాలా స్పష్టంగా నిర్దేశించారు. విద్వేషాన్ని ప్రోది చేయడాన్ని బలంగా అణచి వేయాల్సిందేనని చెప్పారు. న్యాయవ్యవస్థకన్నా చట్టసభలే ఎక్కువ అని ఉపరాష్ట్రపతి ధన్కడ్ అన్నప్పుడు సర్వోన్నతమైంది రాజ్యాంగమేనని ఖండితంగా చెప్పారు. న్యాయమూర్తి ఖన్నా ఏ భావజాలం వైపు మొగ్గకుండా చట్టాన్ని పరిరక్షించడం మీదే దృష్టి పెట్టారు. సంభల్‌లో జామీ మసీదు కింద శివాలయం ఉందన్న వాదనతో హింస చెలరేగినప్పుడు కూడా ప్రార్థనా స్థలాల చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయడానికి వీలు లేకుండా చేశారు. లేకపోతే ఈ పాటికి ఎన్ని మసీదులు, దర్గాల కింద శివలింగాల కోసం ‘‘భారత్ ఖోదో’’ కార్యక్రమాలు జరిగేవో! లేకపోతే జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ మందిరం, షాహీ ఈద్గ్గా-కృష్ణ జన్మభూమి వివాదం, భోజ్‌శాల-కమల్ మౌలా మసీద్ వ్యవహారం ఆధారంగా ఎంత రక్తం ఏరులై పారేదో! ఎన్నికల బాండ్లు చెల్లవని మునుపటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నాయకత్వంలోని బెంచి తీర్పు చెప్పినప్పుడూ న్యాయమూర్తి ఖన్నా విడిగా తీర్పు రాశారు. ఎన్నికల బాండ్ల కేసులో మొత్తం బాండ్లలో 50 శాతం, విలువనుబట్టి చూస్తే 94 శాతం బాండ్లు కోటి రూపాయలకు పైన ఉన్నవేనని తేల్చి కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి దన్నుగా నిలిచిన వైనాన్ని బయట పెట్టారు. న్యాయమూర్తి ఖన్నా ఆరు నెల్లే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ దాఖలైన ప్రతి వందకేసులకు 106 కేసులు తేల్చేసి తెమలని వివాదాల సంఖ్య తగ్గించడానికి ప్రయత్నమైతే చేశారు. అయినా ఒక్క సుప్రీంకోర్టులోనే ఇంకా తెమలని కేసులు 81,000 ఉన్నాయి. ఇది కొత్త ప్రధాన న్యాయమూర్తి గవాయ్ కి కూడా సమస్యే.
నూతన ప్రధాన న్యాయమూర్తి భూషన్ రామకృష్ణ గవాయ్ దళిత వర్గానికి చెందిన వారు. ఇంతకు ముందు ప్రధాన న్యాయమూర్తి అయిన మరో దళిత న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణ మాత్రమే.
2019 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న బి.ఆర్.గవాయ్ అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో భాగస్వామి. ఆయన అనేక వినూత్న తీర్పులు వెలువరించారు. 370వ అధికరణం రద్దు, ఎన్నికల బాండ్లు, పెద్ద నోట్ల రద్దు లాంటి కేసుల్లో తీర్పు చెప్పిన బెంచీల్లోనూ గవాయ్ సభ్యులుగా ఉన్నారు. ఈ సకల వ్యవహారాల్లోనూ సుప్రీం తీర్పులపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటిని వెలువరించడంలో గవాయ్ బాధ్యత కూడా ఉంది. అలహాబాద్ హై కోర్టు నుంచి విచిత్రమైన తీర్పులు వెలువడుతుంటాయి. అమ్మాయి ఛాతీని తడమడం, లేదా పైజామా బొందులు లాగడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు నిర్ఘాంత పరిచే తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ‘‘సంవేదనా రహితమైంది,’’ ‘‘అమానుషమైంది’’ అని గవాయ్ తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆరేళ్ల కాలంలో గవాయ్ దాదాపు 700 బెంచీల్లో భాగస్వామి. ఇందులో రాజ్యాంగ వ్యవహారాల నుంచి మొదలు పెట్టి అనేక అంశాల మీద ఎన్నదగిన తీర్పులు చెప్పారు. పేరుకు పోయిన కేసులను తెమల్చడం దగ్గర నుంచి, న్యాయమూర్తుల కొరత దాకా అనేక వ్యవహారాలను ఆరు నెలల స్వల్ప కాలంలో గవాయ్ ఎలా చక్కబెడ్తారో చూడాలి. వక్ఫ్ సవరణ చట్టం ఇటీవలే విచారణకు వచ్చినప్పటికీ పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి ఖన్నా ఆ విషయాన్ని కొత్త ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకు వదిలేశారు. ఇప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ సహజంగానే ఉంటుంది. 370వ అధికరణం రద్దు లాంటి విషయాల్లో వెలువరించిన తీర్పు ఉచితానుచితాల గురించి దీర్ఘ కాలం చర్చ జరగకుండా మానదు. పెద్ద నోట్లు చెల్లవని న్యాయమూర్తులు చెప్పి ఎన్నికల వ్యవస్థ మరింత భ్రష్టుపట్టకుండా సుప్రీంకోర్టు నివారించినప్పటికీ ఈ బాండ్ల ద్వారా సమకూరిన డబ్బు రాజకీయ పార్టీలకే వదిలేయడంలోని అనౌచిత్యానికి తీర్పు చెప్పిన న్యాయమూర్తులు అందరూ బాధ్యత వహించాల్సిందే. అందులో గవాయ్ కూడా ఉన్నారు. బుల్డోజర్ న్యాయం చెల్లదని చెప్తూ గవాయ్ చెప్పిన తీర్పు మాత్రం చరిత్రాత్మకమైందే. కనీసం పదిహేను రోజుల నోటీసు ఇవ్వకుండా ఏ నిర్మాణాన్నీ కూల్చే హక్కు అధికారులకు లేదని, ఒక వేళ అలా కూల్చివేస్తే ఆ భవనాన్ని పునర్నిర్మించి ఇవాల్సిన బాధ్యత ఆ అధికారులదేనని ఆ తీర్పులో పేర్కొన్నారు. అయినా యోగీ ఆదిత్యనాథ్ ఏలుబడిలో బుల్డోజర్లు విచ్చలవిడిగా విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి. చెప్పిన తీర్పులు అమలు చేయించే అవకాశం అత్యున్నత న్యాయస్థానికైనా లేకపోవడం పెద్ద లోపమే. ఆరు నెలల స్వల్పకాలంలో గవాయ్ నుంచి అద్భుతాలు ఆశించలేం కానీ న్యాయమార్గ పాలన గాడి తప్పకుండా ఏ మేరకు పాటు పడగలరో చూడడం అత్యాశ కాదు.