. 2018లోనే అతడి ప్రతిభను గుర్తించాం
. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్
న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్`2026లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్రేకఅవుట్ స్టార్‌గా మారతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. ఈ యువ బ్యాటర్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించే ఆటగాడిగా, అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకునే సత్తా అతడికి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 ఐపీఎల్ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్‌కు తొలి కోచ్‌గా వ్యవహరించిన పాంటింగ్, అప్పుడే అతడిలో అసాధారణ ప్రతిభను గుర్తించానని చెప్పారు. ‘అభిషేక్ శర్మ నా కోచింగ్‌లోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటికి అతడి వయస్సు సుమారు 17 ఏళ్లు. తొలి బంతినే నేరుగా బౌలర్ తలపైకి సిక్స్ లేదా ఫోర్‌గా కొట్టాడు’ అని రికీ పాంటింగ్ తెలిపాడు. ఆ స్ట్రెయిట్ బ్యాట్ షాట్ చూస్తేనే ఇతడు ప్రత్యేకమైన ఆటగాడని అర్థమైందని..అతడ్ని దిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేయొద్దని తాను ఎంతగానో ప్రయత్నించానని గుర్తు చేసుకున్నాడు. అతడు భవిష్యత్తులో సూపర్‌స్టార్ అవుతాడని జట్టు యాజమాన్యానికి చెప్పానని…ఇప్పుడు అదే నిజమైందని పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే దిల్లీ తరఫున 19 బంతుల్లో 46 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అభిషేక్… ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. 2019 నుంచి ఇప్పటి వరకు 71 ఇన్నింగ్స్‌ల్లో 1,753 పరుగులు, 162కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ జట్టుకు ప్రధాన బ్యాటర్‌గా మారాడు. 2024 జూలైలో టీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ, ఇప్పటి వరకు 37 ఇన్నింగ్స్‌ల్లో 1,297 పరుగులు సాధించాడు. అతడి సగటు 37.05 కాగా, స్ట్రైక్ రేట్ దాదాపు 195కి చేరుకుంది. ఇందులో రెండు సెంచరీలు, 8 అర్ధ సెంచరీలున్నాయి.
న్యూజిలాండ్‌పై కేవలం 14 బంతుల్లో అర్ధశతకం చేయడం అతడి కెరీర్ లో హైలైట్ గా నిలిచింది. రానున్న టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ ప్రదర్శనే భారత జట్టు భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అతడు పరుగులు చేస్తే భారత్‌ను ఓడించడం చాలా కష్టం అన్నాడు. అతడు ఫెయిల్ అయితే భారత్ కూడా ఇతర జట్లలాగే బలహీనంగా మారుతుందని జోస్యం చెప్పాడు. కాగా, డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫిబ్రవరి 7వ తేదీన ముంబైలో అమెరికాతో తమ ప్రపంచకప్ ప్రయాణం ప్రారంభించనుంది.


