Homeసంపాదకీయంచేతులెత్తేసిన ప్రైవేటు రంగం!

చేతులెత్తేసిన ప్రైవేటు రంగం!

- Advertisement -

కార్పొరేట్లను ప్రోత్సహించడం, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం…ఇదీ మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో ప్రధాన లక్ష్యం. ఈ విషయంలో చాలావరకు ఎన్‌డీఏ విజయం సాధించిందనే చెప్పవచ్చు.అలాగని ప్రైవేటురంగం ఏమైనా కళకళ లాడుతున్నదా ? అంటే అదీలేదు. ప్రైవేటురంగం మందగించిందని, 3 నెలల కనిష్ట స్థాయికి పతనమైందని పేర్కొంటూ హెచ్ఎస్బీసీ పీఎంఐ నివేదిక బట్టబయలు చేసింది. ఇది ప్రభుత్వ విధానాలకు చెంపపెట్టు. ఇంత జరిగినా మోదీ సర్కారు మారుతుందా అంటే అనుమానమే. పైవేటు రంగానికి ప్రభుత్వాలు ఎంతగా పెద్దపీట వేసినా, పారిశ్రామిక వృద్ధిలో ఆశించిన వేగం కనిపించడం లేదనే ఆందోళన తాజా గణాంకాలతో మరోసారి రుజువైంది. దేశీయ పైవేటు రంగ కార్యకలాపాలు మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని ‘హెచ్ఎస్బీసీ పర్చేజింగ్ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ)’ నివేదిక స్పష్టం చేయడం ఆర్థిక వ్యవస్థ పురోగతిపై నీలినీడలను కమ్ముకునేలా చేస్తోంది. ఒకవైపు ప్రభుత్వ రంగాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ, పైవేటు రంగానికి భారీగా రాయితీలు, దేశీయ ఆస్తులను కట్టబెడుతున్నా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం విధానపరమైన లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ మందగమనం కేవలం తాత్కాలికమని చెప్పకోవడానికి లేదు. ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. ప్రైవేటురంగం మందగమనం తెచ్చే ముప్పు అలాఇలా ఉండదు. బహుముఖ ప్రతికూల ప్రభావాలు సహజం. ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై చైన్రియాక్షన్ తరహాలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిరుద్యోగిత పెరుగుదల పెను ప్రమాదం. భారతదేశంలో ఉపాధి కల్పనలో పైవేటు రంగం సింహభాగాన్ని ఆక్రమిస్తోంది. ఈ రంగం కుదేలైతే కొత్త ఉద్యోగాల సృష్టి నిలిచిపోవడమే కాకుండా, ఉన్న ఉద్యోగాలకూ ఎసరు వస్తుంది. ఐటీ, తయారీ, సేవా రంగాల్లో లేఆఫ్లు (ఉద్యోగాల కోత) పెరిగే అవకాశం ఉంది. కొనుగోలు శక్తి క్షీణత ఇంకో విపరిణామం. ఆదాయ వనరులు తగ్గడం వల్ల మార్కెట్‌లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇది తిరిగి వస్తువుల డిమాండ్‌ను తగ్గించి, పారిశ్రామిక చక్రాన్‌ని మరింత మందగించేలా చేస్తుంది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల భారం ఊహించలేం. ఉత్పత్తి తగ్గడం, సరఫరా గొలుసులో లోపాల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. దీన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచితే, పెట్టుబడుల వ్యయం మరింత భారమై పైవేటు కంపెనీలు మరిన్ని నష్టాల్లోకి జారుకుంటాయి. ప్రధానంగా సేవలరంగం, తయారీ రంగం రెండింటిలోనూ వృద్ధి వేగం తగ్గడం ఈ మందగమనానికి ప్రధాన కారణమని హెచ్ఎస్బీసీ పీఎంఐ నివేదిక తేల్చి చెప్పింది. సేవల రంగం పీఎంఐ 17 నెలల కనిష్టానికి చేరుకోగా, తయారీ రంగం పీఎంఐ 55.0 నుంచి 54.5 పాయింట్లకు జారింది. మార్చి తర్వాత కొత్త ఆర్డ్ర్ల వేగం పడిపోయింది. మార్కెట్‌లో నెలకొన్న తీవ్రమైన పోటీ, గ్యాస్ కొరత వంటి సమస్యలు వ్యాపార విస్తరణకు అడ్డంకులుగా మారాయని కంపెనీలే స్వయంగా చెపుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలోనూ తయారీ రంగంలో ఎగుమతి ఆర్డర్‌లు 2023 మార్చి తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. డిమాండ్ మందగించడం వల్ల నియామక ప్రక్రియపై కూడా ప్రభావం పడింది. పైగా జూన్లో ఉద్యోగ కల్పన అత్యంత స్వల్పంగా నమోదైంది. తయారీ, సేవల రంగాల్లో కొత్త నియామకాలు పూజ్యం. ఏటా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ ఎంతగా భ్రమలు కల్పించినా, వాస్తవరీతి అలా లేదు. శవాన్ని భుజానకెత్తుకొని ఊరేగడం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వ రంగంపై కారుకూతలు కూసిన బీజేపీ నేతలు ప్రైవేటు రంగం కుదేలు కావడం పట్ల ఏమంటారు? భారతదేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలే కారణమనే విమర్శలు బలంగా వినబడుతున్నాయి. జాతీయ ఆస్తుల పైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యమూలు) విక్రయం ద్వారా క్రోనీ క్యాపిటలిజం (కొద్దిమంది కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడం) ప్రోత్సహించబడుతోందనే వాదన ఉంది. పన్ను తగ్గింపులు, బ్యాంక్ రుణాల మాఫీ, సులభతర వాణిజ్యం పేరిట నిబంధనల సడలింపు వంటి ఎన్నో ప్రయోజనాలను కార్పొరేట్లకు కల్పించినప్పటికీ, ఆ పెట్టుబడులు తిరిగి ఉపాధిగా మార్కెట్‌లోకి రాలేకపోతున్నాయి. లాభాలను పైవేటుపరం చేస్తూ, నష్టాలను ప్రభుత్వానికి బదిలీ చేసే ఈ విధానం వల్ల సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై, క్షేత్రస్థాయిలో పేదరికం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి సమూల మార్పులు అవసరం. పైవేటు రంగంపైనే పూర్తిగా ఆధారం పడకుండా, ప్రభుత్వం మౌలిక సదుపాయాల (రవాణా, విద్యుత్, డిజిటల్ నెట్‌వర్క్) కల్పనపై నేరుగా భారీగా పెట్టుబడులు పెట్టాలి. కార్పొరేట్ శక్తులను దీని నుంచి మినహాయించాలి. ఇది తక్షణ ఉపాధిని సృష్టించి మార్కెట్‌లో చైతన్యాన్ని తెస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) బలోపేతం అనివార్యం. కార్పొరేట్లకు మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఎంఎస్‌ఎంఈ రంగానికి సులభంగా రుణాలు, సబ్సిడీలు అందించాలి. క్షేత్రస్థాయిలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేది ఈ రంగమేనని ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గమే. అదేసమయంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వకపోతే, ఆర్థిక వ్యవస్థ మూలాలు ఎలా బలపడతాయి ? వ్యవసాయ రంగ సంస్కరణలు, గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు నిధుల పెంపు ద్వారా గ్రామీణ ప్రజల చేతుల్లోకి డబ్బు చేరేలా చూడాలి. ఇది అంతిమంగా వినియోగాన్ని పెంచుతుంది. అయితే, ప్రభుత్వ రంగాన్ని క్రమంగా పైవేటుపరం చేస్తూ వస్తున్న ప్రస్తుత పాలకులు, పీఎంఐ గణాంకాల హెచ్చరికల నేపథ్యంలో తమ వ్యూహాన్ని మార్చుకుంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజకీయ సామాజిక ఒత్తిళ్లు, ఆర్థిక మందగమనం సుదీర్ఘంగా కొనసాగితే ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. కాకపోతే ‘సంస్కరణ’ దిశగా మోదీ సాగుతారని ఆశించలేం. వ్యూహాత్మక రంగాలైన రక్షణ, ఇంధనం, రైల్వే వంటి వాటిలో పూర్తి పైవేటీకరణకు బ్రేక్ వేసి, ప్రభుత్వ నియంత్రణ ఉండేలా పీపీపీ నమూనాలను మరింత పారదర్శకంగా మార్చవచ్చు. సంక్షోభ సమయాల్లో పైవేటు రంగం చేతులెత్తేసినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలే ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంగా నిలుస్తాయి. ఈ సత్యాన్ని గ్రహించి, లాభాల్లో ఉన్న పీఎస్యమూల విక్రయాన్ని తాత్కాలికంగానైనా నిలిపివేసే యోచన చేయవచ్చు. ఆ బుద్ధి ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత బీజేపీకి కలుగుతుందా? హెచ్ఎస్బీసీ పీఎంఐ నివేదిక దేశ ఆర్థిక విధానాల పునఃసమీక్షకు ఒక హెచ్చరిక గంట. కార్పొరేట్లకు కొమ్ముకాసే విధానాలు ఆర్థిక వ్యవస్థకు శాశ్వత వృద్ధిని ఇవ్వలేవని స్పష్టమవుతోంది. కేవలం ఒక వైపు పైవేటుకు ఆస్తులు కట్టబెట్టడం, మరోవైపు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం వల్ల సంతులిత వృద్ధి సాధ్యం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి, ప్రజాధనాన్ని ప్రజా సంక్షేమానికి, ఉపాధి కల్పనకు మళ్లించేలా సమగ్ర, పారదర్శక ఆర్థిక వ్యూహాన్ని రూపొందించాలి. అప్పుడే మందగమనం నుంచి దేశం సురక్షితంగా బయటపడగలదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు