Homeఎర్రదండు కదిలింది

ఎర్రదండు కదిలింది

- Advertisement -

సీపీఐ శతవార్షికోత్సవాల ముగింపు సభ సందర్భంగా ఖమ్మంలో మహా ప్రదర్శన

. నభూతో నభవిష్యత్తులా జనసేవాదళ్‌ కవాతు
. ఎర్రబారిన ఖమ్మం
. ఎటుచూసినా అరుణ పతాక రెపరెపలే
. భారీ ప్రదర్శనతో సరికొత్త చరిత

ఖమ్మం నుంచి ఏబీ కూన
నిప్ప్పుకణికలు ఎగిసిపడినట్లుగా.. ఎర్రమందారాలు విరబూసినట్లుగా..పోరుగడ్డ ఖమ్మంలో ఎర్రదండు కదిలిన క్షణం ఉద్యమస్ఫూర్తిని రగిలించింది. పైకెగిసిన ఎర్రని బావుటాలు, జెండాల రెపరెపల పరవశం కమ్యూనిస్టు శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. కనీవినీ ఎరుగని రీతిలో సాగిన ఎర్రసైన్యం కవాతు ధ్వనులకు స్తంభాద్రి దద్దరిల్లింది. తెలంగాణ మారుమూల తండాల నుంచి తరలివచ్చిన ఆదివాసీల నత్యాలు, విప్లవ గేయాలు, జనజ్వాలను రగిలించే నినాదాల ీVAరు ఉప్పెనను మరిపించాయి. భారత కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు నిండటం ఓ చరిత్ర అయితే, శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ సందర్భంగా ఉద్యమాల ఖిల్లా ఖమ్మంలో జరిగిన మహా ప్రదర్శన మరో చరిత్రను సష్టించింది. ఈ చారిత్రక సన్నివేశాన్ని వీక్షించడానికి ఖమ్మం ప్రజలు బారులుతీరారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ సందర్భంగా ఖమ్మంలో సీపీఐ కార్యకర్తలు, అభిమానులు కదం తొక్కారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఖమ్మం పుర వీధులు కిటకిటలాడాయి. ప్రతి ఒక్కరూ అరుణ పతాకాన్ని చేతబూని ఎర్రని వస్త్రాలు ధరించి ఖమ్మంకు తరలి రావడంతో ఖమ్మం నలువైపులా ఎర్రబారింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే సుదూర ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు ఖమ్మం చేరుకున్నారు. నాగపూర్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల నుంచి కూడా ఎర్రదళం సభకు హాజరైంది. ఖమ్మం నగర ప్రధాన రహదారులన్నీ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల రాకతో దిగ్బంధనకు గురయ్యాయి. ఎటుచూసినా అరుణ పతాక రెపరెపలే కనిపించాయి. ట్రాఫిక్‌ స్తంభించడంతో ఖమ్మం నగరంలోకి చేరుకునేందుకు కిలోమీటర్ల కొద్ది నడిచి కార్యకర్తలు ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు. వందలాది వాహనాల్లో పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో యువత తరలి రావడం విశేషం. జనసేవాదళ్‌ కార్యకర్తలే కాకుండా బహిరంగ సభకు వచ్చిన వారిలో యువత ఎక్కువగా ఉన్నారు. క్రమశిక్షణగా మూడు కిలో మీటర్ల మేర నడిచి బహిరంగ సభా స్థలికి చేరుకున్న యువత… నాయకుల ఉపన్యాసాలకు, ప్రజానాట్యమండలి పాటలకు అలుపెరగకుండా కేరింతలు కొడుతూనే ఉన్నారు. వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించిన ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయల్లో పాటకు యువత ఊగిపోయింది. పూనకం వచ్చినట్లుగా బహిరంగ సభా స్థలి మొత్తం అరుణ పతాకాలను ఊపుతూ ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించారు. యువత ఊపు చూసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సైతం ఒక్కింత ఆశ్చర్య పోయారు. యువత హాజరైన తీరు చూస్తుంటే వందేళ్లు కాదు మరో వందేళ్లయినా సమ సమాజం కోసం కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం కోసం పోరాడతామన్న భావన స్ఫురించింది. వందేళ్ల ఉత్సవాలు చూడాలని వందల కిలో మీటర్ల మేర ప్రయాణించి 70 నుంచి 80ఏళ్లు పైబడిన వృద్ధులు, గతంలో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నాయకత్వం సభకు హాజరయ్యారు. వేలాది మంది బాలబాలికలు ఎర్రెర్రని దుస్తులు ధరించి, నత్యాలు చేస్తూ, బుల్లిబుల్లి అరుణపతాకాలను ఊపుతూ ప్రదర్శనకు హైలైట్‌గా నిలిచారు.
మూడు ప్రదర్శనలు-లక్షలాదిమంది జనం
బహిరంగ సభ సందర్భంగా ఖమ్మంలో మూడు ప్రదర్శనలు నిర్వహించారు. మొదటి ప్రదర్శన పెవిలియన్‌ మైదానం నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనసేవాదళ్‌ కార్యకర్తలు ఖమ్మం పుర వీధుల్లో కదం తొక్కారు. వరుసకు నలుగురు చొప్పున నిలబడిన ప్రదర్శన రెండు కిలో మీటర్ల మేర ఉండడంతో ప్రదర్శనను పెద్ద సంఖ్యలో నగర పౌరులు తిలకించారు. ముఖ్యంగా యువ మహిళల కవాతు ఆకట్టుకుంది. చిన్నారులు కదం తొక్కుతూ లెఫ్‌్ట రైట్‌ అంటూ నడుస్తూ ఉత్తేజాన్ని ఇచ్చారు. పదేళ్ల లోపు బాలలు సైతం ప్రదర్శనలో పాల్గొని భవిష్యత్తు తరం మాదేనంటూ మరో వందేళ్లయినా కమ్యూనిస్టు పార్టీకి ఢోకాలేదని తమ కవాతుతో నిరూపించారు. జనసేవాదళ్‌ కార్యకర్తల కవాతుకు సీపీఐ అగ్ర నేతలు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఏపీ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, చాడ వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం, బాగం హేమంతరావు తదితరులు నేతృత్వం వహించారు. జనసేవాదళ్‌ కార్యకర్తల తర్వాత సింగరేణి కార్మికులు, యువ మహిళలు, పశ్య పద్మ నేతృత్వంలో నాగళ్లు చేతబూనిన రైతులు, కోయ, లంబాడ, జానపద నృత్య కళాకారులు, వందలాది మంది డప్పు కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బతుకమ్మలతో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత న్యాయవాదులు, వైద్యులు, యువజన, విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో ప్రద ర్శన సాగింది. ఖమ్మం నయాబజర్‌ కళాశాల నుండి మరో ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శన మయూరిసెంటర్‌, జెడ్పీ సెంటర్‌, ఇల్లందు క్రాస్‌ రోడ్డు మీదుగా సభా స్థలికి చేరుకుంది. ఈ ప్రదర్శనకు రాష్ట్ర సహాయ కార్యదర్శి తకెళ్లపల్లి శ్రీనివాసరావు, బోస్‌, కె.శంకర్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ తదితరులు నేతృత్వం వహించారు. మూడవ ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభ మైంది. శ్రీశ్రీ విగ్రహం నుంచి రోటరీ నగర్‌, మమత రోడ్డు, ఇల్లందు క్రాస్‌ రోడ్డు మీదుగా సభా స్థలికి చేరుకుంది. జాతీయ సమితి సభ్యులు ఎస్‌కే సాబీర్‌పాషా, సీపీఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు నేతృత్వం వహించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు