యువతకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సూచన
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్… యువతకు మంచి సందేశం ఇచ్చారు. దయచేసి డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లవద్దని సూచించారు. చెన్నై విమానాశ్రయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత కాలంలో యువత పెడదోవ పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేని జీవితం నరకప్రాయమవుతుందని హెచ్చరించారు. యువత కేవలం సినిమాల్లోని స్టంట్లు, నటుల వేషధారణ చూసి ప్రభావితమై బైక్ రేసింగ్ వంటి ప్రమాదకర పనులకు పాల్పడటం సరికాదని… అది ప్రాణాపాయానికి దారితీస్తుందని హితవు పలికారు. చదువుకోవాల్సిన వయసులో విద్యపై పూర్తి దృష్టి సారించి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కహాల్ వంటి భయంకరమైన వ్యసనాలకు బానిసలైతే వ్యక్తిగత జీవితమే కాకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా చిన్నాభిన్నమైపోతాయని భావోద్వేగంగా మాట్లాడారు. చెడు అలవాట్లు ఉన్న స్నేహితులకు వీలైనంత దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రాథమిక కర్తవ్యమని గుర్తుచేశారు. ఇదే క్రమంలో తన తదుపరి సినిమాలపై స్పందిస్తూ, భారీ అంచనాలున్న ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని వెల్లడించారు. అలాగే కమల్ హాసన్ నిర్మాణంలో, సీబీ చక్రవర్తి దర్శకత్వంలో రాబోతున్న ‘తలైవర్ 173’ ప్రాజెక్ట్ గురించిచెబుతూ తన పనిని తాను నిబద్ధతతో కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లొద్దు
- Advertisement -


