Homeతెలంగాణడిజిటల్‌ వ్యవసాయంలోదూసుకుపోదాం

డిజిటల్‌ వ్యవసాయంలోదూసుకుపోదాం

- Advertisement -

. కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీలతో చిన్న, సన్నకారుల రైతుల అనుసంధానం
. సాగు వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యం
. మంత్రి శ్రీధర్‌ బాబు

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : డిజిటల్‌ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ సంకల్పమని వివరించారు. సాగులో నూతన ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. కృత్రిమ మేథ(ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) లాంటి కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ ను రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఎలా అనుసంధానం చేయాలనే అంశంపై మంగళవారం సచివాలయంలో జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ ‘ఫ్రాన్‌హోఫర్‌ హెచ్‌హెచ్‌ఐ’ ప్రతినిధుల బృందంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. రాష్ట్ర జనాభాలో సుమారు 55 శాతం మందికి జీవనోపాధి కల్పిస్తోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు తన చేయూతను అందిస్తోంది. మరోవైపు కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ కు రాష్ట్రం గ్లోబల్‌ హబ్‌ గా మారింది. ఇలాంటి తరుణంలో డిజిటల్‌ వ్యవసాయంలో తెలంగాణను ఆదర్శంగా నిలపాలని సంకల్పించాం’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు వివరించారు. ‘రోజురోజుకూ వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. పైగా… సాగులో పురుగు మందుల వినియోగం పెరిగి పర్యావరణానికి ఎంతో హానీ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో పెట్టుబడి వ్యయం, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలంటే కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ ను వ్యవసాయానికి అనుసంధానించాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగానే మా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. టెక్నాలజీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తోంది’ అని వివరించారు. అత్యాధునిక సెన్సార్ల ద్వారా నేల స్వభావాన్ని రైతులు ముందే తెలుసుకోవచ్చునని, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించొచ్చని చెప్పారు. ఫలితంగా రసాయనాల కొనుగోలు ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా వేములవాడకు సమీపంలోని మూడు గ్రామాల్లో ‘ఫ్రాన్‌హోఫర్‌ హెచ్‌హెచ్‌ఐ’ అధ్వర్యంలో అమలవుతున్న ‘యాక్సిలరేటింగ్‌ క్లైమేట్‌-రెసిలియెంట్‌ అగ్రికల్చర్‌ ఇన్‌ తెలంగాణ’ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చొరవ చూపాలని సంస్థ ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, రాష్ట్ర సీడ్స్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, జర్మనీ రాయబార కార్యాలయం (న్యూదిల్లీ) ఫుడ్‌, అగ్రికల్చర్‌ డివిజన్‌ హెడ్‌ వోల్కర్‌ క్లైమా, ఫ్రాన్‌ హోఫర్‌ హెచ్‌ హెచ్‌ ఐ ప్రతినిధులు డా.సెబాస్టియన్‌ బోస్సే, డా.రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు