120 బిలియన్ డాలర్లు ఆకర్షించాం
సీఐఐ సదస్సుపై దిల్లీలో మంత్రి లోకేశ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌పై ఆయన బుధవారం దేశ రాజధాని దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ సదస్సుకు ఆహ్వానించేందుకు దిల్లీ వచ్చానన్నారు. ‘ఎన్నికల సమయంలో ఆరు కీలక హామీలు ఇచ్చాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నాం. ఏ రాష్ట్రం ఇప్పటివరకు చేపట్టని ఎంప్లాయిమెంట్ విజన్‌తో ముందుకెళుతున్నాం. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నాం. గత 16 నెలల్లో 120 బిలయన్ డాలర్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇవి కేవలం సంతకాలకి పరిమితమైన ఎంవోయూలు కావు. నిజమైన ప్రాజెక్టులు. కొన్ని ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదుర్చుకోలేదు. ఉదాహరణకు అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఆర్సెలర్ మిట్టల్. ఆదిత్య మిట్టల్‌తో ఒక్క జూమ్ కాల్ ద్వారా ఆ సంస్థ వచ్చింది. మరో ఉదాహరణ గూగుల్. దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి డేటా సిటీ విశాఖకు వచ్చింది. దేశంలోనే ప్రముఖ 10 సోలార్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లో ఐదు సంస్థలు ఏపీని ఎంచుకున్నాయి. బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్రాజెక్ట్‌ను స్థాపిస్తోంది. ఎన్టీపీసీ రూ.1.65 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది’ అని లోకేశ్ వెల్లడిరచారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడులు ఆకర్షణ
రాష్ట్రంలో పెట్టుబడుల వేగం పెరిగిందని మంత్రి అన్నారు. స్థానిక కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు కూడా వెయ్యి కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్‌పాన్షన్ చేస్తున్నాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు ఇదే పద్ధతిలో వచ్చాయని, ఐటీ రంగానికే కాదు బ్లూ కాలర్ ఉద్యోగాలు, హాస్పిటాలిటీ వరకు ఇఇ విస్తరించిందన్నారు. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించిన తొలి రాష్ట్రాల్లో ఏపీ ఒకటని, వచ్చే మూడేళ్లలో 50వేల హోటల్ గదులు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేశ్ వివరించారు. ‘పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థ నాయకత్వం. చంద్రబాబు అనుభవం, ట్రాక్ రికార్డు. మూడోది పరిపాలన. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఏపీలో నమో (నాయుడు`మోదీ) ప్రభుత్వం ఉంది. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. ఈ కారణాల వల్ల యువ పారిశ్రామిక వేత్తలు ఏపీని ఎంచుకుంటున్నారు’ అని లోకేశ్ తెలిపారు. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు విశాఖ సీఐఐ సదస్సులో కుదుర్చుకోనుందని మంత్రి చెప్పారు. తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మొత్తం 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 12 అంతర్జాతీయ సంస్థలు, జీ20 దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ వక్తలు హాజరుకానున్నట్లు తెలిపారు. సదస్సులో మొత్తం 48 సెషన్లు, ఒక ప్లీనరీ, 27 సాంకేతిక సెషన్లు, 3 స్టాండ్ అలోన్ సెషన్లు, 11 రాష్ట్ర సెషన్లు ఉంటాయని వివరించారు. పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే సమయంలో రూ.2.7 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయని మంత్రి లోకేశ్ వెల్లడిరచారు.


