బీజేపీ ఫాసిస్టు పాలనతో దేశంలో సంక్షోభం
. సంఘ్‌పరివార్ మతోన్మాద కుట్రలు తిప్పికొట్టాలి
. ప్రజల కోసం మరో వందేళ్లు పోరాడటానికి సిద్ధం
. వెనిజులాపై దాడి ట్రంప్ ఫాసిజానికి నిదర్శనం
. అమెరికాను ప్రశ్నించే ధైైర్యం మోదీకి లేదు
. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో డి.రాజా
విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: చరిత్ర లేని వారు దేశభక్తులుగా చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా విమర్శించారు. వందేళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు అత్యంత కీలక ఘట్టమని, ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల ముగింపు సందర్భంగా ఆదివారం ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలతో బహిరంగ సభా స్థలి కిటకిటలాడింది. తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో రాజా మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో సీపీఐ ఆవిర్భవించిందని అంతకు ముందు 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మాత్రమే ఒక రాజకీయ చరిత్ర ఉందని వందేళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న ఆర్ఎన్ఎస్కు అసలు చరిత్ర లేదన్నారు. దేశ స్వాతంత్య్రంలోనూ ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటని రాజా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే సీపీఐ సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చిందని… అది దేశ చరిత్రలో అత్యంత కీలక ఘట్టమని రాజా అభివర్ణించారు. స్వాతంత్య్ర అనంతరం అనేక పరిణామాలలో కమ్యూనిస్టు పార్టీ అత్యంత కీలక భూమిక పోషించిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నాడని…మరో హిట్లర్ కావాలనుకుంటున్నాడని… ట్రంప్‌ను ఎర్ర జెండాలు ఎదుర్కొంటాయని రాజా స్పష్టం చేశారు. సామ్రాజ్యవాద ధోరణితో ట్రంప్ వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. మెక్సికో, కొలంబియా, క్యూబా వంటి దేశాలకు బెదిరింపులు చేయడం అనుచితమన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న ట్రంప్‌ను ప్రశ్నించే శక్తి భారత ప్రధాని మోదీకి లేదన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేస్తుందని, దీనిని నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిడి తీసుకు రావడం శోచనీయమన్నారు. పలస్తీనా అంశాన్ని ప్రస్తావిస్తూ పలస్తీనాకు స్వతంత్ర దేశంగా ఉండే హక్కు ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న ద్విరాష్ట్ర పరిష్కారానికి సీపీఐ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయని, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోందని, ఇది దేశ భవిష్యత్తుకు మరింత ప్రమాదకరమన్నారు. బీజేపీ ఫాసిస్టు పాలనతో దేశంలో సంక్షోభం నెలకొందన్నారు. ఫాసిస్టు శక్తులను ఎదుర్కొనేందుకు అన్ని లౌకిక శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బలమైన ఉద్యమ నిర్మాణాల ద్వారా మతోన్మాద శక్తులను అడ్డుకుంటామని రాజా ధీమా వ్యక్తం చేశారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ జరిగిన భారీ బహిరంగ సభ నూతన ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి, కాంగ్రెస్ ఎమ్మెల్యే శామ్యేలు, సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్జిత్ కౌర్, గిరీశ్శర్మ, అనీ రాజా, ప్రకాష్ బాబు, సంతోశ్ కుమార్, పల్లా వెంకటరెడ్డి, వినయ్ విశ్వం, రామకృష్ణ పాండా, కె.రామకృష్ణ, కుల్దేవ్, కేటీ రాజేంద్రన్, టీఏ మూర్తి, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ, నిషా సిద్ధూ, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సీపీఐ ఏపీ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నర్సింహ, సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సాబీర్ పాషా, అక్కినేని వన్పు, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, ఎంఎల్సీ ఎన్.సత్యం, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేంద్రరెడ్డి, ఆంధ్ర, తెలంగాణలకు చెందిన సీపీఐ జాతీయ సమితిసభ్యులు పాల్గొన్నారు.
భవిష్యత్ ఉద్యమాలమయం: నారాయణ
ఫాసిస్టుపాలనతో విసిగిపోతున్న భారతదేశ ప్రజలు మీVAద్యమానికి సమాయత్తం కావాలని సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. సీపీఐ సత్తా ఏంటో ఖమ్మం మహాప్రదర్శన రుజువుచేసిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ వీడియోను లైవ్‌లో చూపించాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రస్తుతం ప్రపంచాన్ని మోదీ కళ్లజోడుతో చూస్తున్నారన్నారు. మోదీకి ఆయన కట్టుబానిసలా మారిపోయారన్నారు. ట్రంప్ అంతర్జాతీయ టెర్రరిస్టు మాదిరిగా మారిపోయాడని విమర్శించారు. వెనిజులాపై దాడి ట్రంప్ ఫాసిజానికి పరాకాష్ఠ అని అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి జరిగిన దాడి కాదని, చమురు నిక్షేపాల కోసం అమెరికా సాగిస్తున్న వేటగా అభివర్ణించారు. నిధులు, నీళ్ల పంపిణీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి కూర్చొని చర్చించుకోవాలని చెప్పారు. న్యాయబద్ధమైన నీళ్లపంపిణీకి సీపీఐ కట్టుబడి ఉందని తెలిపారు. సీపీఐ వందేళ్ల స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.


